Tuesday, October 28, 2014

రత్నపాప కళ్ళు

"రావుడు నాస్తానివిట్రా అయితేనూ.. ఈ పూటకి తినే వెళ్దువులే. వారం సంగతి ఆయనకోమాట చెప్పి, రావుడిచేత కబురంపుతాను.. ఏం?" ఎటూ తేల్చకుండా లోపలికి వెళ్ళిపోయారావిడ.

దిక్కులు చూసాడు బొజ్జన్న. తల్లి వెనకే లోపలికెళ్ళిన రామం వస్తే బావుండునని ఎదురుచూస్తున్నాడు. ఎదురుగా ఉన్న పంచపాళీ గుమ్మంలోంచి తప్పడడుగులువేస్తూ వస్తున్న పాపాయిని చూసి పలకరింపుగా నవ్వాడు. 

"గోపన్న కూతురు కాబోలు.." అనుకున్నాడు రామం మాటలు గుర్తొచ్చి..

"మా ఇంట్లో గోపన్న, మాధవ, శీను.. నేను. గోపన్నకి పెళ్ళైపోయింది." పెద్దబడిలో కొత్తగా చేరిన బొజ్జన్నతో స్నేహం కలుపుకుని, వారం అడిగేందుకు తమ ఇంటికి తీసుకొస్తూ చెప్పాడు రామం.

పిల్లదాని వెనకే బయటకి వచ్చి, వసారాలో ఉన్న గూడు దగ్గర నిలబడి ఏదో వెతుక్కుంటున్నాడొకతను.

'వాళ్ళ నాన్న.. గోపన్న కాబోలు..' వెనకనుంచే పోల్తి పట్టుకోడానికి ప్రయత్నించాడు బొజ్జన్న.

పిల్ల కేరింతలు కొడుతోంది. పంచపట్టున స్థంభాన్ని పట్టుకుని బొజ్జన్నతో దోబూచులాడుతోంది. నవ్వుతున్నాడా కుర్రాడు. లోపల్నుంచి రామం మాటల్లా వినిపించి చెవులు రిక్కించి అటువైపు చూశాడు. ఇటువైపు నుంచి ఏదో అలికిడి..

యధాలాపంగా పిల్లవైపు తలతిప్పేసరికి, వారగా ఉన్న గంగాళంలోకి కాళ్ళెత్తి తల ముంచేసి జారిపోతూ తపతప కొట్టుకుంటోంది. గభాలున ఉరికాడు. పిల్లని లాగుతూనే ఒక్క కేకపెట్టాడు.. "ఏవండీ..పాపాయి .." అని.

అతను ఒక్కంగలో వచ్చి పిల్లని అందుకుని పైకండువాతో మొహం అద్ది, భుజానికెత్తుకుని వీపు రాశాడు. ఉక్కిరిబిక్కిరైందేకానీ పిల్ల గట్టిదే. మిటకరించి చూస్తోంది. 

"అమ్మా.. ఈ భడవకాన పనులు చూడు." చిరుకోపంగా పిల్లని అదిలిస్తూ అరిచాడు. లోపల్నుంచి రామం, వాళ్ళమ్మగారు, పంచపాళీలోంచి పిల్లతల్లీ ఒక్కసారి పరిగెత్తుకొచ్చారు. పిల్ల ఉరికి వాళ్ళమ్మ చంకెక్కింది

"ఏవైందిరా మాధవా.." రామం వాళ్ళమ్మగారడిగారు గాభరాగా..
"గంగాళంలో పడబోయింది. ఈ అబ్బాయ్ చూశాడు కాబట్టి.. "
"హమ్మయ్యో..! గండం గడిచింది లేచిన వేళ బావుండీ.. ఏమే రాకాసీ.. ఏం పనులవీ!!"

'మాధవా! గోపన్ననే అన్నంటాడనమాట రామం. మిగిలినిద్దర్నీ పేరుపెట్టే.. ' అనుకుంటూ బొజ్జన్న అతడిని పరిశీలించాడో క్షణం.

కాసేపటికి భోజనానికి పిలుపొచ్చింది. వారమూ దొరికింది.
***
"ఒట్టురా రామం.. మీ మాధవ ఆ ఇంటికెళ్తూండగా చూశాను." చెప్పనా వద్దా అన్న సంశయాన్ని జయించి చెప్పేశాడు బొజ్జన్న.
"ఎవర్ని చూసి ఎవరనుకున్నావో! మాధవెప్పుడూ పట్నంలో ప్రింటింగ్ ప్రెస్ లోనో, ఈశ్వరీ టాకీసు దగ్గరో ఉంటాడ్రా." నమ్మకం కలగలేదు రామానికి.
"పోనీ, ఈసారి కనిపిస్తే నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా.. సరేనా?" పట్టుదలగా చెప్పాడు బొజ్జన్న.
"బొజ్జా.. నిజమేనేంట్రా?" స్నేహితుడివైపు సూటిగా చూస్తూ అడిగాడు రామం.
బొజ్జన్న సమాధానం చెప్పలేదు. కుడిచెయ్యి నడినెత్తిన పెట్టుకుని నిలువుగా తలూపాడు.

***
అది మొదలూ స్నేహితులిద్దరూ ఎదురుచూసిన రోజు సరిగ్గా వారం తరువాత తటస్థించింది.

"వెళ్లాడిప్పుడే.. పదరా.." వీధరుగు మీద కూర్చుని చదువుకుంటున్న రామాన్ని తొందరచేస్తున్నాడు బొజ్జన్న. కుతూహలాన్ని మించిన భయం, దాన్ని మించి ఉరకలేస్తున్నఉత్సాహమేదో ఆ కుర్రాళ్ళిద్దరిలో. . బొజ్జన్న ధైర్యంగా అడుగులు వేసేసాడు. కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి. వీధిదీపం వెలుగు తమపై పడకుండా గోడ దౌరునానుకుని చిన్నచిన్న అడుగులేస్తున్నారు. ఆ ఇల్లొచ్చేసింది! ఆగి మొహాలు చూసుకుని ఊపిరి వేగం అదుపులోకొచ్చేదాకా నిలబడిపోయారు. ఆ ఇంటిపక్క సందువైపు చెయ్యి చూపించాడు. మెత్తగా అడుగులు పడుతున్నాయ్. గుండెచప్పుడు తెలుస్తూనే ఉందిద్దరికీ..

సందులో మట్టిగోడ వాళ్ళ నడుందాకానే వచ్చింది. దానికవతల ఖాళీ స్థలం చూపించి, రామం సైగ చేసాడు.. అవసరమైతే దూకేద్దామన్నట్టుగా. అదేమీ పట్టనట్టు.. చిరపరిచితమైన దోవన్నట్టూ.. బొజ్జన్న గోడనానుకుని నడుస్తూ రెండో కిటికీ దగ్గరకి వెళ్ళి ఆగాడు. రామం కణతలు అదురుతున్నాయ్. పక్కగా నక్కాడు. బొజ్జన్న కాస్త జరిగి కిటికీ తలుపు సుతిమెత్తగా తోసాడు. తలుపు చప్పుడు కాకుండా తెరుచుకున్నాక ఊపిరి వదిలారిద్దరూ.. క్షణమాగి ఆ చిన్న సందులోంచి లోపలికి చూస్తున్నాడు బొజ్జన్న.. రామానికేం కనిపించలేదు.

"ఏంట్రా.." గుసగుసలాడాడు.
"ష్... విను."

కాసేపటికి ఆ గదిలోని మసకవెలుతురికి ఇద్దరి కళ్ళూ అలవాటు పడ్డాయి. నవ్వులు వినిపిస్తున్నాయ్.. గలగలలు. కనిపించేది మాత్రం చీకటే. కాసేపున్నాక ఆ వినిపిస్తున్న మగగొంతు మాధవదే అని ఒప్పుకుని తలూపాడు రామం. చీకట్లోనే గర్వంగానవ్వాడు బొజ్జన్న. వినిపిస్తున్న మాటలు క్రమంగా ఆగిపోయాయి.

***

"హైమావతే.." నమ్మకంగా చెప్పాడు బొజ్జన్న. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రామం.
"అయినా ఇదేం రోగంరా.." మళ్ళీ తనే అన్నాడు.
"ఏ రోగమో వచ్చేదాకానే.." కోపంగా చెప్పాడు రామం.
"వస్తాయంటరా?"
"రావూ మరి..." తనకు తెలిసిన విషయాలన్నీ ఉత్సాహంగా కథలు కథలుగా చెప్పుకొచ్చాడు రామం.
"ఇంట్లో చెప్తావా మరి?"
"ఈ వీధిలోకొచ్చినందుకు ముందు మన మక్కెలిరగదంతారు. గప్ చుప్.." రామం నోటిమీద వేలుంచుకుని చెప్పాడు.

***
గ్రామదేవత పండగెళ్ళిన రెండో రోజు మునిమాపువేళ పాలెం వైపు వెళ్తున్న గూడుబండిలో హైమావతి కనిపించింది వాళ్ళకి. ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. పరిగెత్తుకుని ఇంటికెళ్లారిద్దరూ.. మాధవ ఆ చివరి వీధిమలుపు తిరుగుతూ కనిపించాడు.

"పట్నమెళ్తున్నాడంటావా?" గుసగుసగా అడిగాడు బొజ్జన్న.
"ఈవేళప్పుడెలా వెళ్తాడ్రా?"
స్నేహితుడి మాటలకి నిజమే అన్నట్టు తలూపాడు.
కాసేపు తర్జనభర్జనల తరువాత అన్నాడు రామం.."వాళ్ళింటికెళ్ళి చూసొద్దామా..?"

రామవే ఆ మాటనేసరికి ఎక్కడలేని హుషారొచ్చింది బొజ్జన్నకి.. క్షణాల్లో ఇద్దరూ ఆ ఇంటిసందులోకి చేరుకున్నారు.

అవే గలగలలు.. అదే నవ్వు.. గుసగుసగా మాధవ మాటలు!

"అయితే రత్నపాప!" అన్నాడు రామం కాసేపటికి ఆ వీధి దాటి వస్తూ..
"ఛీ.. కర్రిపాప. అదెలా నచ్చిందిరా?" ఆశ్చర్యపోయాడు బొజ్జన్న.
"అది లేకపోతే ఇదయుంటుంది.. ఎవర్తైతేనేం." అసహ్యంగా మొహం పెట్టాడు రామం.

***

"దేవుడెరగని గొందుల్లేవనీ... మా గోపన్న పట్టేసుకున్నాడ్రా మాధవని." బడికి రాగానే చెవిలో చెప్పాడు రామం.
నిజమా.. అన్నట్టు కళ్ళు పెద్దవి చేసాడు బొజ్జన్న. రామం తరువాత మాట్లాడుకుందామన్నట్టు సైగ చేసాడు.

***

"ఇంటా వంటా ఉందట్రా! ఏదో తోచిన పని చేసుకుంటున్నావులే అనుకున్నాం. ఈ యేడు పెళ్ళి చేస్తే కోడలొస్తుందని ఆశపడుతున్నానే! సరైన పనేనా ఇదని? మా తలకొట్టేసావురా తండ్రీ. బుద్ధిగా ఉంటానని మాటివ్వకపోతే నాకు ఏ నుయ్యో గొయ్యో గతి.. అంతే." సన్నగా శోకాలు పెడుతున్నారావిడ. వీధిలోంచే వెనుతిరిగిపోయాడు బొజ్జన్న. లోపలేం జరుగుతోందో తెలుసు కనుక..
***

"మదరాసెళ్తానంటున్నాడు. పెళ్ళి మాత్రం ససేమిరా అని భీష్మించుక్కూర్చున్నాడు."
"మీ అమ్మగారేడుస్తున్నార్రా పాపం.." బొజ్జన్న జాలిగా అన్నాడు.
"వాడు మూర్ఖుడు. వెళ్ళనీ.. అన్నారు నాన్నగారు."
"మారుతాడేమోలే." అన్నాడు బొజ్జన్న.
"పిల్లకాలువలోంచి సముద్రంలోకి చేరినట్టు.. అని వదిన ఒకటే సణుగుతోంది. వాళ్ళ పిన్నికూతుర్నిద్దామనుకున్నార్లే వీడికి.."
"ఓహో.."
"రేపుదయం ప్రయాణమట. నిన్న సాయంత్రమనగా వెళ్ళాడు బయటికి. ఇంకా ఇంటికి రాలేదు. ఏం చేస్తాడో మరి."
"అవునా!!"

***

ఆ గదిలో ఆ పూట దీపం కొండెక్కలేదు. మంచానికి ఆనుకుని నేలమీద కూర్చున్నాడతను. దీపపు వెలుగు గోడమీద అతని బొమ్మగీసింది. అతని ఒడిలో ఆమె ఒదిగి పడుకుంది.

"రత్నమాణిక్యాలూ.. " పొదువుకున్నాడు మాధవ.
 ఆమె గాజులారోజు గలగల్లాడడం లేదు. పెదవి నవ్వులు పూయడం లేదు.

"వచ్చేయ్ నాతో పోనీ.."
రాతిబొమ్మ నిశబ్దాన్ని మాత్రమే పలుకుతోంది.

"సరే.. నన్ను మర్చిపోనని మాటివ్వు చెప్తాను." ఏదో ఆలోచన కొలిక్కి వచ్చినట్టు తలవిదిలించి చెప్పాడు.

ఉప్పెనలా అతన్ని ముంచేసింది. తనకు తెలిసిన భాషలో.. అతనికి మాత్రమే అర్ధమయ్యే భాషలో.. ఆమె దేహం మాట్లాడుతూనే ఉంది.. చాలాసేపటిదాకా..

***
రామం చదువుకి పట్నానికెళ్ళాడు. బొజ్జన్న ఏకంగా పాట్నా వెళ్ళాడు.. దూరపుబంధువులు చదివిస్తానన్నారని. స్నేహితుల ఉత్తరాల్లో కచ్చితంగా మాధవ ఉండేవాడు. ఆ సారి ఉత్తరం చదివి బొజ్జన్న నోరు వెళ్ళబెట్టేశాడు.
"బొజ్జా.. దాన్సిగదరగా! తంతే బూరెల గంపలో పడిందిరా రత్నపాప! మొన్న సెలవులకెళ్ళినప్పుడు నారాయణ చెప్పాడు. ఉన్నట్టుండొకరోజు సినిమా వాళ్ళ కారొచ్చిందట రత్నపాపకోసం. హైమావతి కిందటేడే పాలెం వెళ్ళిపోయింది కదా.. ఇదొక్కర్తే ఉండేది మొన్నటిదాకా. వెళ్ళిందల్లా తంగప్పన్ ప్రొడక్షన్ హౌస్ లో పడిందిరా బాబు. పేపర్లో చూశానిందాకే.. 'కొత్త తార రత్నమాల..' అని. పోలిక పట్టలేకపోయానసలు!! ఇంద్రజాలమా ఇంకేవన్నానా సినిమా మేకప్పంటే.."
***

శీను పెళ్ళికి వెళ్దామంటే బొజ్జన్నకి పరీక్షలు అడ్డొచ్చాయ్. రామం పంపిన శుభలేఖతో పాటూ వచ్చిన ఉత్తరంలో మాధవ కబుర్లేమీ లేవీసారి. అన్నీ రత్న.. మాల విశేషాలే! ఆ ముందు ఉత్తరంలో పేపర్ కటింగ్ కూడా పంపాడు రామం.

తన జవాబులో మాధవ గురించి వాకబు చేస్తే, రామం ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు. "అదృష్టవంతుడ్ని చెడిపేవాడూ లేడు. మూర్ఖుడ్ని మార్చేవాడూ లేడు.. వీడు ఆ మదరాసు రోడ్ల మీద పిచ్చాడై తిరుగుతాడేమో దాని సినిమా పూర్తయ్యేసరికి. శొంఠికొమ్ములా ఎన్నాళ్ళురా అని అమ్మ గింజుకోని రోజు లేదు. అన్నట్టు చెప్పానా నీకూ.. శీను కి వదినా వాళ్ళ పిన్ని రెండోకూతుర్నే ఇచ్చారు."

***
'దేవకన్య ' చూడడానికి బొజ్జన్నకి కుదరలేదు. రామం సలహాతో 'రాచిలుక ' వచ్చే సమయానికి ఊళ్ళో ఉండేలా చూసుకున్నాడు. అయితే బొజ్జన్న మచిలీపట్నంలోనూ, రామం వాళ్ళ ఊళ్ళోనూ చూశారా సినిమా..

***
"అవేం కళ్ళురా అసలు!! రవ్వలంటే రవ్వలే.. మీవాడు ఎందుకు పడిచచ్చేవాడో ఇప్పుడర్ధమవుతోంది. మనూళ్ళో ఆ వీధిలో మనిషంటే నమ్మగలమా అసలు!!" రామానికి రాశాడు బొజ్జన్న.. 'గరికపూలు ' చూశాక.

***

రామానికి సంబంధం కుదరగానే బొజ్జన్న రెక్కలుకట్టుకు వాలిపోయాడు. పెళ్ళివారిల్లు కలియదిరుగుతున్న పిల్లల్లో.. పాలకంకిలా ఎదిగిన గోపన్న కూతుర్ని చూసి బొజ్జన్న ఆశ్చర్యపోయాడు.. కాలం పరిగెడుతుందని.

ఆ సందట్లోనే బొజ్జన్నకి,  వెంకట్రాయుడు గారి చెల్లెలి కూతుర్ని ఇస్తామని అడిగారు. ఆ మాటల్లో ఉండగా అప్పుడే దిగిన వెంకట్రాయుడి బంధువొకరు చెప్పిన వార్త.. మాధవ ఉత్తరదేశంలో కనిపించాడని. రామం వాళ్ళమ్మగార్ని పట్టుకోతరం కాలేదెవ్వరికీ.. ఆ సందర్భంలో బొజ్జన్న కాస్త చిన్నబుచ్చుకున్నా ఆమె మొహం చూసి జాలే పడ్డాడు.

***
"మీ అమ్మగారి ఉసురే తగిలిందిరా దానికి. బంగారంలాంటివాణ్ణి పిచ్చాణ్ణి చేసొదిలేసింది. ఐదో సినిమా తరువాత మాయం! రకరకాలు రాస్తున్నారు పత్రికల్లో.. చదివావా?" కొత్తకాపురం, ఆదాయవ్యయాల విశేషాల తరువాత బొజ్జన్న రామానికి ఈ ముక్క రాయడం మర్చిపోలేదు.

***
"కాలం గొప్ప మందురా బొజ్జా కొన్నిటికి. మా అమ్మే మర్చిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరికోసం ఎవరాగుతారు? ఎవరికి ఎవరు బాధ్యులు? దాని పాపాన అదే పోయిందిలే."

***

రత్నపాప కళ్ళు.. ధారగా కన్నీళ్ళు..
"చెట్టి పెద్దాయన. నేనంటే చాలా నమ్మకం. ఇక్కడంతా బావుంది. వచ్చేసెయ్.. విజయవాడ వెళ్ళిన కారు నీకోసం మనూరు పంపమని అడిగాను. శనివారం నాడు కారొస్తుంది. బయల్దేరు." మాధవ అక్షరాలు మసక మసగ్గా కనిపిస్తున్నాయి.

***

రత్నపాప కళ్ళు.. ధారగా కన్నీళ్ళు..
"వద్దు. నీకు నచ్చనిదేదీ చెయ్యొద్దు. వెళ్ళిపోదాం.. ఎక్కడికైనా." మాధవ గొంతు అనునయంగా.. కౌగిలి భద్రంగా..