Friday, February 28, 2014

గాలిసంకెళ్ళు ~ 15

కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు"  ఇక్కడ.. 

'కౌముది'కి ధన్యవాదాలతో..

Monday, February 10, 2014

శతమానం భవతి

గొంతుక్కూర్చుని మౌంజి పేనుతున్న నరసింహం దృష్టి అదాటున వీధి వైపు మళ్ళింది. అనంతప్ప సకుటుంబంగా కోరడి వెలుపల చెమటలోడుకుంటూ నిలబడి ఉన్నాడు.

నరసింహం చాటంత మొహం చేసుకుని "బావా.." అని సంతోషంగా కేక వేసాడు.  వెనగ్గా నిలబడ్డ వసంతలక్ష్మి అన్నగారి వైపు చూస్తూ పలకరింపుగా నవ్వుతోంది. ఆ పక్కనే ఉన్న చిన్నారిపై నరసింహం చూపు ఒక్క క్షణం తారట్లాడింది.

పీట మీద నుండి గభాలున లేచి రెండంగల్లో వాళ్ళని చేరాడు. బావగారి చేతిలోంచి సంచీ అందుకుని, "బావా.. కులాసానా? ఏవమ్మలూ.. " అంటూ ఆ దంపతులకి లోపలికి దారిచ్చాడు.
"ఏవే చిన్నారీ.. ఝెటకా ఎక్కొచ్చావేమే?"  అని మేనకోడల్ని పలకరించాడు.
"ఏవి కులాసానో బావా! ఒళ్ళు హూనమైపోయిందనుకో. నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుంటే కానీ స్థిమిత పడలేను. చిరచిర.. " అంటూ వాకిట్లో నిలబడిన అనంతప్పకి కాళ్ళమీదకి నీళ్ళు ఇచ్చింది వసంత.

కాళ్ళు కడుక్కొచ్చి వీధి గదిలో ఉయ్యాలబల్ల మీద ఉస్సురంటూ కూర్చున్నాడు అనంతప్ప. తాటాకుబుట్టలో ముంజగడ్డి పడేసి, సగం పేనిన అల్లికని మరో చేత్తో పట్టుకుని వచ్చి నిలబడ్డ అన్నగారికి వంగి దణ్ణం పెట్టబోయింది వసంత. ఆగమన్నట్టు చెయ్యి చూపించి బుట్ట గోడవారన పెట్టి వచ్చాడు నరసింహం.

"దీర్ఘసుమంగళీభవ.. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు" దీవించి చెల్లెలి ముఖంలోకి తరచి చూసాడు. ప్రయాణపు బడలిక మినహాయిస్తే ఆమె ముఖం ఎప్పట్లానే కళకళ్ళాడుతూ ఉంది. 'ఒక్క మగనలుసు పుట్టేస్తేనా.. ఇంకేవిటి లోట'నుకున్నాడు మనసులోనే. తల్లితో పాటూ తనూ మావయ్యకి ఓ దణ్ణం పెట్టేసి 'వెళ్ళనా?' అని కళ్ళతోనే అభ్యర్ధిస్తున్న చిన్నారిని వెళ్ళమన్నట్టూ తలూపింది వసంత. వీధిలోకి తుర్రుమందాపిల్ల. ఊర్నుంచొచ్చిన నేస్తం కోసం వీధి గుమ్మంలో అప్పటికే పడిగాపులు పడుతున్నారు ఇద్దరమ్మాయిలు.

"వదినేదీ?" వసంత అన్నగారిని ప్రశ్నించింది.
"పెరట్లో ఉంది. సాల అలుకుతున్నారు."
"అయ్యో, కాస్తాగితే నేనూ వద్దునుగా! పాపం నడుం నొప్పి మనిషి కూడానూ!" నొచ్చుకుంటూ పెరట్లోకి బిరబిరా నడుస్తున్న చెల్లెలితో నవ్వుతూ చెప్పాడు నరసింహం.
"మీ వదినకి ఊరంతా పనివాళ్ళే. వెన్ను వంచదు. నువ్వేం బెంగపడకు."

"ఏం బావా.. పనులవుతున్నాయా? మౌంజి పేనుతున్నావా! పవిత్రాలు కూడా ఇప్పట్నుంచీ సిధ్ధపెట్టేస్తున్నావా ఏం?" నవ్వాడు అనంతప్ప.
"అదేం లేదులే బావా. ఏవో తోచిన పనులు చేసి పక్కనపెడుతున్నాను."
"ఊరిఖే కంగారు పడకు. అవే అవుతాయ్. ఎవరెవరొస్తున్నారేం?"
"మా చిన్నాన్నగారూ, చిట్టి మావయ్యా ఉదయానికి వస్తారేమో. ఇక వాళ్ళ వాళ్ళు ఏమో, ఏం చేస్తారో!" నిట్టుర్చాడు నరసింహం.
"ఆ.. వచ్చినవాళ్ళే వస్తార్లే. మేవొచ్చేసేం కదా! నువ్వు బెంగపడకు. అయినా నువ్వొక్కడివి చాలవూ.. అన్నీ ఒంటిచేత్తో సంబాళించుకొస్తావు. నాలుగూళ్ళదాకా వందల పెళ్ళెళ్ళు చేయించున్నావు. ఇంతోటి వడుక్కి పెద్ద బ్రహ్మాండమేవిటి చెప్పు! పిల్లాడికి వడకపోగు వేసేందుకు నువ్వున్నావ్. అక్షింతలు వేసేందుకు మేవున్నాం. ఇంకేం కావాలయ్యా?"
"అంతేలే! అయినింటి పిల్లని చేసుకోవాలని ఇందుకే అంటారేమో! చుట్టాలకీ పక్కాలకీ కరువువాచిపోయాం." నిర్లిప్తంగా ఉంది నరసింహం మొహం.
"అబ్బబ్బా.. తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు! నీ పెరట్లో ఏ లంకెబిందెలో ఉన్నాయని ప్రచారం చేయిద్దునేంటీ?" మేలమాడాడు అనంతప్ప.
"ఆ పుణ్యం కట్టుకోకు బావా! పెరడంతా నన్నే తవ్విపొయ్యమంటుంది మహా ఇల్లాలు. మా తండ్రి గారు వాళ్ళ తాతగారికి మాటిచ్చారని తల్లి లేని పిల్లైనా, మప్పితంగా ఉంటుందేమో తెచ్చి చేసుకున్నాం. ఉన్న అన్నదమ్ములేమో ఉండీలేనివారే. ఆడపిల్ల పీటల మీద కూర్చుంటూంటే ఓ పూట ముందన్నా రావాలన్న ఇంగితముండక్కర్లా!! ఇలా వీడి వడుగు నిర్ణయించామని నెల్లాళ్ళ నాడు శుభలేఖ రాస్తే కూడా పత్తాలేరు. ఈవిడ రొద భరించలేక మళ్ళీ క్రితం వారమింకో ఉత్తరం రాశాను. ఉహూ.. కిమన్నాస్తి! వస్తే ఆ ముండల ముఠాకోరు.. చినబామ్మర్ది.. వాడు దిగబడతాడు ఏ అపరాహ్ణం వేళకో. ఈవిడ అదే లోకోపకారమన్నట్టూ మనని వంగి దణ్ణాలు పెట్టమంటుంది." విసుక్కున్నాడు.

"పోన్లెస్దూ! అవునూ బావా.. ఓ మాట." రహస్యమన్నట్టూ సైగ చేసాడు అనంతప్ప.
ఏవిటన్నట్టు చెవప్పగించాడు నరసింహం.
"వాళ్ళవాళ్ళు సమయానికి అందుకుంటారో లేదో అనీ.. " అర్ధోక్తితో ఆపాడు.
"ఊ.."
"పసుపు బట్టలు తెచ్చాం మీకు పీటల మీద పెడదావని. నాకూ చెల్లెలి వరసే కదా. ఆమె చిన్నబుచ్చుకోవడమెందుకూ ఇంత సందడి చేసుకుంటూ! ఒక్కగానొక్క పిల్లాడికి శుభమా అని వడుగు చేసుకుంటున్నారు."
"వెర్రి బ్రాహ్మడా! ఇస్తేనే చిన్నబుచ్చుకుంటుంది. సరేలే.. నువ్విప్పుడేం మాట్లాడకు. చూద్దాం."
"అదే అదే.. నీ చెవిన వేద్దామని. ఏ మాటకామాటే! మధుపర్కాలు.. చింతపండు రసం పలచగా తీసి, చాయ పసుపు వేసి  తడిపాం. చావంతిపువ్వులే అనుకో! ఆరిన బట్టలు మీ చెల్లి మడతవేసి తెస్తూంటే.. నాకెంత ముచ్చటేసేసిందో!" మురుసుకుంటూ చెప్పాడు అనంతప్ప.
"నువ్వూ కడుదువుగాన్లే బావా.. ఇంకెంతా ఐదేళ్ళు తిరిగేసరికి కన్యాదానం పీటలమీద కూర్చోద్దూ!" నవ్వుతూ అన్నాడు నరసింహం.

ఆ చిరుచేదు ఊహని ఆస్వాదిస్తూ నవ్వాడు అనంతప్ప. 

లోపల్నుంచి చెంబుతో మజ్జిగ, వెండిగ్లాసులూ తీసుకొచ్చి నిలబడింది అమ్మణ్ణి. పలకరింపులయ్యాక లోపలికి వెళ్తున్న భార్య పెరట్లోకి వెళ్ళేదాకా ఆగి,  అప్పుడు మాట్లాడాడు నరసింహం.

"నీతో ఓ విషయం చెప్పాలి బావా.."
చెప్పమన్నట్టూ చూశాడు అనంతప్ప.
"రేపుదయం వడుగువేళకి.. "
"ఊ.."
"చిన్నారిని ఎక్కడికైనా పంపేయాలి."
అనంతప్ప అర్ధం కానట్టూ చూశాడు.
"అది వడుగు చూడడం..."
"ఏవీ? కూడదా!"
"కూడదనేం కాదు. నా చాదస్తమే అనుకో పోనీ. అది పుట్టగానే నా కోడలనుకున్నాను. ఎప్పుడూ బయటపడలేదనుకో.. కాబోయేవాడి వడుగు అది చూడడవెందుకని."

చటుక్కున లేచి నరసింహం చేతులు అందుకున్నాడు అనంతప్ప. అతడి కళ్ళలో పల్చగా నీటితెర. 

***

ఏళ్ళు గడిచాయి. మురారి ఉపనయనం జరిగిన యేడాది.. పెరట్లో సాల పక్కగా నాటిన సన్నాకుల మావిడిచెట్టు, ఆ ఏడు కాపుకొచ్చింది. కొడుకు చేత రఘువంశం, శబ్దాలూ, ధాతురూపాలూ వల్లెవేయించేసరికి నరసింహానికి తలప్రాణం తోకకొచ్చింది. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని తీర్మానించుకుని, మురారిని నాలుగూళ్ల అవతలున్న చినతాతగారింట ఉంచేశాడు. స్థలం మార్పో, చండామార్కుడిలాంటి చినతాతగారి శిక్షణో.. మురారి పుటం పెట్టిన బంగారమల్లే నిగ్గు తేలాడు. కావ్యపాఠం రుచి తెలిసొచ్చింది. సంహిత పదక్రమం చెప్పడం చేతనవుతోంది.

***

"నీకు పెళ్ళి చేసేస్తారుటోయీ?" అడిగాడు భట్టు.
"నీకెవడు చెప్పాడోయ్?" ఆశ్చర్యపోయాడు మురారి.
"మా అమ్మ అంటోంది. మీ నానమ్మ చెప్పినట్టుంది."
"వాళ్ళు చేస్తే మనం చేసుకోవద్దూ!"
"చేసుకోకేంచేస్తావేం?"
"చేసుకుని ఏం చెయ్యమంటావేం?"
"నాలుగేళ్ళు తిరిగేసరికి పెళ్ళాం కాపరానికొస్తుంది. ఆపై నెల తిరిగేసరికీ పావలా కందిపప్పు, పది రూపాయల ధాన్యం బస్తా సంపాయించే దారి చూస్తావు. నీకు మొదలవుతుందిలే.. "
"ఏవిటి?"
"రంధి.." 

భట్టుకి మాచెడ్డ సరదాగా ఉంది మురారి ఉడుక్కుంటూంటే. కాసేపటి దాకా మురారి మాట్లాడలేదు. ఉన్నట్టుండి ప్రకటించాడు. 

"నేను తిరపతెళ్ళిపోతా.."
"ఎందుకూ?"
"శిరోమణి చదవాలి. ఆపై ఇంగిలీషు పరీక్షేదో ప్యాసైతే మేష్టరుజ్జోగం అవుతుందట. సుబ్బావధాన్లుగారి అల్లుడికి అయిందట." చెప్పాడు మురారి.
"మీ అనంతప్ప మావ వేయిస్తాడ్లే ఉజ్జోగం. పిల్లనిచ్చి ఊరుకుంటాడేవిటీ?" 
"దాన్నా!!" 
"నీకు తెలీదూ ఇందాకా? దాన్నా అని నోరు వెళ్ళబెడుతున్నావ్?" భట్టుకి నిజంగానే ఆశ్చర్యమేసింది.
"తెలీదు." 

మురారి మొహం ఎర్రగా కందిపోయింది. కోపం ఎలా తీర్చుకోవాలో తెలిసింది కాదు.

"ఏం చేద్దావోయీ?" స్నేహితుణ్ణి సలహా అడిగాడు.
"చేసేదేవుందీ?"
"పారిపోనా?" రహస్యంగా అడిగాడు.
"ఎక్కడికీ?! కాళ్ళిరగ్గొడతారు. అయినా నిన్నేవన్నా గుళ్ళెత్తమన్నారా? రాళ్లెత్తమన్నారా? పెళ్ళేకదోయ్. చేసేసుకో."
"నాకు ఇష్టం లేదు. అందునా దాన్నా?" వెగటుగా మొహం పెట్టాడు.
"పిలిచి పిల్లనిస్తామంటే ఏవిటోయ్ నీ బడాయి? కావ్యకన్యలొస్తారేం లేకపోతే! సంసారపక్షంగా ఇంటిపట్టున ఎవరో ఒకరు. కావాలంటే నాలుగు విచ్చరూపాయిలు సంపాయించగానే, మెరకవీధిలో నీ సారస్యాలు వెలగబెట్టచ్చు."
"ఛీ.." 
***

మావిడి గున్న ముదిరి, సాల పక్కన పచ్చనాకుల చావిడి పరిచింది. వీధరుగు మీద కూర్చుని కలంలో కరక్కాయ సిరా నింపుతున్నాడు మురారి. నరసింహం పడకకుర్చీలో కూర్చుని కునుకుతూ, ఉక్కబోసి తెలివొచ్చినప్పుడల్లా విసనకర్రతో విసురుకుంటున్నాడు. అనంతప్ప ఇంటి చాకలి, అప్పన్న నవ్వుకుంటూ గుమ్మంలోకి అడుగు పెట్టాడు. అప్పన్న తెచ్చిన శుభవార్త విని అమ్మణ్ణి మూతి విరిచింది.

"నా అన్నదమ్ములకి ఒక్ఖ ఆడనలుసు లేకపోయీ.. దానికీ భాగ్యం." కొడుకుని చూస్తూ మరోసారి ఝణాయించింది. 

వారం రోజుల తరువాత శన్యుషస్సులో చినతాతగారి ఊరికి ప్రయాణం కట్టబోతున్న మురారితో చెప్పాడు నరసింహం.

"చూడబ్బాయీ.. నీ భార్య వ్యక్తురాలయింది. శ్రావణమాసంలో కాపరానికొస్తుంది. ఈలోగా మంచిరోజు చూసి నిన్నిక్కడికి పంపేయమని తాతగారికి ఉత్తరం రాస్తాను. సిధ్ధపడు. దగ్గర్లోనే ఏదో వ్యాపకం చూసుకుందువుగాని."

మురారికి తండ్రి మాటలు గుర్తొచ్చి ఆ రాత్రి నిద్రపట్టలేదు. తిరపతి వెళ్ళే రైలు కూత, రాక్షసిబొగ్గు వాసన.. కలత నిద్రలో కలగన్నాడు. 
***

"పరిషత్తు నాటకాల వాళ్ళనుకున్నావేం? అల్లాటప్పా ఆవిడ కాదు. మనబోటి గొట్టికాయల్ని లోపలికి రానే రానివ్వరూ. మున్సబు గారి మనవడు లేడూ.. రావుడు. అతగాణ్ణి బామాలి సంపాయించా టికిటీ ప్యాసులు. రెండంటే రెండు. తీరామోసీ నువ్వు అర్ధాంతరంగా రానంటే ఎలా!" భట్టు చెరిగేస్తున్నాడు.

కాసేపు నసిగి అప్పుడు బయటపెట్టాడు మురారి. 

"రేపు బయల్దేరి మూణ్ణిద్దర్లకి అనంతప్ప మావయ్య గారి ఊరు వెళ్ళాలట. కబురొచ్చింది. సాయంత్రం మా ఊరెళ్ళాలి. అక్కణ్ణుంచీ వాళ్ళూరికి.. "
"ఓహ్హో.. అదా సంగతీ!! చెప్పావు కావేం!"

భట్టు చెలరేగిపోయాడు. మురారి ఆ పరాచికాలకి స్పందించలేక మౌనంగా ఊరుకున్నాడు.

***

మనసు దహించుకుపోతోంది. తన జీవితాన్ని ఎవరో ఇనప చట్రంలో బిగించేసి, సీలలు తిప్పేసి వెళ్ళిపోతున్నట్టూ..! ఊపిరాడని గదిలో అటు తిరిగి పడుకున్నాడు. ఆలోచనలు మాత్రం భట్టు సంపాయించిన టికిటీ ప్యాసు లేకుండానే, ఆ మేజువాణీ స్వరప్రస్తారాలని ఊహించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. 

***

ఆమె తల తిప్పినప్పుడల్లా రవ్వల చెవి కమ్మలు ధగధగా మెరుస్తున్నాయి. బరువైన వడ్డాణం ఆమె కట్టుకున్న ఆకుపచ్చ కంచిపట్టుచీర మీద జిగేలని మెరుస్తోంది. మెడలో కంటె ని ఒరుసుకుంటూ చిత్రాభరణాలు. కదిలినప్పుడల్లా ఖణేల్మంటూ చేతినిండా కంకణాలు. రెప్పవేయకుండా చూస్తూ, ఆమె పాడిన యదుకుల కాంభోజి మైమరచి విన్నాడు. ఆపై భైరవిలో త్యాగరాజకీర్తన అందుకుందామె.

కొందరి సొగసును కనుల జూడ..
కొందరి మనసు దెలిసి మాటలాడ..
కొందరి యంకమును పవ్వళింప..
కొందరి పెదవుల పలుకెంపులుంచ..

 గాంభీర్యపు జిలుగు అద్దిన ఆ గాత్రానికి పరవశమైపోతున్నాడు. గంటలు గడిచాయి. గానమాగింది.

పచ్చగా మెరుస్తున్న పల్చటి శరీరాన్ని ఉత్తరీయంతో కప్పుకుని నిలబడి,  విప్పార్చుకున్న కళ్ళతో తననే చూస్తున్న ఆ యువకుడి వైపుగా ఘల్లుఘల్లున నడిచి వచ్చిందామె. నవ్వుతూ నమస్కరించింది. చూపులతోనే మెచ్చుకున్నాడు. పెదవి దాటని భావసంచలనాన్ని అతడి కన్నులు పట్టిచ్చాయి. గ్రహించిందామె. మాటలు కలిపింది. వివరం తెలుసుకుంది. దడి దాటి లోపలికి చొరబడ్డ అతని సాహసానికి నవ్వుకుంది. 

"రెండేళ్ళనాడు కుదరలేదు. ఇప్పుడసలు చూస్తాననుకోలేదు!" ఉద్వేగంగా చెప్పాడు.
"రాజమహేంద్రి వెళ్ళాల్సి ఉంది. కానీ మీ ఊళ్ళో ఆగి వెళ్తేనే గండపెండేరం తొడుక్కోనిస్తామన్నారు. ఆపేశారు." కాస్త గర్వంగా నవ్వింది. అందం రెట్టింపయ్యింది. 

"ఏమి మాధుర్యం! గంధర్వులకే సాధ్యం కాదూ!" మనస్పూర్తిగా ప్రశంసించాడు.
"పూచి శ్రీనివాసయ్యంగారు గారు మా గురువుగారు! ఆయన పాడుతూంటే గాత్రంలో 'పూచి.. అంటే గేను ' వినిపించేది. అదే స్వామీ.. తుమ్మెద! అందుకే ఆయన్ని 'పూచి అయ్యంగారూ..' అంటారు. వారి భిక్షే ఈ సంగీతం. రాముడి దయ. గురువు గారి ఆశీర్వాదం. " రవల ముక్కెర, హంస తళుక్కుమంటూంటే చెప్పిందామె. 

ఆమె నుండి వీస్తున్న పరిమళానికి ముగ్ధుడై చూస్తున్నాడు.

"ఆ పుస్తక ఇల్లి తొగొండుబ.." పక్కనున్న ఆమెకి పురమాయించింది. 

"మాధుర్యం అంటిరే.. అది జీవితంలో వెతుక్కుంటే దొరుకుతుంది. నూరేళ్ళు ఆస్వాదించినా తరగని తీపి. తొగొళ్రి." అందించిందామె. 

బొద్దుగా ఉన్న ఆమె ఉంగరాల వేళ్ళని పరిశీలనగా చూస్తూ పుస్తకం అందుకున్నాడు. ఆ వేళ్ళు మీటిన వీణానాదం, ఆ గొంతులో వినిపించిన ఆలాపనలు ఇంకా అతని మస్తిష్కాన్ని మేలుకోనివ్వడం లేదు.

***

"త్వరగా స్నానం చేసి రమ్మంటున్నారు మావయ్య." 
చటుక్కున తలతిప్పి చూశాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది చిన్నారి. అదే రంగు చీర..  ఆకుపచ్చ! ఆమె పట్టుచీర గరగర గుర్తొచ్చింది మళ్ళీ.. ఆలోచిస్తూ ఉండిపోయాడు. 

***

"సన్నని చాకు ఏదమ్మా?" కాగితాల దస్తా ముందు వేసుక్కూర్చుని, వీధి అరుగు మీదనుండే అరిచాడు మురారి.
"సాలలో ఉందనుకుంటా. మీ నాన్నగారు నిన్న తాటాకులు చీరారు." అమ్మణ్ణి గొంతు వినిపించింది. 

మావి కొమ్మల సందుల్లోంచి ఎండ కరుగ్గా చొచ్చుకొస్తోంది. సాలలోకి అడుగుపెట్టి గుమ్మంలోనే ఆగిపోయాడు.

నుదుటి నుండి ధారగా కారుతున్న చెమటని మధ్య మధ్యలో ఎడమ జబ్బకి తుడుచుకుంటూ వంగి సాల ఊడుస్తోంది చిన్నారి. అతనిని చూడగానే నిలబడి ఏం కావాలన్నట్టు చూసింది.

"చాకు.."

కళ్ళతో చుట్టూ వెతికింది. అతని కళ్ళు ఆమె కళ్ళని వెతుకుతున్నాయి. చమటకి  నుదుటిపై అతుక్కున్న ముంగురులు వింతగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాడు. చటుక్కున వెనక్కి తిరిగింది. భుజాలు పట్టి నెమ్మదిగా తనవైపు తిప్పుకున్నాడు. 

"చెమట"
"...."
"చీపురు"
"...."
"అత్త్...."

ధారగా కారుతున్న చమట ఆమె చీరతో తుడుచుకుంటూ ఆమె వైపు చూసాడు. ఆసక్తిగా తననే గమనిస్తున్న కళ్ళు చప్పున వాలిపోయాయి. 

"ఒకటడగనా?"
"ఊ.. " అతని కుడిచేతి దండ మీద తల పెట్టుకుని అతని వైపు తిరిగి పడుకుంది.
నవ్వాపుకుంటూ అడిగాడు.
"నీ పేరు చిన్నారేనా?"
"....."
"ఎర్రగా చూసే అమ్మాయి అసలు పేరు ఏవిటో ఏ కావ్యాల్లోనూ చెప్పలేదు."
"హేమ" పెదాల వంపుని తడుముతున్న అతని చూపుల్ని అలవాటు చేసుకుంటూ చెప్పింది.
"హేమ.." మెత్తగా పలికిందతని గొంతు. 

"ఇంకేం చెప్పారు మీ కావ్యాల్లో?" చనువుగా అతని గుండెలపై సున్నాలు చుడుతూ అడిగింది. 

అరయఁ దనజోడు బయలాయె ననెడు వంత
చిత్తమున నాట నానాఁట జిక్కెఁ గౌను
మానహానికి సైతురే మహిని దలఁప
బట్టగట్టిన బలు గుణవంతు లెల్ల

నవ్వు పెదాలని ముడిచి ఆమె బుగ్గ మీద ముద్ర వేస్తూ చెప్పాడు గుసగుసగా.. 

"అంటే?" 
"హేమ బావుంది అని." 
"అబద్ధం" గారాలు పోయింది.
"పోనీ  అబద్ధమే.." నవ్వాడు ఆమె నడుముని వేళ్ళతో కొలుస్తూ..
"ఇన్నాళ్ళూ కనిపించలేదా?" అడిగింది. 
"...." 
"ఒక్క రోజైనా పలకరిస్తా..మో అని చూసే దాన్ని."
"..స్తావేమో.." అందించాడు.
సిగ్గుపడింది.
"మన్నించాలట నిన్ను" అమాయకంగా ఉన్నాయామె కళ్ళు.
"వాళ్ళకి చెప్పకులే.." అల్లరిగా నవ్వాడు. 
"నువ్వు మంచివాడివి బావా.." చటుక్కున బుగ్గమీద ముద్దుపెట్టింది. 

కళ్ళు మూసుకుని హాయిగా నవ్వాడు. 

"అంటే.. అంత మంచివాడివేం కాదులే." ఆమె కళ్ళలో అల్లరి. 
"అదేమీ?"
"బట్టకట్టిన గుణవంతుల మీద జాలి పడుతున్నావు కదా..!" 

చటుక్కున తలతిప్పి చూశాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం. తోటి బాటసారికి తన భాష అర్ధమవుతుందనే సంబరం. ప్రయాణం చప్పగా ఉండబోదన్న ఉత్సాహం.  

ఉద్వేగంగా హత్తుకున్నాడామెను. స్పర్శ మాట్లాడుతుందొక్కోసారి.

"రాంపురం వెళ్ళి ఫోటో తీయించుకుందామా?" ఆమె మెడలో మంగళసూత్రాలతో ఆడుతూ అడిగాడు.
"ఊ.."
"తిరపతెళ్ళిపోదాం మనం.."
"ఊ.."

***
(జీవన మాధుర్యానికి...)

Saturday, February 1, 2014

గాలిసంకెళ్ళు ~ 14

కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పద్నాలుగో భాగం ఇక్కడ..