Tuesday, October 28, 2014

రత్నపాప కళ్ళు

"రావుడు నాస్తానివిట్రా అయితేనూ.. ఈ పూటకి తినే వెళ్దువులే. వారం సంగతి ఆయనకోమాట చెప్పి, రావుడిచేత కబురంపుతాను.. ఏం?" ఎటూ తేల్చకుండా లోపలికి వెళ్ళిపోయారావిడ.

దిక్కులు చూసాడు బొజ్జన్న. తల్లి వెనకే లోపలికెళ్ళిన రామం వస్తే బావుండునని ఎదురుచూస్తున్నాడు. ఎదురుగా ఉన్న పంచపాళీ గుమ్మంలోంచి తప్పడడుగులువేస్తూ వస్తున్న పాపాయిని చూసి పలకరింపుగా నవ్వాడు. 

"గోపన్న కూతురు కాబోలు.." అనుకున్నాడు రామం మాటలు గుర్తొచ్చి..

"మా ఇంట్లో గోపన్న, మాధవ, శీను.. నేను. గోపన్నకి పెళ్ళైపోయింది." పెద్దబడిలో కొత్తగా చేరిన బొజ్జన్నతో స్నేహం కలుపుకుని, వారం అడిగేందుకు తమ ఇంటికి తీసుకొస్తూ చెప్పాడు రామం.

పిల్లదాని వెనకే బయటకి వచ్చి, వసారాలో ఉన్న గూడు దగ్గర నిలబడి ఏదో వెతుక్కుంటున్నాడొకతను.

'వాళ్ళ నాన్న.. గోపన్న కాబోలు..' వెనకనుంచే పోల్తి పట్టుకోడానికి ప్రయత్నించాడు బొజ్జన్న.

పిల్ల కేరింతలు కొడుతోంది. పంచపట్టున స్థంభాన్ని పట్టుకుని బొజ్జన్నతో దోబూచులాడుతోంది. నవ్వుతున్నాడా కుర్రాడు. లోపల్నుంచి రామం మాటల్లా వినిపించి చెవులు రిక్కించి అటువైపు చూశాడు. ఇటువైపు నుంచి ఏదో అలికిడి..

యధాలాపంగా పిల్లవైపు తలతిప్పేసరికి, వారగా ఉన్న గంగాళంలోకి కాళ్ళెత్తి తల ముంచేసి జారిపోతూ తపతప కొట్టుకుంటోంది. గభాలున ఉరికాడు. పిల్లని లాగుతూనే ఒక్క కేకపెట్టాడు.. "ఏవండీ..పాపాయి .." అని.

అతను ఒక్కంగలో వచ్చి పిల్లని అందుకుని పైకండువాతో మొహం అద్ది, భుజానికెత్తుకుని వీపు రాశాడు. ఉక్కిరిబిక్కిరైందేకానీ పిల్ల గట్టిదే. మిటకరించి చూస్తోంది. 

"అమ్మా.. ఈ భడవకాన పనులు చూడు." చిరుకోపంగా పిల్లని అదిలిస్తూ అరిచాడు. లోపల్నుంచి రామం, వాళ్ళమ్మగారు, పంచపాళీలోంచి పిల్లతల్లీ ఒక్కసారి పరిగెత్తుకొచ్చారు. పిల్ల ఉరికి వాళ్ళమ్మ చంకెక్కింది

"ఏవైందిరా మాధవా.." రామం వాళ్ళమ్మగారడిగారు గాభరాగా..
"గంగాళంలో పడబోయింది. ఈ అబ్బాయ్ చూశాడు కాబట్టి.. "
"హమ్మయ్యో..! గండం గడిచింది లేచిన వేళ బావుండీ.. ఏమే రాకాసీ.. ఏం పనులవీ!!"

'మాధవా! గోపన్ననే అన్నంటాడనమాట రామం. మిగిలినిద్దర్నీ పేరుపెట్టే.. ' అనుకుంటూ బొజ్జన్న అతడిని పరిశీలించాడో క్షణం.

కాసేపటికి భోజనానికి పిలుపొచ్చింది. వారమూ దొరికింది.
***
"ఒట్టురా రామం.. మీ మాధవ ఆ ఇంటికెళ్తూండగా చూశాను." చెప్పనా వద్దా అన్న సంశయాన్ని జయించి చెప్పేశాడు బొజ్జన్న.
"ఎవర్ని చూసి ఎవరనుకున్నావో! మాధవెప్పుడూ పట్నంలో ప్రింటింగ్ ప్రెస్ లోనో, ఈశ్వరీ టాకీసు దగ్గరో ఉంటాడ్రా." నమ్మకం కలగలేదు రామానికి.
"పోనీ, ఈసారి కనిపిస్తే నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా.. సరేనా?" పట్టుదలగా చెప్పాడు బొజ్జన్న.
"బొజ్జా.. నిజమేనేంట్రా?" స్నేహితుడివైపు సూటిగా చూస్తూ అడిగాడు రామం.
బొజ్జన్న సమాధానం చెప్పలేదు. కుడిచెయ్యి నడినెత్తిన పెట్టుకుని నిలువుగా తలూపాడు.

***
అది మొదలూ స్నేహితులిద్దరూ ఎదురుచూసిన రోజు సరిగ్గా వారం తరువాత తటస్థించింది.

"వెళ్లాడిప్పుడే.. పదరా.." వీధరుగు మీద కూర్చుని చదువుకుంటున్న రామాన్ని తొందరచేస్తున్నాడు బొజ్జన్న. కుతూహలాన్ని మించిన భయం, దాన్ని మించి ఉరకలేస్తున్నఉత్సాహమేదో ఆ కుర్రాళ్ళిద్దరిలో. . బొజ్జన్న ధైర్యంగా అడుగులు వేసేసాడు. కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి. వీధిదీపం వెలుగు తమపై పడకుండా గోడ దౌరునానుకుని చిన్నచిన్న అడుగులేస్తున్నారు. ఆ ఇల్లొచ్చేసింది! ఆగి మొహాలు చూసుకుని ఊపిరి వేగం అదుపులోకొచ్చేదాకా నిలబడిపోయారు. ఆ ఇంటిపక్క సందువైపు చెయ్యి చూపించాడు. మెత్తగా అడుగులు పడుతున్నాయ్. గుండెచప్పుడు తెలుస్తూనే ఉందిద్దరికీ..

సందులో మట్టిగోడ వాళ్ళ నడుందాకానే వచ్చింది. దానికవతల ఖాళీ స్థలం చూపించి, రామం సైగ చేసాడు.. అవసరమైతే దూకేద్దామన్నట్టుగా. అదేమీ పట్టనట్టు.. చిరపరిచితమైన దోవన్నట్టూ.. బొజ్జన్న గోడనానుకుని నడుస్తూ రెండో కిటికీ దగ్గరకి వెళ్ళి ఆగాడు. రామం కణతలు అదురుతున్నాయ్. పక్కగా నక్కాడు. బొజ్జన్న కాస్త జరిగి కిటికీ తలుపు సుతిమెత్తగా తోసాడు. తలుపు చప్పుడు కాకుండా తెరుచుకున్నాక ఊపిరి వదిలారిద్దరూ.. క్షణమాగి ఆ చిన్న సందులోంచి లోపలికి చూస్తున్నాడు బొజ్జన్న.. రామానికేం కనిపించలేదు.

"ఏంట్రా.." గుసగుసలాడాడు.
"ష్... విను."

కాసేపటికి ఆ గదిలోని మసకవెలుతురికి ఇద్దరి కళ్ళూ అలవాటు పడ్డాయి. నవ్వులు వినిపిస్తున్నాయ్.. గలగలలు. కనిపించేది మాత్రం చీకటే. కాసేపున్నాక ఆ వినిపిస్తున్న మగగొంతు మాధవదే అని ఒప్పుకుని తలూపాడు రామం. చీకట్లోనే గర్వంగానవ్వాడు బొజ్జన్న. వినిపిస్తున్న మాటలు క్రమంగా ఆగిపోయాయి.

***

"హైమావతే.." నమ్మకంగా చెప్పాడు బొజ్జన్న. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రామం.
"అయినా ఇదేం రోగంరా.." మళ్ళీ తనే అన్నాడు.
"ఏ రోగమో వచ్చేదాకానే.." కోపంగా చెప్పాడు రామం.
"వస్తాయంటరా?"
"రావూ మరి..." తనకు తెలిసిన విషయాలన్నీ ఉత్సాహంగా కథలు కథలుగా చెప్పుకొచ్చాడు రామం.
"ఇంట్లో చెప్తావా మరి?"
"ఈ వీధిలోకొచ్చినందుకు ముందు మన మక్కెలిరగదంతారు. గప్ చుప్.." రామం నోటిమీద వేలుంచుకుని చెప్పాడు.

***
గ్రామదేవత పండగెళ్ళిన రెండో రోజు మునిమాపువేళ పాలెం వైపు వెళ్తున్న గూడుబండిలో హైమావతి కనిపించింది వాళ్ళకి. ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. పరిగెత్తుకుని ఇంటికెళ్లారిద్దరూ.. మాధవ ఆ చివరి వీధిమలుపు తిరుగుతూ కనిపించాడు.

"పట్నమెళ్తున్నాడంటావా?" గుసగుసగా అడిగాడు బొజ్జన్న.
"ఈవేళప్పుడెలా వెళ్తాడ్రా?"
స్నేహితుడి మాటలకి నిజమే అన్నట్టు తలూపాడు.
కాసేపు తర్జనభర్జనల తరువాత అన్నాడు రామం.."వాళ్ళింటికెళ్ళి చూసొద్దామా..?"

రామవే ఆ మాటనేసరికి ఎక్కడలేని హుషారొచ్చింది బొజ్జన్నకి.. క్షణాల్లో ఇద్దరూ ఆ ఇంటిసందులోకి చేరుకున్నారు.

అవే గలగలలు.. అదే నవ్వు.. గుసగుసగా మాధవ మాటలు!

"అయితే రత్నపాప!" అన్నాడు రామం కాసేపటికి ఆ వీధి దాటి వస్తూ..
"ఛీ.. కర్రిపాప. అదెలా నచ్చిందిరా?" ఆశ్చర్యపోయాడు బొజ్జన్న.
"అది లేకపోతే ఇదయుంటుంది.. ఎవర్తైతేనేం." అసహ్యంగా మొహం పెట్టాడు రామం.

***

"దేవుడెరగని గొందుల్లేవనీ... మా గోపన్న పట్టేసుకున్నాడ్రా మాధవని." బడికి రాగానే చెవిలో చెప్పాడు రామం.
నిజమా.. అన్నట్టు కళ్ళు పెద్దవి చేసాడు బొజ్జన్న. రామం తరువాత మాట్లాడుకుందామన్నట్టు సైగ చేసాడు.

***

"ఇంటా వంటా ఉందట్రా! ఏదో తోచిన పని చేసుకుంటున్నావులే అనుకున్నాం. ఈ యేడు పెళ్ళి చేస్తే కోడలొస్తుందని ఆశపడుతున్నానే! సరైన పనేనా ఇదని? మా తలకొట్టేసావురా తండ్రీ. బుద్ధిగా ఉంటానని మాటివ్వకపోతే నాకు ఏ నుయ్యో గొయ్యో గతి.. అంతే." సన్నగా శోకాలు పెడుతున్నారావిడ. వీధిలోంచే వెనుతిరిగిపోయాడు బొజ్జన్న. లోపలేం జరుగుతోందో తెలుసు కనుక..
***

"మదరాసెళ్తానంటున్నాడు. పెళ్ళి మాత్రం ససేమిరా అని భీష్మించుక్కూర్చున్నాడు."
"మీ అమ్మగారేడుస్తున్నార్రా పాపం.." బొజ్జన్న జాలిగా అన్నాడు.
"వాడు మూర్ఖుడు. వెళ్ళనీ.. అన్నారు నాన్నగారు."
"మారుతాడేమోలే." అన్నాడు బొజ్జన్న.
"పిల్లకాలువలోంచి సముద్రంలోకి చేరినట్టు.. అని వదిన ఒకటే సణుగుతోంది. వాళ్ళ పిన్నికూతుర్నిద్దామనుకున్నార్లే వీడికి.."
"ఓహో.."
"రేపుదయం ప్రయాణమట. నిన్న సాయంత్రమనగా వెళ్ళాడు బయటికి. ఇంకా ఇంటికి రాలేదు. ఏం చేస్తాడో మరి."
"అవునా!!"

***

ఆ గదిలో ఆ పూట దీపం కొండెక్కలేదు. మంచానికి ఆనుకుని నేలమీద కూర్చున్నాడతను. దీపపు వెలుగు గోడమీద అతని బొమ్మగీసింది. అతని ఒడిలో ఆమె ఒదిగి పడుకుంది.

"రత్నమాణిక్యాలూ.. " పొదువుకున్నాడు మాధవ.
 ఆమె గాజులారోజు గలగల్లాడడం లేదు. పెదవి నవ్వులు పూయడం లేదు.

"వచ్చేయ్ నాతో పోనీ.."
రాతిబొమ్మ నిశబ్దాన్ని మాత్రమే పలుకుతోంది.

"సరే.. నన్ను మర్చిపోనని మాటివ్వు చెప్తాను." ఏదో ఆలోచన కొలిక్కి వచ్చినట్టు తలవిదిలించి చెప్పాడు.

ఉప్పెనలా అతన్ని ముంచేసింది. తనకు తెలిసిన భాషలో.. అతనికి మాత్రమే అర్ధమయ్యే భాషలో.. ఆమె దేహం మాట్లాడుతూనే ఉంది.. చాలాసేపటిదాకా..

***
రామం చదువుకి పట్నానికెళ్ళాడు. బొజ్జన్న ఏకంగా పాట్నా వెళ్ళాడు.. దూరపుబంధువులు చదివిస్తానన్నారని. స్నేహితుల ఉత్తరాల్లో కచ్చితంగా మాధవ ఉండేవాడు. ఆ సారి ఉత్తరం చదివి బొజ్జన్న నోరు వెళ్ళబెట్టేశాడు.
"బొజ్జా.. దాన్సిగదరగా! తంతే బూరెల గంపలో పడిందిరా రత్నపాప! మొన్న సెలవులకెళ్ళినప్పుడు నారాయణ చెప్పాడు. ఉన్నట్టుండొకరోజు సినిమా వాళ్ళ కారొచ్చిందట రత్నపాపకోసం. హైమావతి కిందటేడే పాలెం వెళ్ళిపోయింది కదా.. ఇదొక్కర్తే ఉండేది మొన్నటిదాకా. వెళ్ళిందల్లా తంగప్పన్ ప్రొడక్షన్ హౌస్ లో పడిందిరా బాబు. పేపర్లో చూశానిందాకే.. 'కొత్త తార రత్నమాల..' అని. పోలిక పట్టలేకపోయానసలు!! ఇంద్రజాలమా ఇంకేవన్నానా సినిమా మేకప్పంటే.."
***

శీను పెళ్ళికి వెళ్దామంటే బొజ్జన్నకి పరీక్షలు అడ్డొచ్చాయ్. రామం పంపిన శుభలేఖతో పాటూ వచ్చిన ఉత్తరంలో మాధవ కబుర్లేమీ లేవీసారి. అన్నీ రత్న.. మాల విశేషాలే! ఆ ముందు ఉత్తరంలో పేపర్ కటింగ్ కూడా పంపాడు రామం.

తన జవాబులో మాధవ గురించి వాకబు చేస్తే, రామం ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు. "అదృష్టవంతుడ్ని చెడిపేవాడూ లేడు. మూర్ఖుడ్ని మార్చేవాడూ లేడు.. వీడు ఆ మదరాసు రోడ్ల మీద పిచ్చాడై తిరుగుతాడేమో దాని సినిమా పూర్తయ్యేసరికి. శొంఠికొమ్ములా ఎన్నాళ్ళురా అని అమ్మ గింజుకోని రోజు లేదు. అన్నట్టు చెప్పానా నీకూ.. శీను కి వదినా వాళ్ళ పిన్ని రెండోకూతుర్నే ఇచ్చారు."

***
'దేవకన్య ' చూడడానికి బొజ్జన్నకి కుదరలేదు. రామం సలహాతో 'రాచిలుక ' వచ్చే సమయానికి ఊళ్ళో ఉండేలా చూసుకున్నాడు. అయితే బొజ్జన్న మచిలీపట్నంలోనూ, రామం వాళ్ళ ఊళ్ళోనూ చూశారా సినిమా..

***
"అవేం కళ్ళురా అసలు!! రవ్వలంటే రవ్వలే.. మీవాడు ఎందుకు పడిచచ్చేవాడో ఇప్పుడర్ధమవుతోంది. మనూళ్ళో ఆ వీధిలో మనిషంటే నమ్మగలమా అసలు!!" రామానికి రాశాడు బొజ్జన్న.. 'గరికపూలు ' చూశాక.

***

రామానికి సంబంధం కుదరగానే బొజ్జన్న రెక్కలుకట్టుకు వాలిపోయాడు. పెళ్ళివారిల్లు కలియదిరుగుతున్న పిల్లల్లో.. పాలకంకిలా ఎదిగిన గోపన్న కూతుర్ని చూసి బొజ్జన్న ఆశ్చర్యపోయాడు.. కాలం పరిగెడుతుందని.

ఆ సందట్లోనే బొజ్జన్నకి,  వెంకట్రాయుడు గారి చెల్లెలి కూతుర్ని ఇస్తామని అడిగారు. ఆ మాటల్లో ఉండగా అప్పుడే దిగిన వెంకట్రాయుడి బంధువొకరు చెప్పిన వార్త.. మాధవ ఉత్తరదేశంలో కనిపించాడని. రామం వాళ్ళమ్మగార్ని పట్టుకోతరం కాలేదెవ్వరికీ.. ఆ సందర్భంలో బొజ్జన్న కాస్త చిన్నబుచ్చుకున్నా ఆమె మొహం చూసి జాలే పడ్డాడు.

***
"మీ అమ్మగారి ఉసురే తగిలిందిరా దానికి. బంగారంలాంటివాణ్ణి పిచ్చాణ్ణి చేసొదిలేసింది. ఐదో సినిమా తరువాత మాయం! రకరకాలు రాస్తున్నారు పత్రికల్లో.. చదివావా?" కొత్తకాపురం, ఆదాయవ్యయాల విశేషాల తరువాత బొజ్జన్న రామానికి ఈ ముక్క రాయడం మర్చిపోలేదు.

***
"కాలం గొప్ప మందురా బొజ్జా కొన్నిటికి. మా అమ్మే మర్చిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరికోసం ఎవరాగుతారు? ఎవరికి ఎవరు బాధ్యులు? దాని పాపాన అదే పోయిందిలే."

***

రత్నపాప కళ్ళు.. ధారగా కన్నీళ్ళు..
"చెట్టి పెద్దాయన. నేనంటే చాలా నమ్మకం. ఇక్కడంతా బావుంది. వచ్చేసెయ్.. విజయవాడ వెళ్ళిన కారు నీకోసం మనూరు పంపమని అడిగాను. శనివారం నాడు కారొస్తుంది. బయల్దేరు." మాధవ అక్షరాలు మసక మసగ్గా కనిపిస్తున్నాయి.

***

రత్నపాప కళ్ళు.. ధారగా కన్నీళ్ళు..
"వద్దు. నీకు నచ్చనిదేదీ చెయ్యొద్దు. వెళ్ళిపోదాం.. ఎక్కడికైనా." మాధవ గొంతు అనునయంగా.. కౌగిలి భద్రంగా..

Friday, August 15, 2014

ఆశ

"ఇదేవిట్రా! నేనుండగా చూడాల్సినవా ఇవన్నీ.."

లక్ష్మికి టైఫాయిడ్ తిరగబెట్టి ఎమర్జెన్సీలో ఉందని తెలిసినరోజు, బస్ దిగుతూనే నన్ను చూసి బావురుమన్న అక్క మొహం ఇంకా కళ్ళముందే కదులుతోంది. ఎంత బెంగ పెట్టేసుకుందని! తన కాళ్ల నొప్పుల్ని కూడా లెక్కచేయకుండా పసిపిల్లకి చేసినట్టూ సేవచేసి, మంచానికి అతుక్కుపోయిన లక్ష్మిని మళ్ళీ మనిషిని చేసింది. బావ నెలల తరబడి ఒక్కడే ఉండి వండుకు తింటూ, వస్తూవెళ్తూ అన్నిరకాలుగానూ ఎంత సహకరించాడో! ఆయన కలిసి రాబట్టేగా..

ఆలోచనల్ని తెగ్గొడుతూ ఆటో ఆగింది. జేబు తడుముకుని డబ్బులు తీసిచ్చి, క్షణకాలం ఇంటి ముందు నిలబడిపోయాను. రంగు వెలిసిపోయి, పెచ్చులూడిన వీధిగేటుని చూస్తే చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయనిపించింది. సందువైపున్న కుళాయి విప్పుతూనే బుస్ మంటూ గాలి, వెంటనే వేడి నీళ్ళు.. గబగబా కాళ్ళు కడుక్కుంటూ ఉండగానే గ్రిల్ తలుపు చప్పుడయ్యింది. డోర్ మేట్ మీద కాళ్ళు రాసుకుంటూ చేతిసంచీ లక్ష్మికి అందించాను. 

"ఏమన్నారు?" మంచినీళ్ళు అందించి పక్కన కూర్చుంది. 
నిజాన్ని దాచడం కంటే అబద్ధం చెప్పడం కష్టం.
"ఇంకో టెస్ట్ రిజల్ట్ రావాల్ట. వస్తే ఆయనే ఫోన్ చేస్తానన్నారు."
"వెళ్ళక్కర్లేదా?"
మాటలు తూచి వేయడానికి కాస్త సమయం పడుతోంది నాకు.
"ఏమో లక్ష్మీ, ఆయన ఫోన్ చేస్తే తెలియాలి. ప్రస్తుతానికి ఉన్న మందులే వాడమన్నారు. అయిపోయిన రకం తెచ్చాను."
నిట్టూర్చింది.

"రండి బోయనానికి.." లక్ష్మి లేచి వంటింట్లోకి నడిచింది.

"అక్క ఫోనేమైనా చేసిందా?"
"లేదు.."
"ఈ విషయాలేవీ చెప్పకు."
సమాధానం రాలేదు. చెప్పేసిందా కొంపదీసి!

"ఊరికే గాభరా పడుతుంది. అసలే బీపీ మనిషి." బట్టలు మార్చుకోడానికి వెళ్తూ చెప్పాను. 

***

భోజనం కానిచ్చి పడక్కుర్చీలో వాలాను. ఆయాసంగా ఉంది. కలిపిన కూరా అన్నం సగం కూడా తినలేకపోయాను కానీ ఆయాసం. కింద కూర్చుంటే బావుండనిపిస్తోంది కాసేపు. ముందు గదిలో పేముసోఫాకి చారబడి టీపాయ్ మీదున్న పేపర్ అందుకుని తిరగేద్దామనుకునేలోగా పవర్కట్.. ఇష్షో..

నుదిటి మీద చెమటని తుడుచుకుని చెయ్యి దించుతూ చూసుకున్నాను.. ఎడమచేతి మణికట్టుకి కాస్త పై భాగంలో నీలంగా కవిలినట్టూ మచ్చ. ప్చ్..  మరోటా!

"శనగపిండి వాడికి పడదమ్మాయ్! తెలుసు కదా? పొరపాటున కలిసినా దద్దుర్లొచ్చేస్తాయ్. గుర్తెట్టుకో.. ఊరుకాని ఊరిలో మాకు దూరంగా ఉండాలింక. జాగ్రత్త."  ఏనాడో కొత్తకాపురంలో తిరగేసి లక్ష్మికి నా గురించి అప్పగింతలు పెట్టి ట్రైనెక్కిన అక్క గుర్తొచ్చింది. 

అబ్బా.. ఏంటిది? ప్రాణభయమా!

ఆమధ్య ఓ రోజు ఉదయం స్నానానికి వెళ్ళబోతూంటే, వెనకనుంచి లక్ష్మి గావుకేక వినిపించి హడిలిపోయాను. అరచేతి మేర మచ్చ.. నా వీపు మీద. 

"ఏమయిందండీ! ఎక్కడైనా పడిపోయారా! ఏం తిన్నారు బయట?" పదే పదే అడుగుతూనే ఉంది. లేదంటే నమ్మదే! 

డ్రసింగ్ టేబుల్ వైపు వీపు పెట్టి, చేతి అద్దంలో చూసుకుంటే కనిపించింది. కానీ అర్ధం కాలేదు.. అలా కవుకు దెబ్బలా ఎలా కమిలిపోయిందో! నొప్పి లేనే లేదు! ఆరోజు రాత్రే.. నిద్దర్లో వణుకు. చలిజ్వరమేమో అనుకుని పేరాసెటమాల్ వేసుకున్నా లాభం లేకపోయింది. పక్కింటి సురేష్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. వారానికి జ్వరం కంట్రోల్ అయింది. అప్పట్నుంచీ అడపా దడపా వచ్చిపోతూనే ఉంది. రోజులు గడిచి ఇలా.. ఈరోజు..

చేతులు తుడుచుకుంటూ మాత్రలు, మంచినీళ్ళు తెచ్చిచ్చింది. 
"వదినకి చెప్పలేదు కానీ.."
"ఊ.."
"గౌతమ్ అడిగాడు." చెప్పింది లక్ష్మి.
"ఫోన్ పట్రా.. "

చెప్పీ చెప్పకుండా విషయం చెప్పి, "మీ అమ్మకి ఎట్టిపరిస్థితిలోనూ తెలియనివ్వకురా.. అన్నట్టది వినాయక చవితికి ఇక్కడికి వస్తానంటోంది. మళ్ళీ ఆ టైం కి ఏ టెస్ట్ లైనా ఉంటే దాచలేం. తెలిస్తే గోల పెట్టేస్తుంది. నా ఆరోగ్యం సంగతెలా ఉన్నా అది కూలబడితే కష్టం. కుదిరితే నీ దగ్గరకి పిలుచుకో. ముంబైలో వినాయకచవితి ఇంకా సందడి కదా!" అన్నాను. అలాగే చూస్తానని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసాడు వాడు.

లేచి నిలబడితే ఒళ్ళు తూలుతోంది. కుదుపు ఆపుకోలేక నెమ్మదిగా లేచి మంచం మీదకి చేరాను. ఏమౌతోంది లోపల? రక్తం కణాలుగా వడివడిగా విడిపోతూ.. 

***

మగతగా ఉంది. లీలగా లక్ష్మి మాటలు వినిపిస్తున్నాయ్. ఫోన్ లో మాట్లాడుతోంది. 

"పక్కింటి వాళ్ళ కోడలిది ఈ ఏడు ఉద్యాపన ఉందండీ.. "
అక్కతోనే..
***

"వాళ్ళు రమ్మంటే మీరు వెళ్ళిపోవడమేనా! ఉత్తరమ్ముక్క వేసి ఊరుకోడం కాదు. తొలిసారి పండక్కి తీసుకెళ్ళడానికి మనిషి రావాలి. ఏమీ..  వాళ్ళ అన్నగారున్నాడు కదా? గాడిదలు కాస్తున్నాడా! వచ్చి వెంటపెట్టుకు వెళ్ళచ్చే.. పద్ధతీ పాడూ లేదేంటి? పెళ్ళి చేసి చేతులు దులిపేసుకుంటే చాలా?" నాన్న కోపంతో ఊగిపోతున్నారు. 

ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసిన నన్ను అక్కే కాపాడింది. లక్ష్మి వంటింట్లోంచి బయటికి తొంగికూడా చూడలేదు.

"వాళ్ళకి పద్ధతి తెలియదనుకోండీ నాన్నా, మీరు ఈ మాటలే ఓ ఉత్తరం రాసి పడేయచ్చు కదా! నాల్రోజులై సాధించిపోస్తున్నారు పాపం వీళ్ళని. వాళ్ళకుండాలి కానీ పిల్లలేం చేస్తారు.. "

ఇంకేం మాట్లాడలేదు నాన్న. ఇంట్లో అక్కమాట రాజశాసనం. అక్కా సమర్ధురాలే. లక్ష్మికి అన్నీ తనే నేర్పుకుంది. వంటలో మెళుకువల నుండీ చీరకట్టు దాకా అంతా అక్క తర్ఫీదే! తోడబుట్టిన ఆడపిల్ల ఉన్న ఊళ్ళోనే ఉండడం ఎంత సుఖమో నా పెళ్ళయ్యాక మళ్ళీ మళ్ళీ తెలుస్తూ ఉండేది.

"నీ పెళ్ళాం మంచిదిరా. మప్పితంగా ఉంటుంది. పుట్టింటి ఊసెత్తదు పాపం. వాళ్ళు మూర్ఖులే కానీ ఈ పిల్ల మనలో బాగా కలిసిపోయింది. దాన్ని కష్టపెట్టకు. చిన్నది.. సర్దుకో." పెళ్ళైన ఏడాది తరువాత ట్రాన్సఫరై వేరు కాపురం పెట్టుకున్నప్పుడు పాలుపొంగించి వెళ్తూ చెప్పిందక్క. అంతిష్టం అక్కకి లక్ష్మంటే. 

***

"సబ్జా గింజలు చలవచేస్తాయన్నారు వదిన. నిమ్మరసంలో వేసి ఇవ్వనా?" 
ఇక దాచలేననిపించింది. 
"కూర్చో ఇలా.." చెయ్యందించాను. 
"జ్వరంగా ఉందా?" ఆందోళనగా చెయ్యి పట్టుకుంది.

"ఉహూ.. మరీ ఏభై ఏళ్ళ వాళ్ళకి రావడం అరుదేనట కానీ, ఎమ్ డీ ఎస్ అనీ.. ఏదో రక్తంలో తేడాట. కొత్త రక్తం పెట్టేలా జాగ్రత్తగా ఉండాలి. మరీ అవసరమైతే.." ఆగాను.
లక్ష్మి కళ్ళలో భయం పెద్దదవుతోంది. 
"రక్తం మారుస్తూండాలన్నారు. పర్లేదు. డాక్టర్లున్నారు." ధైర్యం చెప్పుకున్నాను.

నిశబ్దం.. లక్ష్మి ఏడిస్తే బావుండుననిపించింది. 
***

నాలుగేళ్ళ క్రితం తిరుమల దర్శనం క్యూలోనుండి బయటికి వచ్చి, విమాన వేంకటేశ్వరుడిని చూద్దామని వెళ్తూంటే ఉన్నట్టుండీ కెవ్వుమంది లక్ష్మి. బోసిగా ఉన్న మెడని తడుముకుని అయోమయంగా చూస్తోంది. పాపం పుణ్యం వెంకన్నకే తెలుసనుకుని బయటికి వచ్చేసాం. పసుపు తాడు కొని మెళ్ళో వేసుకుని, బంగారుగోపురం వైపు తిరిగి దణ్ణం పెట్టింది.

"బోలెడు పుణ్యం నీకు. నిలువుదోపిడీ అనుకో" అని నవ్వాను. 
"మీ జేబుకే కదా చిల్లు! పుణ్యమూ మీదే." నవ్వేసింది నొచ్చుకుంటూ

ఆ యేడాది శ్రావణమాసానికి శాస్త్రానికి కొందామనుకున్న బంగారం కాస్తముందే, కాస్త ఎక్కువే కొన్నాను.. లోన్ పెట్టి. ఇలా ఉంటే నాల్రోజులు చూసి వలంటరీ తీసుకోవడమా? ఎంతుంది.. ఎంతొస్తుంది? ఎంత అవసరమవుతుంది? తెల్లవారుఝాముకి ఆలోచనలు కాస్త చిక్కులు విడినట్టనిపించింది.

***

గౌతమ్ ఏం చెప్పాడో కానీ, మర్నాడు సాయంత్రానికి అక్క ఆటో దిగింది. ఆశ్చర్యపోతూ నావైపు చూస్తున్న లక్ష్మికి కళ్ళతోనే కర్తవ్యబోధ చేసాను. అనారోగ్యం పెద్దదేం కాదని నేను ఎలా నటించానో, లక్ష్మి అంతలానూ సహకరించింది. కళ్ళ నీళ్ళు ఆపుకుంటూ, భయంతో, ప్రశ్నలతో వచ్చిన అక్కని, సర్దిచెప్పి రెండ్రోజుల్లో బయలుదేరదీశాను. శుక్రవారం సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మరి. 
***

లక్ష్మి పాదాలు నాకిష్టం. ఇంట్లో తను తిరుగుతూ ఉంటే వచ్చే శబ్దం ఇంకా ఇష్టం. సాయంత్రం దాకా వింటూనే గడిపేసాను. డాక్టర్ దగ్గరికి తనూ వస్తానంది. హాస్పిటల్ కారిడార్లో నా అడుగుల చప్పుడుతో కలిసి తన అడుగులు..  ధైర్యంగా అనిపించింది.

***

నైట్ లేంప్ వెలుగులో మా బెడ్రూమ్ పెట్టెలా ఉంటుంది. ఇదేమాట ఓసారి చెప్తే లక్ష్మి నవ్వింది... అగ్గిపెట్టా అని. భోషాణప్పెట్టె అన్నాను.

లక్ష్మిని దగ్గరకి తీసుకున్నాను. నా ఎడమ భుజం మీద తలపెట్టుకోబోయి ఆగింది. పరవాలేదన్నట్టు పొదువుకున్నాను. 

"అమ్ములూ.."
"..."
"ఏమిచ్చాను?"
"ష్..."
"ఏం కావాలి?"

చాలాసేపటి తరువాత వెక్కిళ్ళు.. నావో, తనవో తెలియలేదు. 

"అన్నయ్య.." తడిసిన మాటలు లక్ష్మి గొంతులోంచి అస్పష్టంగా..
"ఏవిటీ?"
మాట్లాడలేదు తను. 

"ఉదయం మాట్లాడుదామా?" నెమ్మదిగా అర్ధం చేసుకుని అడిగాను. 
"ఉహు.."
"మరి?"

"మీలాంటి అన్నయ్యుంటే బావుణ్ణు.."

Saturday, July 12, 2014

అప్పుడు పుట్టి ఉంటే

"కృష్ణశాస్త్రి ఒక్ఖ కథో, నవలో రాసి ఉంటేనా!" అని గింజుకున్నాను "అప్పుడు పుట్టి ఉంటే" పూర్తి చేశాక. ముందు మాటలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాత్రం "కృష్ణశాస్త్రి కథ, నవలల జోలికి పోలేదు. ఆయన రుచే వాటి మీదకు ప్రసరించలేదేమో!" అని ఊరుకున్నారు. తెలుగు సాహిత్యానికి నిజంగా లోటే.. కృష్ణశాస్త్రి కథ లేకపోవడమనేది. ఏడువారాల నగలున్నా మరో ముద్దుటుంగరం చేరినట్టయ్యేది కదా!

ఆమధ్యెప్పుడో శ్రీరమణన్నారు. "దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గార్లు.. వీళ్ళందరూ రేడియోకి ఎక్కువగా రాసినవాళ్ళు. కృష్ణశాస్త్రిగారైతే రేడియోకే రాశారు. దీనితో మాట్లాడుతున్నట్టుండే శైలి వీళ్ళకి ఉంటుంది. వీళ్ళెవరూ అనవసరంగా పెద్దమాటలు వేయరు. అవసరమైన చోటే వాడతారు. శబ్దం మీద సాధికారత ఉండటమంటే పెద్దపెద్ద మాటలు కంకర్రాళ్ళలా విసరడం కాదు. మాట డెన్సిటీ తెలిసి ఉండాలి. తూచి వేయాలి." అని. ఆ మాట అక్షరాలా అర్ధమయ్యింది.. కృష్ణశాస్త్రి వచనం చదువుతూ ఉంటే. అద్భుతమైన ఊహ, చక్కని కథన చాతుర్యం, లలిత లలితమైన పదసౌందర్యం. అందుకే అన్నాను. 'కృష్ణశాస్త్రి కథలూ, నవలలూ రాసి ఉంటేనా!' అని. ఆయన ఊహలో పుట్టిన కథ కాని కథే "అప్పుడు పుట్టి ఉంటే"


రాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని ఈనాటికి చెప్పుకుంటాం. సమర్ధుడైన రాజు పాలనలో ప్రజలెంత సుఖసంతోషాలతో జీవితం గడిపేవారో ఈ కలికాలంలో మనబోంట్ల ఊహలకి అందించేందుకో చిన్న ఉదాహరణ.. విపణి వీధిలో రత్నాల రాశులు! సంపద, భద్రత, విశ్వాసం, సంతోషం.. ఇవన్నీ ఉచ్ఛస్థాయిలో ఉన్న ఆ బంగారు రోజుల్లో.. నిరుపహతి స్థలమూ,  ఊయలమంచమూ, ఆత్మకింపైన భోజనమూ, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెమూ.. లేఖక పాఠకోత్తములూ ఉంటేనే కవిత్వం చెప్తానని పెద్దన గారంటే, రాయలవారింకెంత ఇంపైన సదుపాయాలూ, ఉపాయాలూ చేసి ఉండకపోతే ఆ అల్లిక జిగిబిగి "స్వారోచిష మనుసంభవం" అవుతుంది! మృగమద సౌరభ విభవ ఘనసార వీటీ గంధ స్థగితేతర పరిమళమై.. వరూధిని పొలుపు తెలుపుతుంది! తెలుగు పద్యానికి కస్తూరి పరిమళమద్దుతుంది!

సరే, తొలి తెలుగు ప్రబంధం ఉద్భవించింది. రాయలవారికి అంకితమివ్వబడుతోంది. మరి ఆ వేడుక ఎలా ఉండి ఉంటుంది? కృష్ణశాస్త్రి చెప్తారు.. కాదు కాదు.. చూపిస్తారు.

మహర్నవమి నాడు రాయల వారు భువనవిజయంలో మనుచరిత్రమందుకుంటున్నారన్న వార్త తెలిసి, అటు కళింగం నుంచీ, గౌతమీ తీరాన్నుంచీ, ఇటు కావేరి, మధుర నుంచీ కవీశ్వరులు, గాయకులూ, విద్వాంసులూ ముందుగానే విజయనగరం చేరుకున్నారట. కవితాగోష్ఠులతో తుంగభద్రా తీరమంతా మారుమ్రోగింది.

వచ్చిన కవులలో సగం మంది పెద్దన్న గారింట్లోనే దిగినప్పటికీ, అప్పాజీ, సాళువ తిమ్మరుసయ్య వంటి సామంతుల గృహాలూ మునుపెన్నడూ లేనంత కోలాహలంగా విడిదిళ్ళయ్యాయి. మహర్నవమి రానే వచ్చింది. పెద్దన్న గారి మనుమడు పింగళి సూరనదే హడావిడంతా!

రాయల వారు స్వయంగా పెద్దన్న గారింటికి వేంచేసి, ఊరేగింపుగా కొలువు కూటం దాకా తీసుకువెళ్తారని వార్త. బంగారు కుండలాలూ, జలతారు సేలువలూ సవరించుకుని కవులూ, పండితులూ రాయలవారి రాకకోసం మొగసాలలో ఎదురుచూస్తున్నారు. మంగళతూర్యధ్వానాల మధ్య "రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వర మూరు రాయరగండ శ్రీ కృష్ణదేవ రాయల వారు", అల్లసాని పెద్దనామాత్యుల ముంగిలికి మంత్రిసామంతులతో వేంచేసారు. 

బంగారపుటడ్డల పల్లకీలో ఆ మహాకవి భువనవిజయానికి చేరుకునే వేడుక, ఆ మహోత్సవం అంతా ఇంతానా! కవిరాజుకి కవిరాజరాజు చేసిన మన్నన ఇంతకు ముందు భోజరాజైనా ఏ కవికీ చేసి ఉండడని కవీశ్వరులందరూ సంతోషించారు. ఇంత సందడిలోనూ పెదవి విరిచి ధుమధుమలాడేవారికీ లోటు లేదు. దృష్టిదోషం తగలకుండా అదీ ఉండాలేమో!

వృధ్ధ తేజస్వి అప్పాజీ, విశాలమైన ఛాతీ, బుజాలూ, బుగ్గమీసాలతో సాళువ తిమ్మరుసయ్య, కోటేరేసిన ముక్కూ, పండు తమలపాకు శరీరచ్ఛాయా, కర్పూరతాంబూలం బుగ్గన ఉంచే.. రాయల వారితో మాట్లాడుతూ నడుస్తున్న నంది తిమ్మన, నిష్కలంకమూ, నిశ్చలమూ అయిన చల్లని ముఖంతో ధూర్జటీ.. ఇక మాదయ గారి మల్లన, రామభద్రుడు, రామరాజ భూషణుడూ, కందుకూరి రుద్రయ్య.. ఆహాహా.. రామలింగ కవి! (వారి వివరమూ, వర్ణన అనుభవేక వేద్యం. అంతే!) వీళ్ళొక్క వైపే.. ఇక చుట్టూ శారదారూపాలకి లోటేవిటి! ఎటుచూసినా ఆయమే! దక్షిణాపథం అంతా ఒక సుందర సంస్కారబంధం కట్టిపెట్టిన స్వర్ణయుగంలో.. ఆంధ్ర, కర్ణాటక, తమిళ కవివరేణ్యులంతా అక్కడే ఉన్నారాయె!

ఊరేగింపు విజయనగర పురవీధుల్లో ఎలా సాగిందో, తోవలో అందుకున్న హారతుల వైభోగమేమిటో, మధ్యలో మజిలీలేమిటేమిటో, భూలోక దేవేంద్రుడు కృష్ణరాయ నృపతి సుధర్మాస్థానంలో పెద్దన గారు మనుచరిత్రమునెలా పఠించారో, ఎక్కడాయన కంఠం రుద్ధమయ్యిందో, నిండు సభ కవితా పితామహునినేమని కీర్తించి సాష్టాంగమందో.. వైన వైనాలుగా పింగళి సూరన వర్ణిస్తూంటే.. అతిథికోటికి వడ్డిస్తూ ఆ ఇంటి ఇల్లాలు కళ్ళనిండా గర్వమూ, సంతోషమూ నింపుకుని మరీ విన్నది. 

పెళ్ళి వారిల్లులా ఉన్న పెద్దన గారింట్లో ఆపై జరిగిన సంబరాలే సంబరాలు. కవి కుమారుల చెణుకో పద్యం, తమలపాకు చిలక చుట్టి బుగ్గన పెట్టుకుంటే పద్యం, దారిన పోయే భామిని వయారం చూసో పద్యం, తుంగ ఒడ్డున ఓ ముద్దుగుమ్మ బిందె ముంచుకుంటే ఓ పద్యం... ఆంధ్రభారతి ఇదో.. ఇలాగే సుసంపన్నమయిందేమో!

ఇంతచక్కని ఊహ మరింత అందగించే ఊహొకటి చేసారు.. కృష్ణశాస్త్రి. "అప్పుడు పుట్టి ఉంటే, ఇవన్నీ చూసేవాణ్ణి కదా. ఎందుకు చూడను? అప్పుడు పుట్టి ఉంటే, నేనే పెద్దన్ననై పుట్టి ఉందును." అన్నారు. 

క్షణకాలపు దిగ్భ్రమ! ఏమా విశ్వాసం!! అప్పుడు గుర్తొచ్చింది కృష్ణపక్షం. అప్పుడు గుర్తొచ్చాడు.. 

గగన పథ విహార విహంగమ పతిని నేను
మోహన వినీల జలధరమూర్తి నేను

అని ధీరగంభీరంగా చెప్పుకున్న స్వేచ్ఛామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి.

(కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసమే కాకుండా మిగిలిన రచనలూ, రేడియో నాటికలూ, అముద్రిత రచనలన్నీ కలుపుకుని "కృష్ణశాస్త్రి సాహితి" ముస్తాబయ్యింది. "అప్పుడు పుట్టి ఉంటే" ప్రస్తుతం లభ్యమవుతున్న "కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 " లో ఉంది.)

***

తాజా కలం: కృష్ణశాస్త్రి గారు రాసిన కథలు రెండున్నాయని మిత్రుల ద్వారా తెలియవచ్చింది. ఒక కథ పేరు "కొలను - కోవెల", మరోటి "అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది". రెండో కథ ఇక్కడ చదవవచ్చు. ఇంకేం! ముద్దుటుంగరాలూ ఉన్నట్టే. పట్టుమని పదైనా ఉంటే బావుణ్ణని ఆశగా ఉన్నప్పటికీ..

Saturday, July 5, 2014

నేను

సమస్య.. తాళం వేసానా? కుడా ఎడమా.. ఎటు తిప్పాను?

ఉహూ.. ఎప్పుడూ నాలుగడుగులు వేసాక ఇదే అనుమానం.. ఎప్పుడూ ఉండేదే. ముందుకే పోదాం. పదండి ముందుకు పదండి తోసుకు.. ఎవర్ని తోసుకునీ..

'రా రా చిన్ననా.. రారోరి చిన్నవాడ..' ఎమ్మెస్. 'రా రా ముద్దులాడ.. రారోరి..'

నెహ్రూ తలవంచి 'హూ యామై? నీ ముందు నేను మియర్ ప్రైమ్మినిస్టర్నన్న..' ఎమ్మెస్. అనడూ మరి! ఎమ్మెస్.. బంగారానికి తావి? 

వీధి చివర చెత్త. ఉదయం తీసేస్తారు. శుభ్రంగా... అందంగా వీధి. అలంకరించుకుని.. దేనికి? మళ్ళీ చెత్త పోయించుకోడానికి.

"వొంకాయలున్నాయమ్మా.. లేటైపోనారియ్యాల.." 

నిన్నా వంకాయ కూరే. ఇవాళ పులుసు? అయినా ఇలాంటి వంకాయలు పులుసేంటీ! నవనవలాడుతున్న బీరకాయలూ, వంకాయలూ, ఆనపకాయలూ జువనైల్ గా పులుసులు వండకూడదని రూల్ పాస్.. ఎవరు చేస్తారు? నెహ్రూ? చక్కగా పోపులో వేసుకోవాలి.. కావాలంటే అల్లం పచ్చిమిర్చి.. కొత్తిమీర.. కరివేపాకు.. స్.. ఆవాలు, ఉప్పు నిండుకున్నాయ్. ఇంక కొనుక్కోడమెందుకు. నిండి పొర్లిపోతున్నప్పుడు. 

"తోటకూర అడుగైపోనాదమ్మా.. బెండకాయిలేసుకోండి. కేజీ పాతికి."

అప్పట్లో మా ఊళ్ళో దొండకాయలు వందల్లెక్కన అమ్మేవారంటే అతగాడికి వింత! 'నిజమా!' అని ఆల్చిప్పల్లాంటి కళ్ళు అపనమ్మకంగా.. పొగరేం ఆల్చిప్పలున్నాయని! 

మల్లాది హీరోయిన్లా వీధి మలుపులో లెండింగ్ లైబ్రరీకి వెళ్ళి మేగజైన్ తెచ్చుకుని.. ఎవరైనా నన్ను రోజూ చూస్తున్నారా? 

సడన్ గా ఓనాడెప్పుడో దారి కాసి "మీరు చదువుతారాండీ! ఐ లవ్ రీడర్స్.. బుక్ వర్మ్స్.."
ఛీ పురుగా.. చెయ్ తీయ్.. మా ఆయనకి చెప్పానంటే.. 

షట్.. షట్.. వంట చెయ్యాలి. పక్కింట్లోంచి లాక్కొచ్చి చిన్నాకి స్నానం. ఎప్పుడు నేర్చుకుంటాడు! షాపుకెళ్ళి ఆవాల్స్ కొనుక్కుని, ఇంటికెళ్ళి వంట చెయ్యాలి.

***

"మీ టీచరే చీర ఇస్తారని చెప్పావ్! పంచెలూ అవీ పట్టుకుపోయి తగలెట్టెస్తే.." అమ్మ విసుగు..

"మొన్న చీర కట్టుకున్నావేమో కదే. స్కూళ్ళోనూ.. ఇప్పుడు పంచె దేనికీ? ఆ నాటకం కాదా?" పోకచెక్క దంచుతున్న వాసన.. అమాన్ దస్తాలో..  ముసిలీ నువ్వు నోరు ముయ్యవే.. 

అప్పుడు స్కూల్లో.. కానీ ఇప్పుడు కలక్టరేట్ లో. అంతా.. అంతా మారిపోయింది! నాటకంలో నేను సరస్వతిని కాను.. హ్.. 

తెల్లచీర.. టీచర్ గారిది. మెత్తగా జారిపోతూ.. మంచి వాసనొస్తూంది. అది కట్టుకుని, తెల్లటి పేపర్ కలవపువ్వు. పట్టుకుని, కూర్చుంటే స్టేజ్ మధ్యలో.. 

"కలక్టరేట్ లో నాటకానికి నువ్వు రామలింగడి వేషం వెయ్యాలి. ఆ డైలాగులు కూడా వచ్చు కదా! నీకు ఈజీనే. లత సరస్వతి వేషం వేస్తుంది. ఏం?" 

ఆవిడ మొహంలోకి చూస్తే ఏడుపొచ్చేస్తుంది. 

లత.. తెల్లగా.. కొత్తగా వచ్చిన లత.. సరస్వతి. ఏం.. ఆ చీర నేను కట్టుకోకూడదా! నల్ల సరస్వతి.. మొద్దు సరస్వతి.. కలక్టరేట్ లో బాగోదు. 

వెక్కిళ్ళు.. వెక్కిళ్ళు.. క్.. రామలింగడు ఎలాగైనా ఉండొచ్చు.

***

"సరిత కజిన్ ని రిసీవ్ చేసుకోడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. షీ ఈజ్ ప్రెట్టీ. ఎంత పెద్ద జడో తెలుసా! వాళ్ళింట్లో దింపాను. నిన్న డిన్నర్ కి వెళ్ళాం అందరం. షీ లుక్స్ బ్యూటిఫుల్. నీకు చూపిస్తాను. మేన్.. అయామిన్ లవ్.." 

పవన్ మొహం.. వెలిగిపోతోంది. హేపీ ఫర్ హిమ్. రియల్లీ? ఛా..!

రేపెప్పుడో తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ముందు ముందు వాళ్ళిద్దరి ప్రేమా.. ఘాటూ.. ఘాటు ప్రేమా.. చూడాలి. జడ పెద్దది ఉంది కనుకా.. ప్రెట్టీ కనుకా ప్రేమించేసాడా! ప్రేమకి జడ, అందం.. కేటలిస్టులా? కారణాలా? పాపం ఆ అమ్మాయ్ అందంగా ఉన్నంత మాత్రాన మంచిది కాకూడదనేముందిలే!! ఛీ.. తప్పు. 

"వీణ వచ్చట.." 

నాకు రాదుగా! మండుతోందెందుకు!! మ్... వీడు నన్ను ప్రేమించాలా? వీడికి వండి పెడుతూ, బట్టల్లేకుండా వీడు.. స్టాప్

*** 

'రంగులే రంగులు..అంబరానంతట..
స్వరం నిజం సగం వరము అమరం..
వరం వరం వరం చెలియ ప్రణయం..'

ఓహ్.. లవ్..లీ!! 'భానోదయం' కాదని చెప్పాలా పాట అయ్యాక? గుణసంధా, సవర్ణ దీర్ఘమా? సుమం.. ప్రతి సుమం సుమం.. 

నవ్వకపోతే బావుండు. నవ్వితే మరీ బావున్నాడు. 

"బాగా ఆర్గనైజ్ చేసారండీ. అంతా మీరే చూసుకున్నారని మీ కజిన్ చెప్పింది." 
చెయ్యి మెత్తగా లేదు. వెచ్చగా.. షేక్ షేక్ షేక్ హేండ్.. 

"రీయూనియన్ ప్లాన్ చేసుకుందామని నాలుగేళ్ళ నుంచీ అనుకుంటున్నా ఇప్పటికి అయింది. మీ హెల్ప్ తో.. మంచి మెనూ.. అరేంజ్మెంట్స్.." 
 నవ్వకూ.. కింది పళ్ళు గొగ్గుపళ్ళు..!!  అక్క క్లాస్ మేటంటే నాకంటే ఎన్నేళ్ళు... 

"సరేనండీ.. నైస్ మీటింగ్ యూ! థాంక్యూ!" 

ఇంకో పాట పాడరూ.. అని చెయ్యి పట్టుకుంటే! యే పాట? నచ్చింది గాళ్ ఫ్రెండూ.. నవ్వింది మల్లె చెండూ.. మల్లెచెండులా ఎవరున్నారిక్కడ? ట్రాష్..

***

"ఐ కెన్ బీ మై సెల్ఫ్ అరౌండ్ యూ..  చాలా సుఖంగా, కంఫర్టబుల్ గా గడిచిపోతుంది నీతో.." 

రింగ్ మెరుస్తోంది.. ఆవిరి. దాహం.. నోరు ఆర్చుకుపోతోంది.
ఒకటీ రెండూ... ఏడు రాళ్ళు మెరుస్తూ.. ఏడు జన్మలా!
భుజం చుట్టూ చెయ్యి.. బావుంది.
దాహం.. బాటిల్ లో నీళ్ళు గొంతు దిగుతూంటే.. 

వేణువా వీణియా.. ఏవిటీ రాగమూ.. 

బుగ్గమీద.. వెచ్చగా మీసం గుచ్చుకు.. క్లిప్ లో చిక్కుకున్నట్టు.. కింది పెదవి.. క్లిప్ క్లిప్..

***

చల్లగా ఏమైనా తినగానే కదులుతుంది. తాడు..? ఏమో. అదో వాడో.. చల్లగా నీళ్ళు.. చల్లగా ఐస్క్రీమ్.. చల్ల చల్లగా..

"కోడలు వడిలిపోయింది. ఆడపిల్లేనేమో! మగపిల్లాడైతే రంగుతేలుతారంటారు." 

రంగూ.. రూపం.. చిక్కదనం అంటే లావా!! వికారంగా.. మరీ వికారంగా.. ఉబ్బిపోతూ.. పిగిలిపోతూ.. ఫట్ అని పగిలి..

"నొప్పిగా ఉందా? సెవెన్ డైలేట్ అయిపోయిందట.. మరో రెండు చాలు."  ఆల్చిప్పల్లో ఆందోళన

దేనికి? నా కోసమా? దాని కోసమా? మగపిల్లాడైతే బాగుండు. ఎలా ఉన్నా పర్లేదనా? నిజం చెప్పు.. ఆడపిల్లైతే.. ఆ కళ్ళొస్తే.. ఇలా నాజూగ్గా ఉంటే.. మండుతుందా? నా కూతురే కదా! నా.. 

మ్.... నే..ను చచ్చిపోతే! వాళ్ళమ్మ పోలిక రాలేదంటారు. మరో ఆడది నా చీరలు, గ్రీటింగ్ కార్డ్ లూ, ఉత్తరాలు.. లోపల్లంగాలూ.. ఛ.. బాత్రూమ్ లో బట్టలు తడిపి వదిలేసాను. వాసన.. 

చేతివేళ్ళని బిగించి పట్టుకుని.. ఓదార్పు.  మంట.. పెదాలు పొరలొచ్చేస్తున్నాయ్.. కొరికి కొరి..కి..

***

"తోటకూర అడుగైపోనాదమ్మా.. బెండకాయలేసుకోండి. కేజీ పాతికి"

చివర్లు గిల్లేసిన బెండకాయలు తోసేసి... లేతవి, సన్నవి, పొడవుగా ఉన్నవి ఏరి, మళ్ళీ గిల్లి..  ఏరకుండా కొనేవాళ్ళకి కూరగాయలు ఋణపడిపోతాయేమో! థాంక్యూ అని పులుసులో ముక్కలు.. 

"జిబ్బి ఇంగోమ్మా.. బేక్కానీండి." 

తొందర తొందర.. సొట్టగా ఎదిగిన బెండకాయొకటి.. నన్నే చూస్తోంది. నేనొక బెండ మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి..
***

'వాగీశ గౌరీశ వాసవాద్యమర పరివారాభివందిత పదం.. పద్మనాభం..
భోగీంద్రశాయినం..'

'శా..' అని ఎంత సొగసుగా పలుకుతాడో!! కుళ్ళొచ్చేస్తుంది..

కంఫర్ట్ మాత్రమేనా!

"ప్చ్.. నీకు అర్ధం కాదు. నీకెలా చెప్పాలో నాకర్ధం కాదు." 

మంచివే ఎంచుకుంటాం. మంచంటే అందమేనా? అందంగా లేకపో..

"ష్.. విను.."

లొంగదీసేసుకుంటాడు.. మత్తు.. వీడు మత్తు.. చీకటంటే బావుంటుందందుకే. నేను నాకు కనిపించను. వీడు మాత్రం మెరుస్తూనే ఉంటాడు. అణువణువునా మెరుస్తాడు.. 

వీణ మీటుతున్నట్టు.. మెట్లు మెట్లుగా శరీరం.. భోగీంద్ర శాయినం.. పురుకుశల దాయినం.. దేవుణ్ణి తల్చుకోకూడదేమో.. తప్పు. మ్.. మొగలి పరిమళం..

"వింటున్నావా.." 

చెవులు మూసుకుంటే.. నేను మాత్రమే ఉండి.. ఆ గాడ్రేజ్ బీర్వా, వీడూ, సైడ్ టేబుల్ మీద క్లాక్, ఫోనూ.. అన్నీ మాయమైపో... ష్...

"ఐ.. లవ్.. యూ..." 

చెవి తమ్మె మీద వేడి ఊపిరి. అంతే. ఎప్పుడూ ఇంతే.. నేనుండను. నేను మిగలను. 

"నాకు.. నువ్వు పర్ఫెక్ట్.. ఇలా.." 

ఆ వేళ్ళ మధ్యలో నా వేళ్ళు చిక్కుకుని.. క్రుకెడ్ పజిల్ ముక్కల్లా.. కలిస్తే పూర్తై.. నేనింతే..

Wednesday, June 18, 2014

కృష్ణాతీరం

ఇదే వేసంగి.. అయితే ఇప్పట్లా ఉస్సురస్సులేం తెలుసూ! చిన్నతనపు భాషలో వేసవంటే.. సెలవులూ, మామిడిపళ్ళూ, మల్లెపూలజడలూ, ఎండావకాయ, దొంగచాటున తినే తాటిముంజలూ, బొమ్మల ప్రింట్ కాటన్ గౌన్లూ. కరంటంటే మునపటి తరం నుంచీ ఉన్నా, కరంటుకోత మాత్రం మా చిన్నతనాల్లోనే వచ్చిందని చెప్తారు. కాకపోతే అప్పటి నెలజీతంలాగే, పవర్కట్టూ పరిమితంగానే ఉండేది. 

సాయంకాలాలు వీధిలో దొంగాపోలీసో, స్థంభాలాటో, బీసీ నో ఆడుతున్న పిల్లలందరూ కరెంటుపోగానే "ఓ..." అని అరుస్తూ ఆ ఇంటికి పరుగుదీసేవాళ్ళం. చిన్న వీధి చపటా, రామనీలం రంగు వెల్లవేసిన గోడలూ, నల్లటి చెక్కతలుపులు.. రెండు వాటాల పెంకుటింటి ముందు బోలెడు మేర గచ్చు చేసి ఉండేది. సర్దుకు కూర్చునేవాళ్ళం... ఒళ్ళంతా చెవులుచేసుకుని! కాస్త దూరంలో తూర్పుగోడవైపుకి ఉన్న తులసమ్మ ముందు వెలిగిన సంజెదీపం. వెన్నెలరాత్రులైతే ధారగా జారిపడే పాలనురుగు. చీమచిటుక్కుమంటే వినిపించే నిశబ్దం.. ఆ కాస్త వెలుగులో కూడా పసిడిలా మెరిసే పిట్టంత మనిషి. కాసంత బొట్టు, తాంబూలంతో పండిన పెదవులు, తళతళ్ళాడే కళ్ళు, ముడతలు పడిన ముఖం. ఖణీమనే గొంతు. అపూర్వమైన వాగ్ధార. పైడిపల్లి మామ్మగారంటే రూపుకట్టిన కథ.

శ్రవణకుమార చరితంతో మొదలు పెట్టి ఉత్తర రామచరితం దాకా నడిచే కథ ఓ వేసవంతా! సగర కుమారులు తవ్విన గుంటలు గడిచి దారువై కాచిన పూరీ జగన్నాథుడి కథ వరకూ మరో వేసవి. ఇక అటు దాటాక పంచతంత్రం, కాశీమజిలీలూ, భట్టివిక్రమార్కుల కథలు ఎలానూ ఉన్నాయి. పైడిపల్లి మామ్మగారు వేసిన మంత్రం ప్రతీ మునిమాపూ గంటన్నర పాటు పనిచేసేది. మంత్రముగ్ధమై వినడమే.. అంతే! ఎన్ని నుడికారాలు, ఎన్నెన్ని సామెతలు, ఎన్నేసి పిట్టకథలు, మరెన్నెన్ని చిలవలూ పలవలూ..

ఇదిగో.. మళ్ళీ అదే పనుపున మల్లాది వారి ఈ "కృష్ణాతీరం"


దివిసీమలో ఎండలు ముదిరాయి. అవనిగడ్డ గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంచుమించూ అందరూ మోతుబరులే. అయితే చాలీచాలని సంసారాలూ ఉన్నాయట. పూవుల్లో పత్రిలాగ..

శాస్త్రం చదువుకోవెళ్ళి, అబ్బక పురాణం చెప్పుకో సిధ్ధపడ్డాడు అన్నప్ప. మోస్తరు గృహస్థు. పురాణ శ్రవణానికైనా, పూజకో పుణ్యహావచనానికైనా.. ఆఖరికి స్థోమతలేనివారింట పొడితాంబూలానికైనా చిరునవ్వుతోనూ, మాటమంచితనాన తానున్నానంటాడు.

అతగాని ఒక్ఖగానొక్క కూతురు కామాక్షి. అన్నప్పా, ఆతని ఇల్లాలు అనంతలక్ష్మీ చెప్పుకోదగ్గ రూపసులు కాకపోయినా కాముడు ముత్యమల్లే ఉంటుంది. ఎనిమిదేళ్ళు దాటింది. ఏటికేడూ నేవళం దేరుతూ ఆ పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే తన ఇల్లు సామాన్యుల ఇల్లు కాదు... జమీందారు దేవిడీ అనిపించేది అన్నప్పకి. గ్రామం మొత్తానికి సంపన్న గృహస్థు రామావధాన్లు. అతనికి ఒక్కగానొక్క కొడుకు, ఒకే కూతురు. పిల్లవాడు సుబ్బరాముడు చురుకైన వాడు. దిప్పకాయితనం ఏ కోశానా లేదు. పిల్లని సుఖపెడతాడు. కనుక కాముడిని ఆ ఇంట్లో పడేయాలని నిర్ణయించుకున్నాడు అన్నప్ప. 

ఈలోగా రామావధాన్లు తన కూతురు అమ్మడికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అదేదో అయ్యాక తన కూతురి సంగతి కదుపుదామనుకున్నాడు అన్నప్ప. అమ్మడిని చూసుకోడానికి బందరు నుంచీ రమణయ్య గారూ, లచ్చమ్మ గారూ బండి కట్టించుకుని వస్తున్నారు. ఊళ్ళోకి వచ్చాక విడిది అన్నప్ప ఇంట్లోనే అని ఖాయమైంది. ఇంతలో యెడ్లు బెదిరి బండి పిల్లబోదెలో పడింది. అపశకునమని లచ్చమ్మ గారు గింజుకుంది. సరే ముందుకే వెళ్దామని నిశ్చయించుకుని అన్నప్ప ఇంటికి చేరారు. భోజనాలు కానిచ్చుకుని రామావధాన్ల ఇంటికి చేరేసరికి వేళ మించిపోయింది. నిక్కీనీలిగీ ఆలస్యంగా వచ్చారని,  కారణం తెలుసుకోకుండా పెళ్ళివారి పట్ల పెడమొహం పెట్టి అహం చూపించాడు రామావధాన్లు. మంచివాళ్ళు కనుక పిల్లను చూశామనిపించారు. ఇంటికి వెళ్ళి పక్షం దాటినా ఏ కబురూ రాకపోయేసరికి పిల్ల తండ్రి కంగారుపడ్డాడు. తప్పేది లేక అహం చంపుకుని బందరు వెళ్ళి అడిగాడు. లచ్చమ్మ గారు చెరిగేసింది. మాటపడ్డ రామావధాన్లూ ఊరుకోలేదు. వెనక్కి వచ్చి అన్నప్ప మీద గయ్యిమన్నాడు. "పప్పూ అన్నంలో ఏం కలిపి పెట్టావ్ బాబూ ఆ బందరు వారికి.. చక్రం ఇట్టే తిప్పేశావ్!" అని నింద వేశాడు. ఇదేం పాపమని అన్నప్ప, తన పిల్లని రామావధాన్లు కొడుక్కి ఇద్దామనుకున్నవాడు కనుక, అతని పిల్లకి బెడిసిన సంబంధం సానుకూలపరచడం తన బాధ్యతనుకున్నాడు. బందరు పయనమయ్యాడు.

లచ్చమ్మ గారు మనసులో మాట బయటపెట్టింది. ఆమె కాముణ్ణి చూసి ముచ్చటపడిన మాట వాస్తవం. అప్పుడు అన్నప్ప అన్నాడు కదా, "అమ్మా! నా పిల్ల మేలుకోరి, ఆ పిల్లకు ద్రోహం జేస్తానా? యింతకు పూర్వం నేనూ పేరాశకు బోయినాను. అవధాన్లు గారి పిల్లవాడికి మా అమ్మాయిని చేసుకుంటారేమో, అనుకున్నాను. ఇంత జరిగిన మీద యిహ అడిగేందుకు నాకు నోరు రాదు. మా కాముడి మీద మీకు వాత్సల్యం కలిగింది గనుక, మీ యెరికనే ఎక్కడన్నా, ఓ సంబంధం చూసి మీ ఎదుటనే ఉంచుకోండి." అన్నాడు. లచ్చమ్మ గారు లక్షణమైన సంబంధం కుదిర్చింది కాముడికి. ఎవరోకాదు.. అమ్మడి పెళ్ళిచూపులకి బందరు నుంచి వచ్చిన పురోహితుడు యెగ్గన్న కొడుకే.  అన్నప్ప మాట మేరా, అనుకున్నట్టే అవధాన్లు గారి అమ్మడు లచ్చమ్మ గారి రామశేషు పెళ్ళామయింది. 

పెరిగి పెద్దై అమ్మడు, కాముడు అత్తవారిళ్ళకి వెళ్ళారు. కూతురు కాపురానికి వెళ్ళిన ఏడాదికి అన్నప్పకి కొడుకు పుట్టాడు. వాడి పేరు బుచ్చన్న. అక్కడ కాముడి కాపురం మూడు పువ్వులూ ఆరు కాయలై ముచ్చటగా సాగిపోతోంది. పురోహితుడు యెగ్గన్న కొడుకు దర్భపోచలు చంకనెట్టుకుని ఇల్లిల్లూ తిరక్కుండా, సంస్కృతం ముక్కలు నేర్చి, పండితుడై తిరుపతి మహంతువారి పాఠశాలలో ఉపాధ్యాయుడైనాడు. కాముడు అందలమెక్కింది. కానీ అమ్మడి కాపురంలోనే ఏవో కలతలు. ఇంతలో అవధాని గారి కొడుకు సుబ్బరాముడు పాలెంలో ఓ పిల్లని చూసి ప్రేమించి పెళ్ళాడాడు. కులం కాని పిల్లని మనువాడాడని అవధాన్లు గారు కొడుకుని వెలేశాడు. అలా ఉంటే బానే ఉంది.. ఒకనాడు సుబ్బరాముడు తండ్రిని ఆస్తిపంచమని వచ్చి కూర్చున్నాడు. కాదన్న తండ్రిపై నోరూ చెయ్యీ ఆచుకోలేదు. అలా కొడుకు తండ్రిని అంటూంటే ఊరు ఊరంతా ముక్కున వేలేసుకుని ఊరుకుంది కానీ, యెవరికీ లేని జోక్యం అన్నప్ప కొడుకు బుచ్చన్న కలిగించుకున్నాడు. కుర్రవాడు మాంచి రెక్కకట్టి - పిక్కకట్టి జవమీదున్నాడేమో - అవధాన్లు గారి కొడుకుని పట్టుకుని, ఊరంతా పొర్లు దణ్ణాలు పెట్టించి పొలిమేర మీదకి గొడ్డుని తరిమినట్టూ తరిమేశాడు.

అన్నప్పకి ఈ సంగతి తెలియగానే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. కొడుకుని వెంటబెట్టుకుని పాలెం బయల్దేరాడు. "కొడుకు యెలాంటి వాడు కాని, తండ్రికి వాడి మీద మమకారం పోదు నాయనా! తండ్రి మనసు ఎంత క్షోభిస్తుంది?" అని బుద్ధి చెప్పి, అటూ ఇటూ ఉన్న తప్పుల్ని బేరీజు వేస్తూ పాలెం చేరారిద్దరూ. అక్కడ ఉన్నదేమో సుబ్బరాముడు, పెళ్ళాం లచ్చి,  ఆమెను పెంచిన  మేనత్త రత్తాలేమో లోకగయ్యాళి. తీరా చూసి అన్నప్ప వెళ్ళేసరికి లచ్చి ఒక్కర్తే ఉంది. ఉయ్యాల్లో పిల్లాడు, తొలిచూరు పిల్ల ఏణ్ణర్ధపుది తువ్వాయితో పాటూ చిందులేస్తోంది. 

అన్నప్ప ఆ ఇంటి కళ చూసి విస్తుపోయాడు. లచ్చిని సయాం తన రెండో పిల్లని చేసుకున్నాడు. బుచ్చన్నని సుబ్బరాముడి దగ్గరకి పొలానికి పంపించాడు. "ఒరే బుచ్చీ.. నీవు అలా పోయిరారా! తంతే పడు! అంటే - మింగు! ఇవాళ మీ ఇంట్లో వారం జెప్పుకున్నాం అంటే వాడు పరిగెత్తుకొస్తాడు." అంటూ..

'తండ్రీ కొడుకుల్ని విడదీశాను. ఈ పాపం ఎలా పోతుంద'ని ఏడుస్తున్న లచ్చిని ఓదార్చాడు. "పిచ్చిదానా! నీవు చేసిన పాపం అల్లా ఒక్కటే! పిల్లా పాపల్తో ఇలా చల్లగా ఉండటం. యిలాటి పాపానికి ఒడిగట్టేందుకైనా ఎంత పుణ్యం జేసుకోవాలే! యీ స్వస్తికేం గానీ, పెందరాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ! చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలూ జేసేవ్. వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన యింత ఆవెట్టి, తోటకూర కాడల్లో యింత పిండీబెల్లం పారేయ్. కొబ్బరీ, మామిడీ, అల్లం యీ పచ్చళ్ళు చాల్లే - పెరుగులో తిరగబోత పెట్టి, దాన్లో పది గారెముక్కలు పడెయ్. రవంత శనగపిండి కలిపి, మిరపకాయలు ముంచి చమురులో వెయ్. సరే క్షీరాన్నమంటావా, అదో వంటా? ములక్కాయలు కాసిని వేసి, పులుసో పొయి మీద పడేయ్, యీ పూటకి యిల్లా లఘువుగానే పోనీయ్.. ఇదిగో! నేనూ స్నానం జేసి వస్తున్నాగానీ, ఈలోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి ఇలా పడేస్తుంది.. మధ్యాహ్నం పంటి క్రిందకు వుంటాయ్!" అని పురమాయించాడు. లచ్చి నవ్వింది.

ఆపై లచ్చి మేనత్త పరమగయ్యాళి రత్తమ్మచేతా అన్నప్ప దండం పెట్టించుకున్నాడు. 'ఏ కులంలో గాని, శ్రోత్రియులంటూ ఉంటారని' ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు. ముక్కోటి దేవతల కథల్లో లొసుగుల్నీ బట్టబయలు చేసి ఋజువు చూపించాడు. చిత్తశుద్ది, సదాచారం, వినయం, వివేకం - ఇవి బ్రాహ్మణ లక్షణాలు. అంతేగాని, ఫలాని యింట్లో పుట్టడం కాదన్నాడు. "యిప్పటి మన సంకుచిత దృష్టితో చూస్తే - మన లెక్క ప్రకారం, మంత్రద్రష్టలైన ఋషుల్లో, యెంతమంది బ్రాహ్మణులున్నారు? ఒక్కడో అరో మినహాయిస్తే - తత్తిమ్మా వారందరూ, అనులోమ ప్రతిలోమముల ఫలితాలే కద!" అని ఇంతటి నిక్షేపాన్ని దూరం చేసుకున్న రామావధాన్లదే దురదృష్టమని తెగేసి చెప్పాడు. 

తండ్రిని తలుచుకుని ఏడ్చాడు సుబ్బరాముడు. "మామా! నా మూలంగా మా నాన్న నలుగురి నోళ్ళలోనూ పడాల్సి వచ్చింది. సంతానం కలిగితే ఉత్తమ గతులు కలగడం మాటేమో కాని, బతికుండగానే యిలా అధోగతి పాలు కావడం, ఇది వారి పాపమా, మా పాపమా! కావాలని కాళ్ళు గడిగి పిల్లనిస్తే, మా బావ, ఆ దౌర్భాగ్యుడు అట్లా చేశాడు. వాడంటే పరాయివాడు. మరి నేను చేసిన నిర్వాకమేవిటి?" అన్న సుబ్బరాముడికి ఒకే ఒక్ఖ మాట చెప్పి లేచి చక్కా వచ్చాడు అన్నప్ప.  

"యీ నిర్వాకం జేశావ్! యింతవరకూ బానే వుంది. ఇహ ముందైనా నీవూ, నీ పిల్లలూ లక్షణంగా ఉండాలి అంటే ముందు నీ మంచి నువ్వు చూసుకో! అవతలివాళ్ళకోసం అఘోరించడం మానెయ్! తనకు కానినాడు తండ్రి పినతండ్రితో సమానం! వారి పుణ్యం బాగుంటే మనుమల్నీ, మనుమరాళ్ళనీ ఎత్తుకునే యోగం ఉంటే, బిర్రబిగిసినవారే దారికి వస్తారు. రారో - ఎక్కడి వారక్కడ గప్ చుప్, మరో ఆలోచనే వద్దూ అంటా!"  

వెనక్కి వచ్చేసరికి, కాపురం చెడి ఇంటికి చేరింది రామావధాన్లు కూతురు. రయ్యని తామసం చూపించాడాయన యధావిధిగా! బందరు వెళ్ళి వాళ్ళని దులిపేసి అట్నుంచటే కాశీకి పోతానని శపథంచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కూతురితో పాటూ ఏడుస్తూన్న అవధాన్లు గారి భార్య శాంతమ్మని ఓదార్చారు అన్నప్ప, అనంతలక్ష్మి. ఇక అమ్మడి కాపురం చక్కదిద్దే భారాన్నీ భుజాలమీద వేసుకున్నాడు అన్నప్ప.  

"అన్నప్ప మామా! నాకు పిల్లలంటే అసహ్యం. ఆయనకి ప్రాణం. చీటికీ మాటికీ కవ్వించా. నేను కజ్జాలాడా! 'నువ్వుంటే చాలదూ వేయిమంది పిల్లల పెట్టు. నువ్వు గొడ్రాలివి అయినా, కొండముచ్చువి అయినా యీ ఇంటి కోడలివి.' అని నవ్వేవారాయన. చిర్రెత్తుకొచ్చేది.." అని చెప్పిన అమ్మడి కాపురంలో అసలు తగువేమిటి? రాలుగాయి పెళ్ళాన్ని భరించీ భరించీ తెగించిన రామశేషు ఏం చేశాడు? అన్నప్ప వాళ్ళ కాపురాన్ని ఏ దరికి చేర్చాడన్నదే మిగిలిన కథ. 

అల్లిబిల్లిగా వెయ్యిన్నొక్క కబుర్లని అల్లి చెప్పిన కథ ఇది. నిజంగా వేయి తరగల కృష్ణమ్మ ఒడ్డున కూర్చున్నట్టే! ప్రతివాక్యం వెనక్కి వెళ్ళి చదువుకున్నాను. ఆ అసామాన్యమైన కథనపు మెళుకువల్నీ, నుడికారపు జిలుగుల్ని తరచి చదువుకుని మురుసుకున్నాను. అవును మరి! వచనరచనకి మేస్త్రి - రామకృష్ణ శాస్త్రి! "పాట అర్ధం కాకపోతే నువ్వు నీ చూపు మార్చుకో. తెలుగు నేర్చుకో." అని చెప్పిన ధిషణాహంకారం మల్లాది వారిది. అలాంటివారి వాక్యం పొల్లుబోదు. "కథ ఎటువెళ్ళింది? ఈ విషయం కథకి అవసరమా?" అనే కత్తెరలు, మేధస్సు పక్కన పడేసి, పైడిపల్లి మామ్మగారి కథలు విన్నంత అమాయకంగా, ఆసక్తిగా, నమ్మకంగా చదువుకున్నాను. నూటపదేళ్ళ క్రితం పుట్టిన ఓ మనీషిలో ఇంత ప్రజ్ఞ, అనురాగం, కోణంగితనం, సారస్యం, తెగింపు ఉన్నాయి కదా.. అని అడుగడుగునా అబ్బురపడడమే మిగులుతుందెప్పుడూ!

"నాలుగు కులాలు అంటే - అది లెక్క వరుస కానీ, ఒకదానికి ఒకటి తీసికట్టని కాదు. తల్లి కడుపున తొలిచూలు బిడ్డ బ్రాహ్మడూ, నాలుగోవాడు శూద్రుడూ అవుతాడా మన వెర్రి కానీ.." అన్న అన్నప్ప మాటకి మారాడగలమా!

"దాంపత్యం అనేది, తమలపాకు లాటిది. ఆదిలో - లేతలౌజు, - ఆపై కవటాకు, పైపై పండుటాకు. దాంపత్యమంటే, తాంబూలమంటే, ఆద్యంతం రసవంతమే కాదుషోయ్!" అని సుబ్బరాముడిని ఎగసనదోసి, సారస్యం బోధించిన అన్నప్పని మరచిపోగలమా!

Sunday, June 1, 2014

"గాలిసంకెళ్ళు" నవలిక

"జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి. లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతేకాని ధనము, సుఖము, భోజనము.. ఇవన్నీ కలిగి బతకడం యెందుకు!"

అంటాడు.. రగిలే ప్రేమికుడొకడు. ప్రేమ ఉండి.. ధనము, సుఖము... భోజనమూ లేకుండా 'బతకడం' సాధ్యమేనా? అని అడిగితే మల్లెల నవ్వొకటి విసిరి మౌనంలోకి జారిపోతాడేమో.

"ప్రేమలేఖలు" చదివిననాటి నుండీ.. ఇంత ప్రేమ సాధ్యమా అనే ఆలోచన. సాధ్యమే అయితే "ఏదీ..??" అనే అన్వేషణ. అసాధ్యమేమోనని అనుమానం ఎప్పుడూ లేదు. చలం ఇచ్చిన భరోసా?? అయితే, లౌకికమైన జీవన వ్యాపారాలలో లోటు కలిగితేనో, లోపలెక్కడో దెబ్బ తగిలితేనో తప్ప, పరుగుల్లో కోల్పోతున్నదేవిటా అని వెనక్కి తిరిగి ఆముష్మికమైన ప్రేమ గురించి చింతన మొదలెట్టం. మనలో మూడువంతుల ముప్పాతిక శాతం మందిమి..  పిల్లి మెళ్ళో గంట కట్టేందుకు వెనకాడి, జీవితాలు నెట్టేస్తాం. ప్రేమ ఆముష్మికమే ఎందుకవ్వాలి?

"గూట్లోంచి ఉదయం పాకుతోంది కానీ.. నాకేం సంతోషం?" అని కల్మషం లేకుండా మనసులో, కౌగిలిలో, దినచర్యలో... కలుక్కుమనే ఆ వెలితి అనుభవించి రగిలిపోవడం, కనుపట్టిన దారిలో ముళ్ళు తొలిగించుకుంటూ సాగిపోవడం ఎందరికి చేతనవుతుంది?

ఈ ప్రశ్నల్లోంచి పుట్టిన కథ "గాలిసంకెళ్ళు" 


ఇప్పుడు "గాలిసంకెళ్ళు" కౌముది గ్రంథాలయంలో గుత్తంగా...

Friday, February 28, 2014

గాలిసంకెళ్ళు ~ 15

కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు"  ఇక్కడ.. 

'కౌముది'కి ధన్యవాదాలతో..

Monday, February 10, 2014

శతమానం భవతి

గొంతుక్కూర్చుని మౌంజి పేనుతున్న నరసింహం దృష్టి అదాటున వీధి వైపు మళ్ళింది. అనంతప్ప సకుటుంబంగా కోరడి వెలుపల చెమటలోడుకుంటూ నిలబడి ఉన్నాడు.

నరసింహం చాటంత మొహం చేసుకుని "బావా.." అని సంతోషంగా కేక వేసాడు.  వెనగ్గా నిలబడ్డ వసంతలక్ష్మి అన్నగారి వైపు చూస్తూ పలకరింపుగా నవ్వుతోంది. ఆ పక్కనే ఉన్న చిన్నారిపై నరసింహం చూపు ఒక్క క్షణం తారట్లాడింది.

పీట మీద నుండి గభాలున లేచి రెండంగల్లో వాళ్ళని చేరాడు. బావగారి చేతిలోంచి సంచీ అందుకుని, "బావా.. కులాసానా? ఏవమ్మలూ.. " అంటూ ఆ దంపతులకి లోపలికి దారిచ్చాడు.
"ఏవే చిన్నారీ.. ఝెటకా ఎక్కొచ్చావేమే?"  అని మేనకోడల్ని పలకరించాడు.
"ఏవి కులాసానో బావా! ఒళ్ళు హూనమైపోయిందనుకో. నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుంటే కానీ స్థిమిత పడలేను. చిరచిర.. " అంటూ వాకిట్లో నిలబడిన అనంతప్పకి కాళ్ళమీదకి నీళ్ళు ఇచ్చింది వసంత.

కాళ్ళు కడుక్కొచ్చి వీధి గదిలో ఉయ్యాలబల్ల మీద ఉస్సురంటూ కూర్చున్నాడు అనంతప్ప. తాటాకుబుట్టలో ముంజగడ్డి పడేసి, సగం పేనిన అల్లికని మరో చేత్తో పట్టుకుని వచ్చి నిలబడ్డ అన్నగారికి వంగి దణ్ణం పెట్టబోయింది వసంత. ఆగమన్నట్టు చెయ్యి చూపించి బుట్ట గోడవారన పెట్టి వచ్చాడు నరసింహం.

"దీర్ఘసుమంగళీభవ.. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు" దీవించి చెల్లెలి ముఖంలోకి తరచి చూసాడు. ప్రయాణపు బడలిక మినహాయిస్తే ఆమె ముఖం ఎప్పట్లానే కళకళ్ళాడుతూ ఉంది. 'ఒక్క మగనలుసు పుట్టేస్తేనా.. ఇంకేవిటి లోట'నుకున్నాడు మనసులోనే. తల్లితో పాటూ తనూ మావయ్యకి ఓ దణ్ణం పెట్టేసి 'వెళ్ళనా?' అని కళ్ళతోనే అభ్యర్ధిస్తున్న చిన్నారిని వెళ్ళమన్నట్టూ తలూపింది వసంత. వీధిలోకి తుర్రుమందాపిల్ల. ఊర్నుంచొచ్చిన నేస్తం కోసం వీధి గుమ్మంలో అప్పటికే పడిగాపులు పడుతున్నారు ఇద్దరమ్మాయిలు.

"వదినేదీ?" వసంత అన్నగారిని ప్రశ్నించింది.
"పెరట్లో ఉంది. సాల అలుకుతున్నారు."
"అయ్యో, కాస్తాగితే నేనూ వద్దునుగా! పాపం నడుం నొప్పి మనిషి కూడానూ!" నొచ్చుకుంటూ పెరట్లోకి బిరబిరా నడుస్తున్న చెల్లెలితో నవ్వుతూ చెప్పాడు నరసింహం.
"మీ వదినకి ఊరంతా పనివాళ్ళే. వెన్ను వంచదు. నువ్వేం బెంగపడకు."

"ఏం బావా.. పనులవుతున్నాయా? మౌంజి పేనుతున్నావా! పవిత్రాలు కూడా ఇప్పట్నుంచీ సిధ్ధపెట్టేస్తున్నావా ఏం?" నవ్వాడు అనంతప్ప.
"అదేం లేదులే బావా. ఏవో తోచిన పనులు చేసి పక్కనపెడుతున్నాను."
"ఊరిఖే కంగారు పడకు. అవే అవుతాయ్. ఎవరెవరొస్తున్నారేం?"
"మా చిన్నాన్నగారూ, చిట్టి మావయ్యా ఉదయానికి వస్తారేమో. ఇక వాళ్ళ వాళ్ళు ఏమో, ఏం చేస్తారో!" నిట్టుర్చాడు నరసింహం.
"ఆ.. వచ్చినవాళ్ళే వస్తార్లే. మేవొచ్చేసేం కదా! నువ్వు బెంగపడకు. అయినా నువ్వొక్కడివి చాలవూ.. అన్నీ ఒంటిచేత్తో సంబాళించుకొస్తావు. నాలుగూళ్ళదాకా వందల పెళ్ళెళ్ళు చేయించున్నావు. ఇంతోటి వడుక్కి పెద్ద బ్రహ్మాండమేవిటి చెప్పు! పిల్లాడికి వడకపోగు వేసేందుకు నువ్వున్నావ్. అక్షింతలు వేసేందుకు మేవున్నాం. ఇంకేం కావాలయ్యా?"
"అంతేలే! అయినింటి పిల్లని చేసుకోవాలని ఇందుకే అంటారేమో! చుట్టాలకీ పక్కాలకీ కరువువాచిపోయాం." నిర్లిప్తంగా ఉంది నరసింహం మొహం.
"అబ్బబ్బా.. తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు! నీ పెరట్లో ఏ లంకెబిందెలో ఉన్నాయని ప్రచారం చేయిద్దునేంటీ?" మేలమాడాడు అనంతప్ప.
"ఆ పుణ్యం కట్టుకోకు బావా! పెరడంతా నన్నే తవ్విపొయ్యమంటుంది మహా ఇల్లాలు. మా తండ్రి గారు వాళ్ళ తాతగారికి మాటిచ్చారని తల్లి లేని పిల్లైనా, మప్పితంగా ఉంటుందేమో తెచ్చి చేసుకున్నాం. ఉన్న అన్నదమ్ములేమో ఉండీలేనివారే. ఆడపిల్ల పీటల మీద కూర్చుంటూంటే ఓ పూట ముందన్నా రావాలన్న ఇంగితముండక్కర్లా!! ఇలా వీడి వడుగు నిర్ణయించామని నెల్లాళ్ళ నాడు శుభలేఖ రాస్తే కూడా పత్తాలేరు. ఈవిడ రొద భరించలేక మళ్ళీ క్రితం వారమింకో ఉత్తరం రాశాను. ఉహూ.. కిమన్నాస్తి! వస్తే ఆ ముండల ముఠాకోరు.. చినబామ్మర్ది.. వాడు దిగబడతాడు ఏ అపరాహ్ణం వేళకో. ఈవిడ అదే లోకోపకారమన్నట్టూ మనని వంగి దణ్ణాలు పెట్టమంటుంది." విసుక్కున్నాడు.

"పోన్లెస్దూ! అవునూ బావా.. ఓ మాట." రహస్యమన్నట్టూ సైగ చేసాడు అనంతప్ప.
ఏవిటన్నట్టు చెవప్పగించాడు నరసింహం.
"వాళ్ళవాళ్ళు సమయానికి అందుకుంటారో లేదో అనీ.. " అర్ధోక్తితో ఆపాడు.
"ఊ.."
"పసుపు బట్టలు తెచ్చాం మీకు పీటల మీద పెడదావని. నాకూ చెల్లెలి వరసే కదా. ఆమె చిన్నబుచ్చుకోవడమెందుకూ ఇంత సందడి చేసుకుంటూ! ఒక్కగానొక్క పిల్లాడికి శుభమా అని వడుగు చేసుకుంటున్నారు."
"వెర్రి బ్రాహ్మడా! ఇస్తేనే చిన్నబుచ్చుకుంటుంది. సరేలే.. నువ్విప్పుడేం మాట్లాడకు. చూద్దాం."
"అదే అదే.. నీ చెవిన వేద్దామని. ఏ మాటకామాటే! మధుపర్కాలు.. చింతపండు రసం పలచగా తీసి, చాయ పసుపు వేసి  తడిపాం. చావంతిపువ్వులే అనుకో! ఆరిన బట్టలు మీ చెల్లి మడతవేసి తెస్తూంటే.. నాకెంత ముచ్చటేసేసిందో!" మురుసుకుంటూ చెప్పాడు అనంతప్ప.
"నువ్వూ కడుదువుగాన్లే బావా.. ఇంకెంతా ఐదేళ్ళు తిరిగేసరికి కన్యాదానం పీటలమీద కూర్చోద్దూ!" నవ్వుతూ అన్నాడు నరసింహం.

ఆ చిరుచేదు ఊహని ఆస్వాదిస్తూ నవ్వాడు అనంతప్ప. 

లోపల్నుంచి చెంబుతో మజ్జిగ, వెండిగ్లాసులూ తీసుకొచ్చి నిలబడింది అమ్మణ్ణి. పలకరింపులయ్యాక లోపలికి వెళ్తున్న భార్య పెరట్లోకి వెళ్ళేదాకా ఆగి,  అప్పుడు మాట్లాడాడు నరసింహం.

"నీతో ఓ విషయం చెప్పాలి బావా.."
చెప్పమన్నట్టూ చూశాడు అనంతప్ప.
"రేపుదయం వడుగువేళకి.. "
"ఊ.."
"చిన్నారిని ఎక్కడికైనా పంపేయాలి."
అనంతప్ప అర్ధం కానట్టూ చూశాడు.
"అది వడుగు చూడడం..."
"ఏవీ? కూడదా!"
"కూడదనేం కాదు. నా చాదస్తమే అనుకో పోనీ. అది పుట్టగానే నా కోడలనుకున్నాను. ఎప్పుడూ బయటపడలేదనుకో.. కాబోయేవాడి వడుగు అది చూడడవెందుకని."

చటుక్కున లేచి నరసింహం చేతులు అందుకున్నాడు అనంతప్ప. అతడి కళ్ళలో పల్చగా నీటితెర. 

***

ఏళ్ళు గడిచాయి. మురారి ఉపనయనం జరిగిన యేడాది.. పెరట్లో సాల పక్కగా నాటిన సన్నాకుల మావిడిచెట్టు, ఆ ఏడు కాపుకొచ్చింది. కొడుకు చేత రఘువంశం, శబ్దాలూ, ధాతురూపాలూ వల్లెవేయించేసరికి నరసింహానికి తలప్రాణం తోకకొచ్చింది. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని తీర్మానించుకుని, మురారిని నాలుగూళ్ల అవతలున్న చినతాతగారింట ఉంచేశాడు. స్థలం మార్పో, చండామార్కుడిలాంటి చినతాతగారి శిక్షణో.. మురారి పుటం పెట్టిన బంగారమల్లే నిగ్గు తేలాడు. కావ్యపాఠం రుచి తెలిసొచ్చింది. సంహిత పదక్రమం చెప్పడం చేతనవుతోంది.

***

"నీకు పెళ్ళి చేసేస్తారుటోయీ?" అడిగాడు భట్టు.
"నీకెవడు చెప్పాడోయ్?" ఆశ్చర్యపోయాడు మురారి.
"మా అమ్మ అంటోంది. మీ నానమ్మ చెప్పినట్టుంది."
"వాళ్ళు చేస్తే మనం చేసుకోవద్దూ!"
"చేసుకోకేంచేస్తావేం?"
"చేసుకుని ఏం చెయ్యమంటావేం?"
"నాలుగేళ్ళు తిరిగేసరికి పెళ్ళాం కాపరానికొస్తుంది. ఆపై నెల తిరిగేసరికీ పావలా కందిపప్పు, పది రూపాయల ధాన్యం బస్తా సంపాయించే దారి చూస్తావు. నీకు మొదలవుతుందిలే.. "
"ఏవిటి?"
"రంధి.." 

భట్టుకి మాచెడ్డ సరదాగా ఉంది మురారి ఉడుక్కుంటూంటే. కాసేపటి దాకా మురారి మాట్లాడలేదు. ఉన్నట్టుండి ప్రకటించాడు. 

"నేను తిరపతెళ్ళిపోతా.."
"ఎందుకూ?"
"శిరోమణి చదవాలి. ఆపై ఇంగిలీషు పరీక్షేదో ప్యాసైతే మేష్టరుజ్జోగం అవుతుందట. సుబ్బావధాన్లుగారి అల్లుడికి అయిందట." చెప్పాడు మురారి.
"మీ అనంతప్ప మావ వేయిస్తాడ్లే ఉజ్జోగం. పిల్లనిచ్చి ఊరుకుంటాడేవిటీ?" 
"దాన్నా!!" 
"నీకు తెలీదూ ఇందాకా? దాన్నా అని నోరు వెళ్ళబెడుతున్నావ్?" భట్టుకి నిజంగానే ఆశ్చర్యమేసింది.
"తెలీదు." 

మురారి మొహం ఎర్రగా కందిపోయింది. కోపం ఎలా తీర్చుకోవాలో తెలిసింది కాదు.

"ఏం చేద్దావోయీ?" స్నేహితుణ్ణి సలహా అడిగాడు.
"చేసేదేవుందీ?"
"పారిపోనా?" రహస్యంగా అడిగాడు.
"ఎక్కడికీ?! కాళ్ళిరగ్గొడతారు. అయినా నిన్నేవన్నా గుళ్ళెత్తమన్నారా? రాళ్లెత్తమన్నారా? పెళ్ళేకదోయ్. చేసేసుకో."
"నాకు ఇష్టం లేదు. అందునా దాన్నా?" వెగటుగా మొహం పెట్టాడు.
"పిలిచి పిల్లనిస్తామంటే ఏవిటోయ్ నీ బడాయి? కావ్యకన్యలొస్తారేం లేకపోతే! సంసారపక్షంగా ఇంటిపట్టున ఎవరో ఒకరు. కావాలంటే నాలుగు విచ్చరూపాయిలు సంపాయించగానే, మెరకవీధిలో నీ సారస్యాలు వెలగబెట్టచ్చు."
"ఛీ.." 
***

మావిడి గున్న ముదిరి, సాల పక్కన పచ్చనాకుల చావిడి పరిచింది. వీధరుగు మీద కూర్చుని కలంలో కరక్కాయ సిరా నింపుతున్నాడు మురారి. నరసింహం పడకకుర్చీలో కూర్చుని కునుకుతూ, ఉక్కబోసి తెలివొచ్చినప్పుడల్లా విసనకర్రతో విసురుకుంటున్నాడు. అనంతప్ప ఇంటి చాకలి, అప్పన్న నవ్వుకుంటూ గుమ్మంలోకి అడుగు పెట్టాడు. అప్పన్న తెచ్చిన శుభవార్త విని అమ్మణ్ణి మూతి విరిచింది.

"నా అన్నదమ్ములకి ఒక్ఖ ఆడనలుసు లేకపోయీ.. దానికీ భాగ్యం." కొడుకుని చూస్తూ మరోసారి ఝణాయించింది. 

వారం రోజుల తరువాత శన్యుషస్సులో చినతాతగారి ఊరికి ప్రయాణం కట్టబోతున్న మురారితో చెప్పాడు నరసింహం.

"చూడబ్బాయీ.. నీ భార్య వ్యక్తురాలయింది. శ్రావణమాసంలో కాపరానికొస్తుంది. ఈలోగా మంచిరోజు చూసి నిన్నిక్కడికి పంపేయమని తాతగారికి ఉత్తరం రాస్తాను. సిధ్ధపడు. దగ్గర్లోనే ఏదో వ్యాపకం చూసుకుందువుగాని."

మురారికి తండ్రి మాటలు గుర్తొచ్చి ఆ రాత్రి నిద్రపట్టలేదు. తిరపతి వెళ్ళే రైలు కూత, రాక్షసిబొగ్గు వాసన.. కలత నిద్రలో కలగన్నాడు. 
***

"పరిషత్తు నాటకాల వాళ్ళనుకున్నావేం? అల్లాటప్పా ఆవిడ కాదు. మనబోటి గొట్టికాయల్ని లోపలికి రానే రానివ్వరూ. మున్సబు గారి మనవడు లేడూ.. రావుడు. అతగాణ్ణి బామాలి సంపాయించా టికిటీ ప్యాసులు. రెండంటే రెండు. తీరామోసీ నువ్వు అర్ధాంతరంగా రానంటే ఎలా!" భట్టు చెరిగేస్తున్నాడు.

కాసేపు నసిగి అప్పుడు బయటపెట్టాడు మురారి. 

"రేపు బయల్దేరి మూణ్ణిద్దర్లకి అనంతప్ప మావయ్య గారి ఊరు వెళ్ళాలట. కబురొచ్చింది. సాయంత్రం మా ఊరెళ్ళాలి. అక్కణ్ణుంచీ వాళ్ళూరికి.. "
"ఓహ్హో.. అదా సంగతీ!! చెప్పావు కావేం!"

భట్టు చెలరేగిపోయాడు. మురారి ఆ పరాచికాలకి స్పందించలేక మౌనంగా ఊరుకున్నాడు.

***

మనసు దహించుకుపోతోంది. తన జీవితాన్ని ఎవరో ఇనప చట్రంలో బిగించేసి, సీలలు తిప్పేసి వెళ్ళిపోతున్నట్టూ..! ఊపిరాడని గదిలో అటు తిరిగి పడుకున్నాడు. ఆలోచనలు మాత్రం భట్టు సంపాయించిన టికిటీ ప్యాసు లేకుండానే, ఆ మేజువాణీ స్వరప్రస్తారాలని ఊహించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. 

***

ఆమె తల తిప్పినప్పుడల్లా రవ్వల చెవి కమ్మలు ధగధగా మెరుస్తున్నాయి. బరువైన వడ్డాణం ఆమె కట్టుకున్న ఆకుపచ్చ కంచిపట్టుచీర మీద జిగేలని మెరుస్తోంది. మెడలో కంటె ని ఒరుసుకుంటూ చిత్రాభరణాలు. కదిలినప్పుడల్లా ఖణేల్మంటూ చేతినిండా కంకణాలు. రెప్పవేయకుండా చూస్తూ, ఆమె పాడిన యదుకుల కాంభోజి మైమరచి విన్నాడు. ఆపై భైరవిలో త్యాగరాజకీర్తన అందుకుందామె.

కొందరి సొగసును కనుల జూడ..
కొందరి మనసు దెలిసి మాటలాడ..
కొందరి యంకమును పవ్వళింప..
కొందరి పెదవుల పలుకెంపులుంచ..

 గాంభీర్యపు జిలుగు అద్దిన ఆ గాత్రానికి పరవశమైపోతున్నాడు. గంటలు గడిచాయి. గానమాగింది.

పచ్చగా మెరుస్తున్న పల్చటి శరీరాన్ని ఉత్తరీయంతో కప్పుకుని నిలబడి,  విప్పార్చుకున్న కళ్ళతో తననే చూస్తున్న ఆ యువకుడి వైపుగా ఘల్లుఘల్లున నడిచి వచ్చిందామె. నవ్వుతూ నమస్కరించింది. చూపులతోనే మెచ్చుకున్నాడు. పెదవి దాటని భావసంచలనాన్ని అతడి కన్నులు పట్టిచ్చాయి. గ్రహించిందామె. మాటలు కలిపింది. వివరం తెలుసుకుంది. దడి దాటి లోపలికి చొరబడ్డ అతని సాహసానికి నవ్వుకుంది. 

"రెండేళ్ళనాడు కుదరలేదు. ఇప్పుడసలు చూస్తాననుకోలేదు!" ఉద్వేగంగా చెప్పాడు.
"రాజమహేంద్రి వెళ్ళాల్సి ఉంది. కానీ మీ ఊళ్ళో ఆగి వెళ్తేనే గండపెండేరం తొడుక్కోనిస్తామన్నారు. ఆపేశారు." కాస్త గర్వంగా నవ్వింది. అందం రెట్టింపయ్యింది. 

"ఏమి మాధుర్యం! గంధర్వులకే సాధ్యం కాదూ!" మనస్పూర్తిగా ప్రశంసించాడు.
"పూచి శ్రీనివాసయ్యంగారు గారు మా గురువుగారు! ఆయన పాడుతూంటే గాత్రంలో 'పూచి.. అంటే గేను ' వినిపించేది. అదే స్వామీ.. తుమ్మెద! అందుకే ఆయన్ని 'పూచి అయ్యంగారూ..' అంటారు. వారి భిక్షే ఈ సంగీతం. రాముడి దయ. గురువు గారి ఆశీర్వాదం. " రవల ముక్కెర, హంస తళుక్కుమంటూంటే చెప్పిందామె. 

ఆమె నుండి వీస్తున్న పరిమళానికి ముగ్ధుడై చూస్తున్నాడు.

"ఆ పుస్తక ఇల్లి తొగొండుబ.." పక్కనున్న ఆమెకి పురమాయించింది. 

"మాధుర్యం అంటిరే.. అది జీవితంలో వెతుక్కుంటే దొరుకుతుంది. నూరేళ్ళు ఆస్వాదించినా తరగని తీపి. తొగొళ్రి." అందించిందామె. 

బొద్దుగా ఉన్న ఆమె ఉంగరాల వేళ్ళని పరిశీలనగా చూస్తూ పుస్తకం అందుకున్నాడు. ఆ వేళ్ళు మీటిన వీణానాదం, ఆ గొంతులో వినిపించిన ఆలాపనలు ఇంకా అతని మస్తిష్కాన్ని మేలుకోనివ్వడం లేదు.

***

"త్వరగా స్నానం చేసి రమ్మంటున్నారు మావయ్య." 
చటుక్కున తలతిప్పి చూశాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది చిన్నారి. అదే రంగు చీర..  ఆకుపచ్చ! ఆమె పట్టుచీర గరగర గుర్తొచ్చింది మళ్ళీ.. ఆలోచిస్తూ ఉండిపోయాడు. 

***

"సన్నని చాకు ఏదమ్మా?" కాగితాల దస్తా ముందు వేసుక్కూర్చుని, వీధి అరుగు మీదనుండే అరిచాడు మురారి.
"సాలలో ఉందనుకుంటా. మీ నాన్నగారు నిన్న తాటాకులు చీరారు." అమ్మణ్ణి గొంతు వినిపించింది. 

మావి కొమ్మల సందుల్లోంచి ఎండ కరుగ్గా చొచ్చుకొస్తోంది. సాలలోకి అడుగుపెట్టి గుమ్మంలోనే ఆగిపోయాడు.

నుదుటి నుండి ధారగా కారుతున్న చెమటని మధ్య మధ్యలో ఎడమ జబ్బకి తుడుచుకుంటూ వంగి సాల ఊడుస్తోంది చిన్నారి. అతనిని చూడగానే నిలబడి ఏం కావాలన్నట్టు చూసింది.

"చాకు.."

కళ్ళతో చుట్టూ వెతికింది. అతని కళ్ళు ఆమె కళ్ళని వెతుకుతున్నాయి. చమటకి  నుదుటిపై అతుక్కున్న ముంగురులు వింతగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాడు. చటుక్కున వెనక్కి తిరిగింది. భుజాలు పట్టి నెమ్మదిగా తనవైపు తిప్పుకున్నాడు. 

"చెమట"
"...."
"చీపురు"
"...."
"అత్త్...."

ధారగా కారుతున్న చమట ఆమె చీరతో తుడుచుకుంటూ ఆమె వైపు చూసాడు. ఆసక్తిగా తననే గమనిస్తున్న కళ్ళు చప్పున వాలిపోయాయి. 

"ఒకటడగనా?"
"ఊ.. " అతని కుడిచేతి దండ మీద తల పెట్టుకుని అతని వైపు తిరిగి పడుకుంది.
నవ్వాపుకుంటూ అడిగాడు.
"నీ పేరు చిన్నారేనా?"
"....."
"ఎర్రగా చూసే అమ్మాయి అసలు పేరు ఏవిటో ఏ కావ్యాల్లోనూ చెప్పలేదు."
"హేమ" పెదాల వంపుని తడుముతున్న అతని చూపుల్ని అలవాటు చేసుకుంటూ చెప్పింది.
"హేమ.." మెత్తగా పలికిందతని గొంతు. 

"ఇంకేం చెప్పారు మీ కావ్యాల్లో?" చనువుగా అతని గుండెలపై సున్నాలు చుడుతూ అడిగింది. 

అరయఁ దనజోడు బయలాయె ననెడు వంత
చిత్తమున నాట నానాఁట జిక్కెఁ గౌను
మానహానికి సైతురే మహిని దలఁప
బట్టగట్టిన బలు గుణవంతు లెల్ల

నవ్వు పెదాలని ముడిచి ఆమె బుగ్గ మీద ముద్ర వేస్తూ చెప్పాడు గుసగుసగా.. 

"అంటే?" 
"హేమ బావుంది అని." 
"అబద్ధం" గారాలు పోయింది.
"పోనీ  అబద్ధమే.." నవ్వాడు ఆమె నడుముని వేళ్ళతో కొలుస్తూ..
"ఇన్నాళ్ళూ కనిపించలేదా?" అడిగింది. 
"...." 
"ఒక్క రోజైనా పలకరిస్తా..మో అని చూసే దాన్ని."
"..స్తావేమో.." అందించాడు.
సిగ్గుపడింది.
"మన్నించాలట నిన్ను" అమాయకంగా ఉన్నాయామె కళ్ళు.
"వాళ్ళకి చెప్పకులే.." అల్లరిగా నవ్వాడు. 
"నువ్వు మంచివాడివి బావా.." చటుక్కున బుగ్గమీద ముద్దుపెట్టింది. 

కళ్ళు మూసుకుని హాయిగా నవ్వాడు. 

"అంటే.. అంత మంచివాడివేం కాదులే." ఆమె కళ్ళలో అల్లరి. 
"అదేమీ?"
"బట్టకట్టిన గుణవంతుల మీద జాలి పడుతున్నావు కదా..!" 

చటుక్కున తలతిప్పి చూశాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం. తోటి బాటసారికి తన భాష అర్ధమవుతుందనే సంబరం. ప్రయాణం చప్పగా ఉండబోదన్న ఉత్సాహం.  

ఉద్వేగంగా హత్తుకున్నాడామెను. స్పర్శ మాట్లాడుతుందొక్కోసారి.

"రాంపురం వెళ్ళి ఫోటో తీయించుకుందామా?" ఆమె మెడలో మంగళసూత్రాలతో ఆడుతూ అడిగాడు.
"ఊ.."
"తిరపతెళ్ళిపోదాం మనం.."
"ఊ.."

***
(జీవన మాధుర్యానికి...)

Saturday, February 1, 2014

గాలిసంకెళ్ళు ~ 14

కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పద్నాలుగో భాగం ఇక్కడ..