Thursday, April 26, 2012

తోటకూరనాడే సెప్పీసినాను కొడకా..

బావూఁ.. నన్ను అప్పలనరసంతారు. మా ఇంటోడు "నరిసీ.." అనీవోడు. అదురుట్టమంతుడు.. నా ఒల్లోనే మారాజునాగా సుకంగా ఎల్లిపోనాడు. 

ఇయ్యాలేటో మనేద. కాలూ సెయ్యీ ఆడట్నేదు. ముగుణ్ణి కొట్టీసి మొగసేలకెక్కినాదట ఎనకటికొకత్తి! అట్టాగుంది నా పని. అవితే ఈడ నా తప్పేవీఁ నేదనుకోండీ.. న్నాయవోఁ అన్నాయవోఁ తవఁరే సెప్పాలి మరి.

యేటయినాదంటే.. నాకో గుంతడున్నాడు. గుంతడంటే సిన్నోడూ సితకోడూ యేటి కాదు. మొన్న దీపాలమాసె కి పాతికేల్లు ఎలిపొచ్చాయాడికి. బేంకీలో ఎటెండ్రు. బానే సంపాదిత్తన్నాడు. మనువూ సేస్సాం. ఆడి అయ్య పోయిన యేన్నర్దానికి మా సుట్టాలోల పిల్లే సాయిత్తిరి, దాన్నిత్తావఁని అడిగీ.. నాలుగు తులాల బంగారవూఁ, అయిదేలు రొక్కవూఁ ఇచ్చి ముడెట్టారు. ఆ సాయిత్తిరి, నా కోడలు.. అది సూత్తూండగా.. దాని కోసరవేఁ ఆడిని, నా కొడుకుని సాచి నెంపకాయ కొట్టీసినాను. నా సేతులొడిపోనూ.. ఆకాడినుంచీ మనేద. కడుపులో బాద. గుండిల్లో నొస్తాంది.

"పెల్లాం ముందు సెట్టంత కొడుకుని.. ఆడినెందుకు కొట్టీసినావే అప్పల్నరసా..?" అని తవఁరడుగుతారేటో.. ముందు సేనా పేద్ద కత సెప్పాల. అది ఇనుకుంతే నా కోపవూఁ అదీ అరదమవుతాది.

తగరపొలసలో మా సుట్టాలు.. మా పెద బాప్పకి యీరకత్తెకి సెల్లెలు ఉండీటిది. సూరప్ప అంతారు. ఆ సూరప్పకి కావెఁర్లొచ్చి సచ్చిపోతే.. సూరప్ప పెనివిటి పైడ్రాజు ఆరేల్ల పసిదాయిని తీసుకుని మా ఊరొచ్చీసినాడు. దాని పేరు "మజ్జి గవురి". గవురమ్మ తల్లి పెసాదవుఁ! లక్క పిడతనాగ ఉండీది. పైడ్రాజు సిన్నాన్న మనుసు సిక్కబెట్టుకునే దాకా మాయమ్మే గవురిని సాకీటిది. జడలేసీది, గుడ్డలుతికీది, కలో గంజో మాతో కలిపి పోసీది. నాకో ఎనిమిదేల్లుంతాయేవోఁ ఆకాడికి. నానూ, గవురీ కలిసి ఆడుకునేటోల్లం.

"ఊరందరికీ సోది సెప్పీ సిలక తన జాతకవెఁరగదన్న" సావెఁత మా పైడ్రాజు సిన్నాన్న బతుకులో నిజవు. అతగానేవోఁ పేద్ద వొయిజ్జుడు. తన పెల్లాం రోగం కానుకుని, కుదురుసుకోలేకపోనాడు. "కరమ! నా ఇంటిదాయికి నూకలు సెల్లిపోనాయ్" అనీటోడు. కొండల్లో తుప్పల్లో మూలికిలు తెంపుకొచ్చి ముద్ద నూరేటోడు. మిడతల్ని కాల్సీసి బసుమం సేసేటోడు. వానపావుఁ కొట్టు కాడ్నుంచి యేటేటో దినుసులు తెచ్చి మందులు తయారు సేసీవోడు. దినుసులూ అయ్యీ యేసి నూని మరక్కాచి కాలు నొచ్చినా, సెయి నొచ్చినా దిగరాసి కాపడం పెట్టీవోడు. యేటి ఒండ్రు తెచ్చి పట్లు యేసీటోడు. యెన్నెల రేతిరిల్లో తాసుపావుఁలు పట్టీవోడు! కోరలు పీకీసి మల్లీ ఒగ్గీసీవోడు. ఆ యిసం తో కూడా మందులు సేసీవోడని సెప్పుకునీవోరు. పెల్లాం పోయిన దుక్కంలో ఆ అయ్య ఊరు కానూరు ఒలసొచ్చీసినాడే కానీ.. మా ఊల్లో అయితే బయం నేకుండా వొయిజ్జం సేయించుకోసరం పైడ్రాజు దొరికినాడని సంబరం పడిపోనారందరూ! గవురికి తండ్రి వొయిజ్జం మప్పినాడు. కలవంలో మందు నూరీటిది. అయ్య సేసిచ్చిన మందు పొటలాలు కట్టీది. నూని వొస్త్ర గాలితం సేసీది. యే రోగానికి యే మందో టక్కున సెప్పీసీది. వొయసు సిన్నదే కానీ గుంట మా సురుకు.

నాకు మేనబావతోటే పదకొండేల్లకే మనువు సేస్సినారు గందా! మా బావ ఇల్లరికవూఁ, ముగుడుపోయిన మా బాప్ప అరణవూఁ ను. ఇట్టా యేల్లు గడిసి.. నానూ, గవురీ యేడాది తేడాలో సవఁర్తాడావు. యేటొడ్డు రెల్లుదుబ్బు నాగా మిసమిసనాడిపోయేటోల్లం. మాయమ్మ సేరు కుంకుడు కాయిలతో మా యిద్దరికీ తలంటీది. నాగుపావుఁల్లా జడలు! "నచ్చివీఁ దేవీ!" "గైరమ్మ తల్లీ!" అని పిలిసుకుని మురిసిపోయేటోల్లు మా అయ్య, సిన్నాన్నాను. గవురికి సవర్తాడక మునుపు మనువు సెయనేదు. "కులపోల్లంతా యెలేసినా పదారు దాటని పిల్లకి పెల్లి సెయ్య"ననీసినాడు మా సిన్నాన్న. సెప్పి సెప్పి సాలొచ్చి వొల్లకున్నాడు మాయయ్య. గవురికి ఆ పదారూ రానే వొచ్చీసినాయి.. ఎల్లిపోనాయీ. నాకేమో తొలిసూలు ఆడపిల్ల పుట్టి పురుట్లోనే పోనాది.

"కలిసొచ్చిన దాయికి ఇంటెనకే మనువని" నన్ను యెకసెక్కాలాడేటోల్లా.. నాకేవోఁ గవురిని సూత్తే మా ఈసుగా ఉండేటిది. 'మూగమనుసులు' సినీమాలో జెవుఁన నాగా యేటమ్మటా, పుట్టలమ్మటా గవురి తిరిగినట్టూ నన్ను తిరగనిచ్చీవోరు కాదు. "మనువైన గుంటవి, కుదురుగా యింటికాడ వొంట సేయ"మనీవోరు. మాయమ్మే గయ్యాలి గంప! మాతకి మునుపు "నువ్వు పెద్దదాయివి.. అది సిన్నగుంట.." అనీది. అయితే ఏవీఁ.. గవురీ, నానూ యింటెనక దడి దూకీసి, గట్లమ్మట యేటొడ్డుకి పారెల్లి ఆటలాడీసీవోల్లం.

ఓనాడు నెల్లిమరల ఆకుల సింతయ్య, సెయ్యి యిరిగి నాలుగు మాసాలవినా సాగట్నేదని మా సిన్నాన్న దగ్గిరికి సూయించుకోనీకి కొడుకునెమ్మట తీసీసుకుని వొచ్చీనాడు.. ఆల్లబ్బాయి పేరు మల్లేశు. చెయ్యెత్తు మడిసి. ఎర్రగా.. సిమ్మాసెలం కొండ దారిన ఔపడే 'కోతి' నాగా ఉన్నాడని నానన్నాను. "ఎల్లొసే.. కల్లు పోనాయేటి! సీంబాదం సెట్టు నాగా ఉన్నాడ"ని గవురన్నాది.

మల్లా మాసం.. మందు నూని ఒట్టుకెల్దామని వొచ్చీనాడు మల్లేశు. సూరు కిందకి దూరి ఒచ్చేతప్పుడు మట్టినలుసు కంటో పడిపోనాది. "స్సూ.." అని కన్ను కెలికీసుకుంతూ లోనకొలిపొచ్చి, అంత మడిసీ గిలగిల్లాడిపోనాడు. నానేమో ఇంటి ముంగిల్లో కూకుని సేప రుద్దుతన్నాను. గవురిని పిలిసాను. నాలిక్కొనతో మల్లేశు కంట్లో నలుసు తీసీసినాది. మందు నూనొట్టుకుని యెల్లిపోనాడు. ఆడి కంట్లో నలుసు పోనాది కానీ గవురి పడ్డాది. నాకెట్టా తెలుసా..? యెల్లిన మూడో నాడు "నూని కాయ సెయి జారి బద్దలేసిపోనాదని" మల్లా వొచ్చినాడు మల్లేశు.

మల్లేశు రెండ్రోజులకోపాలి ఔపడగానే, సిలకపచ్చ పవిఁట కాత్తా రెక్కలయిపోయి, ఎగిరి ఏటొడ్డున వోలీది గవురి! 'వొయిసులో ఉన్నారులే' అని ఒగ్గీనేను.. దాని మనుసు కట్టపెట్టనేను. మా ఇరకాటంలో పడిపోనాను. తాటి తాండ్రి, ముంజికాయలు, చెగోనీలు, యేపిన చెనక్కాయలు, జొన్నపొత్తులు.. యేటో ఒకటి తీసుకెల్లి ఆడికి తినిపించీది. ఆడు తినీవోడు. "సైకిలేసుకు యేటొడ్డుకు నీ కోసరం ఒలిపీరావడమే నీకు మహాబాగ్గెవోఁ గవురీ.. నాకు సేవలు సేసుకోయే!" అన్నట్టు ఒచ్చీవోడు. ఎండలో మాడి ఈ గుంట లగెత్తుకుని పోయ్యీది. ఒక్కపాలి సైకిలెక్కించుకు సంగోరు దూరం అయినా దింపీవోడు కాదు. ఒక్కనాడూ మురిపేనికైనా ఓ పువ్వో, పండో దాని సేతిలో పెట్టీవోడు కాదు. వోన పడితే అది తడిసి, ఆడి తల చెంగుతో కప్పీది. ఆడికోసవే బతికీది. ఆడూ వొచ్చీవోడు.. సైకిలున్నరోజు, బుద్ది తిరిగిన రోజు, నేదా.. గవురి కబురెట్టిన రోజూ..

ఓనాడు గవురికి మా సెడ్డ ఊష్టవొలిపొచ్చీసినాది. ముందరి మజ్జాన్నమే మా సిన్నాన్న బదరాసెలం ఎల్లాడు. పది రోజులక్కానీ రాడు. తోసిన వైద్దెం సేసుకుని అదీ, బెంగెట్టుకు సూత్తా మావూఁ.. మొత్తానికి వారానికి నెగిసి తిరిగినాది. 

"మల్లేశు యేటొడ్డుకొచ్చీనాడేమోనే.." అనడిగినాది. 
"నీకు జొరమొలిపొచ్చిందని ఆడికి కల్లోకెల్లి సెప్పుకోనేకపోనావా? ఆడు నీ కల్లో కూడా అప్పనంగా రాడు గందా!" అన్నాను. 
"ఎల్లొసే.. ఆడు అబ్బరంగా పెరిగిన బిడ్డ. సేయించుకోడం అలవోటు. నాను సేత్తే యేటి నట్టం? రేప్పొద్దున్న ఆడు పెట్టిన తిండి తినీ దాయిని. ఆడు తెచ్చిన కోక కట్టిందాయినీ.." కలల్లో తేలతా సెప్పింది.

మర్నాడు నూకరాజనే గుంతడితో కబురంపిత్తే.. యేటొడ్డుకొచ్చాడు మల్లేశు. ఏటయినాదో ఏటో.. మొకం మాడుసుకొని యెనక్కొచ్చినాది గవురి. ఏటయినాదే.. అంటే "నా మొకం సూసైనా "యేటే అలా ఉన్నావని" అడగనేదే! జొరమొచ్చిందంతే "ఊ.." అన్నాడంతే." అని బిక్కమొకమేసింది. "రేపొత్తాడు గందా.. అప్పుడడిగీ మొద్దు మొకం నాయాల్ని. "ఏరా.. వారం రోజులు పేఁవించిన దాయి ఔపించకపోతే యేటయిపోనాదని బెంగ నేదేట్రా?" అని.. అరిసాను. మాయమ్మ ఒలిపొస్తోందని నా డొక్కలో మోసేత్తో పొడిసి "ఇస్సూ.." అని యెచ్చరించింది గవురి. "దీని కరమ" అని తిట్టుకున్నాను. నిండు సూలాల్ని కాకపోతే అప్పటికప్పుడు ఆడింటికి లగెత్తి ఆడి మొకం ఈడ్సీసీ దాయినే!

నాల్రోజులకి నాకు నెప్పులొచ్చినాయి. పేణాలు సిమ్మాద్రప్పన్న కొండెక్కి.. నా ముగుడి అదురుట్టం బాగుండి యెనక్కొచ్చాయి. మాయమ్మ కడుపు సలవన నాను గండం గట్టెక్కి, నా కడుపు సీల్సుకుని ఓ నలుసు.. ఈడే ఈ సిమ్మాసెలం గాడు.. పనసపండు నాగా బూమ్మీద పడ్డాడు. కల్లల్లో పేణాలు యెట్టుకుని నీర్సంగా నులకమంచం మీద పడున్నానా.. నా సెయ్యి అప్పటిదాకా పక్కనున్న గవురి సేతిని నులివిఁ పిప్పి పిప్పి సేసీసినాదని అప్పుడు సూసాను. "కన్నెపిల్ల ఎంత బయం పడిపోనాదో..!" అని గచ్చుమన్నాను. మాయమ్మకి సాయం మరో ఆడతోడు గవురే అయినాదా ముసురు రేతిరి.

సిమ్మాసెలానికి మూడోనెలొలిపొచ్చినాక మొక్కు తీర్సుకోనీకి అప్పన్న కొండకెల్లామా.. ఆ రోజు కొండమీన కోతిని సూసి మల్లేశు గురుతొచ్చీ.. "ఈమజ్జె ఆడు ఔపడ్డం నేదేటే?" అనడిగితే, "యేటీ నేదు. కత కంచికి.. మనమింటికీ" అన్నాది గవురి. "యేటయినాదే.. ఎర్రి మొకమా! పేణాలు పెట్టుకున్నావాడి మీన?" అని దాన్ని దగ్గిరసా పొదూకున్నాను. గొల్లుమంతాదనీసుకున్నాను. ఆడేదో అన్నేయం సేసాడనుకున్నాను. అదేటీ కాదు.

"ఈ సిమ్మాసెలం గాడు పుట్టిన సెణం నీ బాద సూసేను గందా.. సచ్చి పుట్టావే మాయమ్మా! సల్లని అప్పన్న సూసి ఆడూ నువ్వూ పదికాలాలు సుకంగుండాల! ఒకడి బిడ్డని మోసి కనేతపుడు అంత యేదన పడాలంటే ఆ మడిసి ఎంత ఇలువైనవోడు అయి ఉండాలో గందా అప్పా?" మాటలాపేసి ఎటో సూపు సారించినాది గవురి. దాని యీపు సరిచాను.

"ఎహే.. ఆడు ఉత్త ఎదవా.." అన్నాను. వొలిసె పువ్వులా నవ్వీసినాది గవురి. "ఆడు సెడ్డోడు కాదులే! నాకు తగినోడు కాదంతే. ఆడికి పేఁవ ఉంది.. అది నాకు సరిపోదొలే." దాని మొకమంతా నెప్పి. మనుసు ముక్కలైన నెప్పి. మొకం మీది పుట్టుమచ్చ దాసీయొచ్చేవోఁ గానీ మనసిరిగిన బాదని దాయడం సులబం కాదు. 

"నీకు తగ్గోడు ఒత్తాడే.. కల్లల్లో ఎట్టుకు సూసుకుంతాడు." కాలగ్గేనం సెప్పినాను. "ఏవోఁ అప్పా.. ఎవుడొత్తాడో. మనుసుపడిన మనువు అవనేదని బాద నేదు. మనువు సేసుకున్నాక మనసెట్టి కాపరం సేత్తాననీ నమ్మకవూఁ నేదు." గవురి యేదాంతం సెప్పినాది. "మనసెట్టి కాపరం సెయ్యకపోతే ఏటి సేత్తావే! ఆ మల్లేశు గాడిని తలుసుకుంటా ఏడుత్తావా..? ఎర్రి మాతలు ఆడినావంతే కాల్లిరిసి పొయినో యెడతా. ఒల్లకుండి తప్పు సేసాను ఇందాకా." యెర్రి కోపమొలిపొచ్చినాది నాకు.

"నేదప్పా.. ఆడిని కాదనుకోడానికి కారనవేఁ నా సుకం. ఏరికోరి సేసుకున్నాక ఆడి తీరు నచ్చక రోజూ నా సేతని నేను తిట్టుకుంటా బతకనేను. ఆడిదీ తప్పని నాను అనను. ఆడిని పెంచిన పెంపకమట్టాంటిది. అత్తమానవూఁ "నాకాయుస్సూ నాకారోగ్గెం.." అనీ సిలక ముద్దుతనం ఆడిది. పంచుకుని తినాలనే బుద్ది ఆడి అమ్మే మప్పాలి గందా! అవుసరమవితే గుండికాయ తీసీసి ఆడి కాల్లకాడ యెడతా. ఆడూ అట్టాగే ఉండాలని కోరుకోటం తప్పేం కాదుగా! ఆడు అట్టా సెయ్యడని తెలిసీ సేసుకోడం నాదే తప్పవుతాది. నాకంత పేఁవ నేదు. అదే మాయయ్య తెచ్చినోడు ఎట్టాంటోడైనా నా రాతనుకుని సరిదేసుకుంతాను. ఏటంతావప్పా.. సరిగానే సేసానా?" యెందుకో ఆరేల్ల మజ్జి గవురి గురుతొచ్చింది నాకా చెణంలో! కొన్నింటికి మనవు సమాదానం సెప్పక్కర్నేదు. ఆనక గవురి కత యేటయినాదో తవఁరికీ అక్కర్నేదు.

నిన్న రేతిరి కాడినుంచీ ముసురట్టి కొంప కారి సత్తా ఉంటే, నిండు సూలాల్ని.. సాయిత్తిరిని, కల్లు పువ్వుల్లేసి ఔపించని నా కాడ ఒగ్గీసి.. నా కొడుకు సిమ్మాసెలంగాడు ఆడు పనిసేత్తన్న బేంకీలో ముసుగెట్టి తొంగున్నాడయ్యా.. రేతిరి బయలుదేరతా ఉంటే వోన మొదలయినాదట. తడిసి మొక్క మొలిసిపోతాడా..? ఆడి బిడ్డని మోత్తున్న ఆడదాయికి రేత్తిరేళ ఏ అవుసరం ఒత్తాదో అన్న ఇంగితముండక్కర్నేదా..? సేయించుకునే వొంటిని సేయడానికీ వొంచాల! బజార్లో ఉదయం టిపినీ తినీసి మరీ ఇంటికొచ్చినాడు. నాకు ఒల్లు మండిపోనాదంటే మండదా మరీ? ఆ యెర్రి సాయిత్తిరి టీనీల్లు కాత్తోందయ్యా ముగుడొచ్చేడనీ.. ఇది ఒక్క నాటికి పొయ్యేది కాదు బావూఁ.. సివరాకరి దాకా సరిసమానంగా ఇచ్చి పుచ్చుకునే యేపారవేఁ మనువంటే! ఎవురూ నట్టపోకూడదు.

"ఇంత సిన్న ఇసయాన్ని కొండంత సేసావే అప్పల్నరసా.." అంతారేవోఁ.. బావూఁ.. "తోటకూరనాడే సెప్పనైతిని కొడకా..!" అని నాను ఏడవనేను. 


Sunday, April 1, 2012

"మిథునం" పాటలు.. ఎలా ఉన్నాయంటే..

వంకాయ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎలా ఉండాలయ్యా అంటే "తత్వాలు పాడేటపుడు తంబురా శ్రుతిలా" అసలు విషయాన్ని మింగేయకుండా ఉండాలన్నాడు అప్పదాసు.

"నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు - చీర చెరుగులు పెట్టి తుడిచినా పోదు - పైట చెంగుల తోటి పులిమినా పోదు" అని పాడేంత సర్వజ్ఞురాలు బుచ్చిలక్ష్మి. చూడబోతే ఇద్దరికిద్దరూ సంగీత సాహిత్యాలు కాచివడబోసినట్టే అనిపిస్తారు.

అచ్చ తెలుగు కథగా పుట్టి ప్రాణం పోసుకుని.. కాగితాల్లోంచి గుండెల్లోకి చరచరా నడిచివచ్చి, గూడు కట్టుకున్న ఆ "మిథునం" - చలన చిత్రమై వెండితెరపై కనువిందు చేయబోతోందని విన్నదగ్గరనుంచీ ఆత్రమే.. అనుమానమే.. ఆరాటమే! పాత్రధారులూ, చిత్రీకరణ.. "మిథునం"లో అతి ముఖ్యమైన భూమిక ఆ "తోట" ఎలా ఉండబోతోందా అనే ఆలోచనతో పాటూ సంగీతం గురించి కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎట్టకేలకు ఆడియో విడుదల చేసారు. మచ్చుకు చూపించారు. ఆ పాటల కబుర్లు.. నాకు తెలిసినవీ.. నాకు తోచినవీ.. కొన్ని.

తనికెళ్ళ భరణి దర్శకత్వంలో, శ్రీరమణ "మిథునం" స్వరవీణాపాణి చేతిలో స్వరాలద్దుకుంది. జొన్నవిత్తుల, ఆనంద్ ముయిద రావ్, తనికెళ్ళ భరణిల కలంలో సాహిత్యాన్ని వ్రాయించుకుంది. కే. జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, జమునా రాణి, స్వప్న, జొన్నవిత్తుల గళంలో వినిపించింది.

* "షట్పద ఝుంకారమో.. ఏమో..!" అని ఒళ్ళు పులకలు తేలేలా మొదలయ్యే యేసుదాసు గంధర్వ గాత్రంలో "ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిథునం.." అనే పాట ఎంత విన్నా చాలుననిపించడంలేదు.

దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం

అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం

గృహస్థ ధర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం

ఇలాంటి మెరుపులు తళుక్కుమన్న జొన్నవిత్తుల సాహిత్యం చక్కగా ఉంది. యేసుదాసు మంత్రజాలం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! జగద్విదితం.. అదో అద్భుతం!!

* నాకు అమితంగా నచ్చిన పాట - అప్పదాసునీ, బుచ్చిలక్ష్మినీ ఠక్కున కళ్ళెదుట నిలబెట్టిన పాట అలనాటి మేటి గాయని జమునా రాణి పాడిన "ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ.." ఆనంద్ ముయిద రావ్ వ్రాసారట.

పడుచు మనసున్నోడు పరుగులెడుతున్నాడు
అరవయ్యేళ్ళ పడుచు అలిగి కూర్చున్నాది

కలతలన్నీ కలిపి కలనేతలా నేసి
కన్నీళ్ళు ఒగ్గేసి కలిసి నవ్వేసారు

ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ
రెండు గుండెల చప్పుడూ.. రాగమొక్కటె ఎప్పుడూ..



* "పాకవేదం అపౌరుషేయం.. అంటే నీకెట్టా తెలుస్తుందీ.. నిరక్షర కుక్షివి.." అని బుచ్చిలక్ష్మిని ఆడిపోసుకుని శాకాల్లో ఘనపంచరత్నాల చిట్టా చదివిన అప్పదాసుకి ఓ మంచి పాకకళాసారం దట్టించిన పాట ఉండాలని భరణి అనుకున్నారేమో.. ఇదిగో ఆయన కలం నుంచే ఓ మాంచి రుచి కోరు రుచైన పాట.. "ఆవకాయ మన అందరిదీ.. గోంగూర పచ్చడీ మనదేలే"

ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ.. పెసరట్టులోకి అల్లమురా
దిబ్బరొట్టెకీ తేనె పానకం.. దొరకకపోతే బెల్లము రా

వేడి పాయసం ఎప్పటికప్పుడె.. పులిహోరెప్పుడు మర్నాడే..
మిర్చీ బజ్జీ నోరు కాలవలే.. ఆవడ పెరుగున తేలవలే..

గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా..
గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా..

పనసకాయ నీకున్నరోజునే పెద్దలు తద్దినమన్నారూ..
పనసపొట్టులో ఆవపెట్టుకుని తరతరాలుగా తిన్నారూ..

అని అప్పదాసు మైమరచి పాడుతూంటే బుచ్చిలక్ష్మి పెనం మీద ఆవగింజలా చిటచిటలాడడం మన కళ్ళముందే కనిపించేయాలి కదా.. అతి చమత్కారంగా ముక్తాయింపిచ్చింది మరి..!  ఏమనీ..?

తిండి కలిగితే కండకలదనీ గురజాడవారు అన్నారూ..
అప్పదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటలా తెగతిన్నారూ.. అని
భలే బుచ్చిలక్ష్మి కదూ! ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, స్వప్న పాడారు. సాహిత్యం చదివితే ఓ మంచి పాటకి పేరడీ అని తెలిసిపోవడం లేదూ!

* "మావిడి పిందె కరష్టే కానీ.. అది చిలక కాదు.. ఉడత" అని ఇంగిలీషులో తేల్చి చెప్పింది కనుక బుచ్చిలక్ష్మి తన పెనివిటికి కాఫీ ఇస్తుందంటారా! ఇస్తుందేమో మరి! జొన్నవిత్తుల కాఫీ దండకమొకటి వ్రాసి, స్వయంగా పాడారు కూడా!

"అనుదినమ్మును కాఫీయె అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కూ
అమృతమ్మన్నది హం బక్కు అయ్యలారా.." అని సాగే ఈ దండకం "టేస్టేశ్వరి.. బ్రూకు బాండేశ్వరి" లాంటి చిత్ర పద విన్యాసాలతో నడుస్తుంది. "ఎలా ఉందీ.. నచ్చిందా?" అంటే సినిమా చూసేదాకా చెప్పలేను.

* ఎంతటి ఆనందమైనా ఒక ముగింపుకు రాక తప్పదన్న చేదునిజం.. భరణి రచన "ఆట గదరా శివా.. ఆట గద కేశవా.." యేసుదాసు గళంలో వింటూ ఉంటే మసక చీకటిలా కమ్మేస్తుంది.

ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకూ..

అయిదే పాటలు.. అలరించే పాటలు!

ఆడియో సీడీ కచ్చితంగా మీ ఇంట్లో చేరి మీకు వీనులవిందు చేయాల్సినది.. వెళ్ళి కొని తెచ్చేసుకోండి మరి!


"మిథునం" ఆడియో సీడీ
కీర్తన మ్యూజిక్
వెల: రూ 60/-, $5