Wednesday, August 31, 2011

పూవులేరి తేవే చెలి.. పోవలె కోవెలకు

పసిపాపలంత అందమైనవి ఈ భూప్రపంచంలో పువ్వులొక్కటే. ఘుమ్మున సువాసనలు వెదజల్లేవి, సుతారంగా ఓ చిన్న సుగంధ వీచికతో పలకరించేవి, చూపులకే సుందరమైనవి, ముళ్ళ అన్నయ్యల అనుంగు చెల్లాయిలంటివి, రంగురంగుల్లో, వివిధ పరిమాణాల్లో "భలే భలే అందాలు సృష్టించావు.. "అని పాడాలనిపించేలా చేసేవి పువ్వులే. 

జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా ముడుస్తుంది. కొప్పున్నమ్మ ఎన్ని పువ్వులైనా ముడుస్తుంది. అదేంటో చిన్నతనంలో ఇదీ అదీ అనే బేధం లేకుండా కంట పడిన ప్రతి పువ్వూ తల్లో ముడవాలనిపించడం ఎంత అబ్బురం కలిగించే అమాయకత్వం. అయ్యకోనేరు దక్షిణ గట్టు ఆంజనేయస్వామి కోవెల్లోంచి బయటకు వచ్చి, శివ లింగం పువ్వులు సైతం పంచుకు జడలో తురుముకునే వాళ్ళం. నందివర్ధనాలు, గన్నేరు పువ్వులు, గొబ్బి పువ్వులు, డిసెంబరాలు, చంద్రకాంత పూవులు, వదిలేస్తే ఉమ్మెత్త పువ్వులు సైతం "జడలో పెట్టక మాననూ.. " అని బయలుదేరేవాళ్ళం.

సాయంత్రం ఏడున్నర దాటిందంటే సైకిల్ బెల్లు, కటకటాల దగ్గర చెప్పులు విప్పిన అలికిడి, కండువా తీసి పడక్కుర్చీ చేతి మీద వేసి, పంచ ఒడ్డునున్న సిమెంటు గోలెంలో చెంబు ముంచి కాళ్ళు కడుక్కున్న శబ్దం, తడి అడుగులు నట్టింట్లోకి తేకుండా కాళ్ళు తుడుచుకుని, చేతి సంచీ లోంచి కూరలో, పళ్ళో, తమలపాకులో, సరుకులో తీసి చెక్క బల్ల మీద పరిచే ముందు సువాసన ముక్కుకి  తాకి తీరాల్సిందే, తాతగారు తెచ్చిన పువ్వుల పొట్లం లోంచి. మల్లెల కాలంలో, పండగ రోజుల్లో విధిగా పువ్వులు తెచ్చేవారు. తామరాకులోనో, అడ్డాకులోనో నీళ్ళు జల్లి పువ్వులు వేసి, అవి నలగకుండా, పొట్లంలోంచి జారకుండా బహు నేర్పుగా అరిటి నార తోనో, దారంతోనో కట్టి ఇచ్చేవారు పూలమ్ముకొనువారు. పువ్వులమ్మడం ఎంత భోగం కాకపోతే "పూలమ్మిన చోట.." అనే సామెత పుడుతుంది చెప్పండి? మొక్క ఎదిగి చిగురు తొడిగి మొగ్గ వేసి పువ్వు పూచిందంటే, కుదురు తీసి నీరు పొసి, ఎదురు చూసిన శ్రమ" హూష్ కాకీ.." అని ఎగిరిపోదూ!

పూలంటు కాలంటి
పున్నెముందంటాది
వగలమారీ పడుచు
నగ తొడిగెనంటాది

పూల బాసలు తెలుసు యెంకికీ
తోట పూల మనసులు తెలుసు యెంకికీ

ఏడాదికి ఓ సారి మా ఇంట్లో నందివర్ధనం చెట్టు కొమ్మలు దగ్గరికి కొట్టించేసేవారు. ముందు రోజు కనుక బజార్లోంచి పువ్వులు తెచ్చుకోకపోతే, పూల సజ్జ చిన్నబోయేది . అప్పుడు  తెలతెలవారుతూనే చిన్న చిన్న సజ్జలు పట్టుకుని, పక్కింటి నేస్తాన్ని సాయం తీసుకుని ఈశ్వర వారింటికి బయలుదేరేదాన్ని. "మా అమ్మ పువ్వులు కోసుకు రమ్మంది, ఈశ్వర తాతగారూ" అని పేపరు చదువుకుంటూ గుమ్మంలో కూర్చున్న ఆ ఇంటి యజమానికి చెప్పేసి వాళ్ళ పెరడు అనబడే నందనవనంలోకి వెళ్ళే వాళ్ళం. ఎన్ని రకాల మందారాలో! ముద్ద నంది వర్ధనాలు, నిత్య మల్లెలూ, గరుడ వర్ధనాలు, గన్నేరు పువ్వులూ మామూలే! నీలి గోరింట పువ్వులు ఎంత అపురూపంగా ఉండేవంటే, నీలి రంగులో చిన్న గులాబీ వర్ణం కలిసినట్టున్న సుకుమారపు రేకులు విచ్చి ప్రపంచాన్ని చూస్తూ, ఏ తుషార బిందువు తాకిడికో సిగ్గుగా ముడుచుకుని, కుతూహలం ఆపుకోలేక ఓరగా చూస్తున్నట్టు ఉండేవి. కసరు మొగ్గలు సైతం కోసి పారేసే బాల్యపు రోజుల్లో కూడా ఆ పువ్వులు మాత్రం కోయబుధ్ధేసేది కాదు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపానికి ప్రోద్బలం నీలి గోరింటల అంతులేని అనుపమాన సౌందర్యమేమో అని నా అనుమానం.

పూల జడల వైభోగం ఇంకో మరిచిపోలేని ముచ్చట. కాసిని కనకాంబరాలో, సన్నజాజులో కనిపించాయంటే "అమ్మా, జడ కుట్టవా" అని సాగదీసుకుంటూ గారాలు. కాదంటే వెక్కిళ్ళలోకి మారే దుఃఖం. "కనకాంబరాల దండ సాగిపోతుంది తల్లీ" అనో, "జాజులు రేపు ఉదయానికి వాడిపోతాయ్, ఎందుకు చెప్పు" అనో సర్ది చెప్పి, ఫలానా పువ్వులు రాగానే పెద్ద పూల జడ కుడతానని ప్రమాణం చేస్తే అప్పటికి శమించేదాన్ని. మొగలిపూలు వచ్చాయంటే ఎంత సంబరమో! మొగలిపూల జడ అయితే రెండు రోజులు ఉంచుకోవచ్చు చక్కగా! ఏ శనివారం ఉదయమో కుట్టించుకుంటే, ఆ రోజు పట్టు పరికిణీ, మెళ్ళో ముత్యాల దండ వేసుకొని ఘుమఘుమలాడే మొగలి బొమ్మాయిలా బడికెళ్ళి రావచ్చు. "మీ అమ్మ గారు కుట్టారా? ఏదీ ఓ సారి వాసన చూడనీ!" అని నేస్తాలందరూ అడుగుతారు. ప్రాణ స్నేహితులకి ఎలాగూ అమ్మనడిగి నాలుగో, ఫ్ఫదో మొగలు రేకులతో కుట్టిన పువ్వులు తీసుకెళ్ళొచ్చు. పసిమి పచ్చటి మొగలి రేకులు పువ్వులా మడిచి, వాటి మధ్య చిన్న గులాబీ పువ్వో, కనకాంబరం దండో పెట్టి కుట్టేది అమ్మ. నేస్తాలెవరైనా అదే రోజు మొగలి జడ కుట్టుకుంటే "నీ జడకెన్ని పువ్వులు పట్టాయ్, అంటే నీ జడకెన్ని?" అని లెక్కలేసుకొనేవాళ్ళం. మొగలి పొత్తి మధ్యలో ముదురు గోధుమ వర్ణంలో వెన్ను ఉంటుంది. దాన్ని ఓ పాత బట్ట చుట్టి దుప్పట్లు, తువ్వాళ్ళు పెట్టే చెక్క బీరువాలో  పెట్టేది అమ్మ. బట్టలన్నిటికీ మంచి వాసన పడుతుందని. అప్పుడప్పుడు ద్వారకా తిరుమల నుంచి వచ్చిన బంధువులెవరైనా పొగడపువ్వుల దండలు తెస్తే, వాటినీ బీరువాలోనే పెట్టేది అమ్మ. పొగడపువ్వులూ పారిజాతాల్లాగే నేల రాలాక ఏరి దండలు గుచ్చుతారట. 

పెద్ద పిన్ని వాళ్ళింటికి వేసవి సెలవుల్లో వెళితే బొండు మల్లెలు పెట్టుకోవచ్చు. చీపురు పుల్లలు చిన్న చిన్న ముక్కలుగా విరిచి చక్రం ఆకారంలో దారంతో కట్టి వాటికి బొండుమల్లెలు గుచ్చేది పిన్ని. మల్లెపూల చక్రం అన్నమాట. జడ కూడా రోజూ అమ్మ వేసినట్టు  ఒక్క వెంట్రుకా చెదరకుండా బిగదీసి  కాకుండా, పైన చిన్న చిన్న పాయల నాగరం జడ వేసి, మెడ మీదుగా వదులుగా మిగిలిన జడ వేసేది పిన్ని. "చిక్కులు పడిపోతుందే, రేపు ఉదయాన్నే దీని శోకాలు, రణగోల భరించాలి." అని అమ్మ సణుగుతూ ఉండేది పక్క నుంచి. అయినా పిన్నిని అమ్మ ఏం అనలేదు కదా! తెగ బారెడు జడలో ఒక్క బొండుమల్లెల చక్రం పెట్టుకున్నా ఎంత దూరం ఘుమఘుమల వర్తమానం పంపేదో వేసవి సాయంత్రాల చిరు గాలి, "మల్లెలు ముడిచిన ముద్దుగుమ్మలొస్తున్నారహో.." అని.

అమ్మమ్మ గారింట్లో లేని పూలమొక్క లేదు తెలుసా! శ్రావణ భాద్రపదాల్లో ఎప్పుడైనా వెళ్ళామా, చెంగలువలు చూడచ్చు. జడివాన కురవాలి చెంగలువలకి. అప్పన్న కొండ మొదట్లో ఉండే దేవస్థానం వారి పూల తోటలోంచి నెమళ్ళ క్రేంకారాలు వినిపిస్తే చాలు.. ఇళ్ళలోంచి పిల్లలని బయటికి వెళ్ళ నిచ్చేవరు కాదు. "బురదలో జారిపోతారు. వర్షం వస్తుందిప్పుడు. మేఘం చూడు ఎంత నల్లగా ఉందో! నెమళ్ళు అరుస్తున్నాయ్ వినబడలేదూ!" అని బెదిరించి కూర్చోబెట్టే వారు. మాట వింటే బజ్జీలో, వేయించి కారం జల్లిన పనస పిక్కలో ఇస్తారనుకో! ఆ వచ్చే వర్షం చీకట్లో కాకుండా సాయంకాలం వస్తే మహ బాగుంటుంది. నల్లటి కొండకి ఇంకా నల్లటి మబ్బుల దుప్పటి కప్పేసి, మధ్య మధ్య మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసి, ఉగ్ర నార సింహుడి గర్జనలా ఒక్క ఉరుము ఉరిమిందా, గడ్డి దుబ్బులా ఉండే మొక్క మొదట్లోంచి చివాలున తలెత్తి చినుకులని కావలించుకోడానికా అన్నట్టు రేకులు విప్పేస్తాయ్ తెలతెల్లటి చెంగలువలు. నేను చూసిన అధ్భుత దృశ్యాలలో వెన్నముద్దల్లాంటి చెంగలువలు విరియడం ఒకటి. అవి కోద్దామంటే అమ్మమ్మ తిట్టేది. "అపురూపమైన పువ్వులవి. ఉన్నంత సేపు మొక్కకే ఉండనివ్వండి. కోసి పాడు చెయ్యడమెందుకూ?  రోజూ జాజి తీగలు ధ్వంసం చేస్తున్నారు చాలదూ!" అనేది.

అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ జాజి తీగలు మేడ మీదకి ఎక్కించి ఉండేవి. పిట్ట గోడ మీద సాగరసంగమం కమలహాసన్ లా విన్యాసాలు చేస్తూ పిల్లకాయలందరం పువ్వులు కోసేవాళ్ళం. నాలుగున్నర అయ్యాక సందులో కుళాయికి ప్లాస్టిక్ పైప్ తగిలించి మొక్కల మొదళ్ళలో వేసి, పువ్వులు కోసి ఇంట్లోకి తీసుకెళ్ళేసరికి సరిగ్గా గంట పట్టేది. అమ్మమ్మ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పువ్వులని మాలలు అల్లడం మొదలెట్టేది. "నాకు ఈ రోజు మూరెడు దండ కావాలంటే, నిన్నా నీకే పెద్ద దండ ఇచ్చింది, ఈ రోజు నాకే.. " అని కీచులాటలు. విని విని విసుగొచ్చి "అన్ని పువ్వులూ కృష్ణుడి మెడలో వేసేస్తా భడవల్లారా.. వెళ్ళి నీళ్ళు పోసుకొని జడలేసుకుని రండి" అని అరిచేది అమ్మమ్మ. "పుష్ప కైంకర్యం చేస్తున్నారా, రంగనాయకమ్మ గారూ?" అని వేళాకోళమాడేవారు తాతగారు. "ఏం కైంకర్యమో, ఏమో! సాయంత్రం అలా కోవెల దాకా వెళ్ళొద్దామంటే కుదరదు కదా! ఈ రోజు మానేద్దాం అనుకుంటే, ఈ పిల్లల మొహాలు చూస్తే "అయ్యో!" అనిపిస్తుంది. రంగయాత్రా.. దినే దినే" అని నిట్టూర్చేది.

ఎనిమిది మంది గోధుమవన్నె త్రాచుల్లాంటి ఆడపిల్లల జితమత్తమధుకరశ్రేణుల్లాంటి వేణులలో జాజుల దండలు ముడవాలంటే ఆవిడకి ఎంత ఓపిక ఉండాలి! మేము ఎనిమిదిమందీ గంటలో కోసుకొచ్చిన జాజిపూవులు ఆవిడ శరవేగంతో గంటలో దండ కట్టేది. ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఆవిడ మాలలల్లిన నేర్పు, ముద్దగా అందంగా ఒక్క పువ్వూ నలగకుండా, తీగె నుండి కోసిన మొగ్గ కళ్ళు విప్పేలోపు దండలో కూర్చే చాకచక్యం ఇంకెవరికీ లేదు మరి. పిల్ల తలలో పూలు కళ్ళిప్పినాయంట. అన్నట్టే మొగ్గల దండలు మా జడల్లో ఒదిగి, పొద్దు గూకే కొలదీ ముగ్ధంగా పరిమళాలు విరజిమ్మేవి. ఏ సంపెంగపువ్వులో ఉన్న రోజు మేము జాజులని చిన్న చూపు చూసినా, యధావిధిగా మాల అల్లి మూడడుగుల కృష్ణ విగ్రహానికి వేసేది అమ్మమ్మ.

నూరు వరహాల పూవులని ఒకదానిలో ఒకటి అమర్చి గిన్నెలు గిన్నెలుగా పరుచుకొని ఆడుకొనేవాళ్ళం. ఎవరు ఎక్కువ దొంతులు చేస్తే వారు గొప్ప. చీపురు పుల్లలకి పసుపు, తెలుపూ కలిసినవి, ఎర్రటివి నూరువరహాల పూవులు గుచ్చి బాణాల్లా సంధించుకొని యుధ్ధాలు చేసుకునేవాళ్ళం. ఇక రామబాణపు పువ్వులైతే గుత్తులు గుత్తులుగా పూసి తేనెలూరుతూ ఉండేవి. ఇంట్లో తిండికి కరువొచ్చినట్టు, ఆ పువ్వులను పీల్చి మకరందం తాగే వాళ్ళం. ఇంత విధ్వంస కాండ చేసినా, నాలుగు రోజులయ్యేసరికి మళ్ళీ పిల్ల మూకకి పువ్వుల విందు తయారయ్యేది. అమ్మ లాగే, మొక్కలు కూడా కదా!

పెద పండగకైతే బంతి పూల సంబరాలు. చలికాలపు వేకువల్లో గులాబీ బాలల సోయగాలు. ఇన్ని పువ్వులు చూసినా, ఇన్ని అనుభవించినా నాకు తనివి తీరని దివ్య పరిమళం "పన్నీరు గులాబీది." ఆ పువ్వు రంగు చూస్తే "గులాబీ రంగు అంటే ఇది" అనిపిస్తుంది  . తెలవారు ఝామున ఘుమ్మని సువాసనతో చలి గాలితో కలిసి, నాసికని చేరి మెదడుని తట్టి నిద్రలేపడం ఎంత అందమైన అనుభూతో! ఆ గులాబి మొక్క దరిదాపుల్లో కూర్చుంటే మన సర్వాయవాలు పన్నీట ముద్దైపోయినంత సువాసన. ఖచ్చితంగా అది దేవతా పుష్పమే అని నా నమ్మకం. ఎందుకంటే పనిగట్టుకు పండగలకి పూసేది ఆ పువ్వు. కోసి జడలో తురుముకున్నానా.. వందమందిలో ఉన్నా కళ్ళుమూసుకుని  పిలిచేది అమ్మ . "నన్ను అడుగూ, గులాబీ కోసి ఇస్తానని చెప్పానా? గోటితో గిచ్చి కోసేసావ్. మళ్ళీ మొగ్గ పెట్టాలా? ఇంటికి రా, నీ పని చెప్తాను" అని.

వినాయక చవితి వస్తోందంటే చెరువుల్లోంచి కోసుకు తెచ్చుకున్న తామరపువ్వులు, తోటలమ్మట పడి తెచ్చుకున్న పత్రితో బొజ్జ గణపయ్యకి దండిగా పూజలు జరిగేవి. ఎన్ని రకాల పూవులు దొరికితే అన్నింటితోనూ ముంచెత్తేసేవాళ్ళం. చేమంతుల సంబరాలు చెప్పనే అక్కర్లేదు. చిట్టి చేమంతుల దండ ఎంత బరువున్నా బుజ్జి మట్టి వినాయకుడు మొయ్యాల్సిందే! చేమంతుల తోరణాలు కట్టేసి పండగను లాక్కొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టేవాళ్ళం.

 "ఇంత పువ్వుల పిచ్చి ఉన్న పిల్లనే! మీకిది న్యాయమా? పుష్ప విలాపం చదివాక తెలుగు వారెవరైనా చెయి జాచి పూవు దూయగలరా మహానుభావా? బొజ్జ గణపతి వచ్చేదే ఏటికొకమారు. గరిక పూజతో సరిపెట్ట మనసు రాదయ్యా." అని కరుణశ్రీ ని నిలదీస్తే పూవుల సౌకుమార్యం, పరిమళం అద్ది, పద్య కుసుమాలను ఇచ్చి "వీటితో పూజ చేస్కో ఫో.." అన్నారాయన. విఘ్ననాయకునికి పూజ చేసుకుందామా మరి?

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గు

పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!

Friday, August 26, 2011

భవసాగరంలో కాగితపు పడవ

"మా చిట్లక్కి తోకలేని కోతి" అని కనిపించిన వాళ్ళందరికీ, నన్ను కనిపెంచినవాళ్ళు పనిగట్టుకు చెప్పేవారు. తెలుగు నాన్ డీటైల్డ్ లో "పువ్వు పుట్టగానే పరిమళించినట్లు" అని సరోజినీ నాయుడు గురించి చెప్పలేదూ! ఇదీ అలాగే! ఇక చిట్లక్కి అంటే ఏమిటంటే, చిట్టి లక్క పిడత అని.

నా బాల్యం మహ గొఫ్ఫగా గడిచింది. బొమ్మలు అలిసిపోయేదాకా వాటితో ఆడాక ,  వంటింట్లోకి వెళ్ళి ఉప్పూ - గోధుమరవ్వ, చింతపండూ - కందిపప్పు ఇత్యాది విడదీయలేని బంధాలను సృష్టించి, చేతికందిన వస్తువల్లా నీళ్ళ బిందెల్లోనో, కుంపట్లోనో పడేసినా.. కనీసం పొద్దు గడిచేది కాదు. చీపురుపుల్లలన్నీ కట్టలోంచి ఒలిచి పెట్టానా.. ఇంకో పది నిముషాలు. పాలు తాగి, తలకు పోసుకొని, ముస్తాబయ్యి పనిలో పని అమృతాంజనమో, కాటుకో అద్దానికో, మొహానికో పూసుకు ఏడ్చి గోల చేస్తే ఇంకో గంట. మళ్ళీ తిని పడుకొని లేచి చూస్తే ఆవులొచ్చే వేళైనా అవదాయె. పడక్కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్న తాతగారి గుండెలమీది వెంట్రుకలు లెక్కేసుకుందామంటే, ఓ.. విలవిల్లాడిపోయేవారు. సహనం బొత్తిగా శూన్యం పెద్దవాళ్లకి. ఇల్లంతా గిరికీలు కొట్టివస్తే గంటలు గడవడానికి మనదేమన్నా రాజప్రాసాదమా, ఏమన్నా? అబ్బబ్బబ్బ.. విసిగిపోయానంటే నమ్మండి. అప్పటికి రేడియోలో నీళ్ళు పోసాను. కనకాంబరం వెన్నులు దూసిపోసాను. చేమంతి మొగ్గలు పుణికి పెట్టాను.  చేసిన పనే రోజూ ఏం చేస్తాం? రోజులు గడవవే! మూడేళ్ళ వయసంత కష్టమైన వయసు ఇంకొకటి లేదు సుమండీ!

ఇలా గడుస్తూండగా ఓ రోజు ఓ సంఘటన జరిగింది. తాతగారితో కలిసి షికారుకి వెళ్ళొస్తున్నానా.. పార్వతీశం మేష్టారు కనిపించారు. "అమ్మలూ, మేష్టారికి నమస్కారం చెయ్యమ్మా!" అని తాతగారు చెప్పారు. పార్వతీశం మాష్టారేమో చింత గింజకి తెల్లటి గోరంచు పంచె కట్టి, లాల్చీ వేసినట్టు ఉంటారు. బొడ్లో చైను గడియారం, భుజానికి గుడ్డ సంచీ, కాళ్ళకి ఆకు చెప్పులు. "బాలామృతం" అనే అద్భుత లేహ్యానికి పేటెంట్ హోల్డర్ ఆయన. ఏం వేసి చేసే వారో కానీ, నల్లగా, ఘాటుగా, వగరుగా ఉండేదా పదార్ధం. మా ప్రాంతంలో ఎవరి పిల్లలకి ఏడాది పుట్టిన రోజు జరిపినా వెళ్ళే వారు మాష్టారు. ఓ సీసాడు బాలామృతం పట్టుకెళ్ళి పుట్టిన రోజు పిల్లాడినో, పిల్లనో ఆశీర్వదించి "ఏడాది నిండింది కదా. రోజూ పరగడుపున "బాలామృతం" ఒక్క చెంచాడు తినిపించండి వీడికి. మూడో ఏడు వెళ్ళేసరికి అమోఘమైన తెలివితేటలు, మాటల్లో స్పష్టత వస్తుంది. జలుబులు, తుమ్ములు , అజీర్తి వీడి జోలిక్కూడా రావు. శుభం." అని ఇచ్చి వచ్చేవారు.

మూడేళ్ళు నిండి అక్షరాభ్యాసం జరిగిన పిల్లలందరినీ విధిగా పార్వతీశం మేష్టారి దగ్గరికి ట్యూషన్ కి పంపించాలి. ఆయన ఇల్లెక్కడో ఎవరికీ తెలియదు కానీ, మా వీధి చివర కట్టమూరి వారింటి కుడి అరుగు మీద సాయంత్రం నాలుగు అయ్యేసరికి వచ్చి కూర్చొనే వారు. ఇంట్లో నాలాంటి బాల రాక్షసుల బాధ పడలేని అమ్మలు, అయ్యలు ఆ సమయానికి పిల్లకాయలను తీసుకెళ్ళి ఆ అరుగెక్కించి వచ్చేవారు. ఓ గంటో, రెండు గంటలో, చీకటి పడే దాకా అక్కడే పడిగాపులు కాసేవాళ్ళా పిల్లలు. అలా ఎదురయి తాతగారికి తక్షణ కర్తవ్యాన్ని తెలియపరిచిన పార్వతీశం మేష్టారి దగ్గరికి ఓ నాల్రోజుల తరువాతి నుంచి నన్నూ పంపించడం మొదలెట్టారు.

"ఏం పిల్లా, నీకు వంకాయ తెలుసా?" అడిగారు మాష్టారు.
"ఓ.." కళ్ళు రెండు చక్రాలు, తలకాయ ఇంకో చక్రం చేసి తిప్పేస్తూ చెప్పాను.
"ఇదిగో ఈ పలక మీద గీతలు గీసి ఇస్తున్నాను. అదిగో వెంకటేషు గీస్తున్నాడు చూడు, అలా వంకాయలు గియ్యాలి వరుసగా.. ఏం?"
వెంకటేషు ఎన్ని యుగాల నుంచో శ్రధ్ధగా గీస్తున్న చిత్రకారుడిలా, గుండ్రంగా తెల్లని వృత్తాలు నల్లటి పలక మీద గీసుకెళ్ళిపోతున్నాడు. మొదటి రోజు నాకేం చేతకాలేదు. నాల్రోజులు ఏమీ రాలేదు. పదో రోజుకల్లా పట్టుబడింది.

అలా గీత దాతకుండా గుండ్రంగా, ఒకదాని పక్కన ఒకటి వంకాయలనబడు సున్నాలు రాసుకుపోవడమే పని. కొన్నాళ్లకి గీతలు గీయకుండా సున్నాలు చుట్టమనేవారు. వంకాయల వరుస కొండ దిగిపోయినా, ఎక్కేసినా "ఏం, బాలామృతం పట్టెయ్యనా?" అని బెదిరింపొకటి, నా ప్రాణానికి. ఆయనకి నేను గీసిన వంకాయలు తృప్తి కలిగించాక, అప్పుడు మొదలెట్టించేవారు అక్షరమాల. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది. పలకమీద గుండ్రంగా ఒక వరుసలో వృత్తాలు గీయడం వచ్చాక అక్షర మాల నేర్వడం ఎంత పని అని. పార్వతీశం మేష్టారి దగ్గర వంకాయలు చుట్టిన వాళ్ళందరి చేతి రాతలు ముత్యాల కోవలు. అక్షర మాల, గుణింతాలు, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, చిన్న చిన్న వాక్యాలు పట్టుబడేసరికి స్కూల్లో వేసే వయసొచ్చేది. ఏణ్ణర్ధంలో పిల్లలకి వాక్యాలు కూడబలుక్కుని చదవడం మప్పేసే వారు.

కట్టమూరి వారింటి కుడి అరుగుపై పార్వతీశం మేష్టారి మూడు నుంచి అయిదేళ్ళ చిట్టి బొమ్మల కొలువు, ఎడమ అరుగు మీద కట్టమూరి పద్మనాభ శాస్త్రి గారి ఋగ్వేదం సంత జరుగుతుండేది. ఆయన దగ్గర వేదాధ్యయనం చెయ్యడం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారాలు చేస్కుంటూ, అరుగుల మీద, పంచల్లోను, సింహాచలం దేవస్థానం వారు మా ఊళ్ళో నిర్మించిన సత్రంలోను పడుక్కుంటూ గడిపేవారు బ్రహ్మచారులు, వేదాధ్యాయులు ఎందరో. బజార్లోకి వెళ్ళొస్తూ వీధి చివర సైకిలాపి బాల్యస్నేహితుడైన పద్మనాభ శాస్త్రి గారితో ఓ రెండు నిముషాలు ముచ్చటించి, పార్వతీశం మేష్టారిని పలకరించి, నాకో చిరునవ్వు తాయిలమిచ్చి వెళ్ళిపోయేవారు తాతగారు. "కట్టమూరి వాడు మహా భాగ్యశాలే. నిత్యం వాడి ఇంటి ఎడమ అరుగు కాడమల్లెల చెండు లాగ, కుడి అరుగు చిట్టి చేమంతుల సేరులాగ ఉంటుంది." అనేవారు నాయనమ్మతో.

మూడో తరగతి సెలవుల్లో అనుకుంటా, ఓ మహాద్భుతం జరిగింది. చందమామ కథలు చదువుకోగలిగాను. పెద్ద పెద్ద కథలు అర్ధమయ్యేవి కాదు. అవే కథలు మరో నాలుగు నెలల తరువాత మళ్ళీ చదివితే సూక్ష్మం బోధపడి కొత్త ప్రపంచపు రెక్కల వాకిళ్ళు తెరుచుకున్నట్టు ఉండేది. చందమామ పుస్తకంలో ఆఖరి కథ చదవడం పూర్తయ్యేసరికి అదోలాంటి బెంగ కమ్మేసేది. "అయ్యో! అప్పుడే అయిపోయిందా.." అని. కొన్నాళ్ళు అదే పుస్తకం మళ్ళీ చదువుకొని సంబర పడడం. ఇంకో కాగితమో, పుస్తకమో దొరికే దాకా బుల్లి మనసులో అశాంతి. ఇంచుమించు అందరికీ తెలిసిన రుచే కదా ఇది! చందమామ పిచ్చోళ్ళు కాని వాళ్ళు తెలుగుళ్ళలో పుట్టి ఉండరు.

అది మొదలు కిరాణా సరుకులు చుట్టి వచ్చిన కాగితాలు, దిన, వార పత్రికలు వెతికి ఓ కథో, కార్టూనో చదివితే కానీ తోచేది కాదు. మీకూ అంతేగా! ఇవి కాక "యస్య జ్ఞాన దయా సింధో.. " అంటూ అమరం నూరిపోస్తే కానీ తాతలకి తృప్తి లేదు కదా! పాల బువ్వ లాంటి కృష్ణాష్టకం, లడ్డు అంత తియ్యని వెంకటేశ్వర సుప్రభాతం, అమృతపు ధారలా ముకుందమాల, చెగోడీల్లా శతక రత్నాలు, పూతరేకుల్లాంటి భర్తృహరి సుభాషితాలు, విదురనీతి, బెల్లం మిఠాయిలా పోతన భాగవతం, ఇలా ఎన్నో ఎన్నెన్నో .. అర్ధం కానక్కర్లేదు. భక్తి ఒంటపట్టక్కర్లేదు. డొక్క శుధ్ధి అంటారే! దానికి ఇదే మహత్తరమైన దారి. పలకలేని పదం ఉండకూడదు. వినని పద్యం వదలకూడదు. అలా ఉండాలి బాల్యం అంటే.

తాతగారి అక్కని 'నాన్నత్తయ్య' అని పిలుచుకునేవాళ్ళం. రామతీర్ధం అనే పల్లెటూరు వాళ్ళది. పాడీ పంట ఉన్న పెద్ద మండువా ఇల్లు. నాన్నత్తయ్య గారింట్లో ఆవిడ కట్టెలపొయ్యి మీద కమ్మగా వండిపెట్టినది అడ్డాకుల విస్తరి వేసుక్కూర్చొని తినేసి, ఆవిడ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేసి, చేతులు కడుక్కుని వెళ్ళి వాళ్ళ లైబ్రరీ గదిలో  దూరేదాన్ని.  నాన్నత్తయ్యకి ఇద్దరు కొడుకులు. సర్పంచ్ పెద మావయ్య గారి తీరిక వేళ వ్యాపకం హోమియోపతీ వైద్యం. ఆ పుస్తకాలున్న బీరువా జోలికి వెళ్ళడమే నిషిధ్ధం. అది దాటితే ఇంకో అద్దాల బీరువా నిండా రామాయణ భాగవతాలు (భారతం ఇంట్లో ఉండకూడదంటారు. కులక్షయం జరిగిన కథ అని.) తమిళ ప్రబంధాలు, మీమాంస శాస్త్రం, న్యాయ శాస్త్రం ఇంకా బోలెడు పెద్ద పెద్ద పుస్తకాలు. చిన్న మావయ్య రాజకీయ పుస్తకాలు, దిన పత్రికల కలెక్షన్ ఉండేది ఇంకో బీరువాలో. నాకు కావలసినవి ఆ పక్క గూట్లో ఉండేవి . ఈనాడు పేపరు మూడో పేజీలో కుడి చేతి వైపు కింది మూలలో బొమ్మల కథలు వచ్చేవి గుర్తుందా! అవి ఓపిక గా కత్తిరించి బుల్లి బుల్లి పుస్తకాలు కుట్టే వారు చిన్న మావయ్య. రెండు పెద్ద పెద్ద దొంతులు ఉండేవి. అవి కాక బాలల బొమ్మల భాగవతం, రామాయణం, కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి. ఆ కిటికీ మూల కూర్చొని ఒక్కో పుస్తకం చదివేసి మళ్ళీ దొంతులు పెట్టే దాన్ని. ఉన్న నాలుగు రోజుల్లో రెండో, మూడో సార్లు చదివేసి విసుగొస్తే "చిన్న మావయ్యా.." అని గునిసే దాన్ని. "తినేస్తున్నావే.. శబ్దరత్నాకరమో, నాలాయిరమో చదివెయ్.. " అని ముద్దుగా విసుక్కొని ఏదో ఒక పుస్తకం వెతికి ఇచ్చేవారు. ఈ రోజు చిన్న మావయ్యా లేరు. ఆ పుస్తకాల దొంతులిచ్చిన ఆనందమూ లేదు. తలుచుకుంటే గుండె మాత్రం గర్వంగా పొంగిపోతుంది. "ఎన్ని తీపి గురుతులున్నాయ్ నాలో..!!" అని.

అమ్మమ్మ గారింటికి వెళ్తే ఇంట్లో స్వాతులు, భూములు, సితారలు అయిపోయాయంటే మధ్య వీధిలో లైబ్రరీ కి వెళ్ళి వేలాడే దాన్ని. అది మూసేస్తే మళ్ళీ ఇంటికొచ్చి ఆరుగురు మేనమామల్లో ఎవడో ఒకడిని కాకా పట్టడమే. "కొత్త పుస్తకాలేవైనా తెచ్చిపెట్టమని." వేసవి సెలవులు నెల రోజుల్లో, కనీసం తొమ్మిది వందల ఇరవై ఏడు సార్లు అమ్మమ్మ వెతుక్కుంటూ కొట్టడానికి వచ్చేది, ఏ మూల కూర్చుని పుస్తకం చదువుకుంటున్నానో కనిపించక. అమ్మకి ప్రతీ సారి చెప్పేది. "ఈ పిల్లని వదిలేసి వెళ్లకే బాబూ, తిండి తినదు. ఏ మూలనుందో తెలియదు. పొద్దస్తమానం పుస్తకాలే. కళ్ళు పాడవుతాయ్. దేనికైనా హద్దుండద్దూ!" అని.

మా రెండో మేనమామ రామానుజం ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఏ సంస్కృతం టాపర్.  ప్రొఫసర్స్ ని మెప్పించి తెచ్చుకున్నవి, మక్కువతో కొనుక్కున్నవి అపురూపమైన పుస్తకాలెన్నో బీరువాల నిండా పేర్చుకొనే వాడు. . "Gem" అని ముద్దు గా పిలుచుకునే వారు మావయ్యని యూనివర్సిటీలో. రామాను'జం' కదా అతని పేరు! "జెం.. జెం" అని పిలుస్తూ ఇంటికి హడావిడిగా వచ్చేది ఓ స్నేహితురాలు. కూర్చున్నంత సేపు కుర్చొని నిశబ్దంగా పుస్తక చౌర్యం చేసి జారుకుంటూ ఉండేది. ఆ పిల్ల ఇంట్లో లెక్కపెట్టలేనన్ని పుస్తకాలు బీరువాల్లో తాళాలేసి భద్రంగా ఉండేవిట. ఆ పిల్ల వస్తే మా మావయ్యకి హడలు. కొన్నేళ్ళ తరువాత ఎవరి పెళ్ళిలోనో మావయ్యా, నేనూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, సదరు స్నేహితురాలు కనిపించింది, పిల్ల తల్లయి, రెండింతల వెడల్పయి. "హెల్లో జెం!!" అని  మావయ్యని ఎంతో ఆనందంగా పలకరించింది. కుశల ప్రశ్నలు అయ్యాక ఆవిడ పక్కనే ఉన్న నాలుగేళ్ళ కూతుర్ని చూస్తూ మావయ్య అడిగాడు. "పేరేం పెట్టావ్?" అని
"విద్యాధరి" అని చెప్పించింది పిల్ల తో తల్లి.
"నీ పుస్తక సేక(తస్క)రణ మక్కువకి తగ్గట్టే పెట్టావ్ కూతురి పేరు. బాగుంది" అన్నాడు మావయ్య.
"అదేంటి జెం? "
"విద్యాధరి అంటే బుక్ షెల్ఫ్ .. కదా! కొంటున్నావా ఇప్పుడైనా పుస్తకాలు?" అంటించాడు మన జెం. వెర్రి నవ్వు నవ్వేసిందా స్నేహితురాలు.

నిష్ఠల సుబ్బారావు గారి లైబ్రరీ నుండి ఉదయం పదిగంటల వేళప్పుడు ఏభై పైసల నవలొకటి ఆద్దెకి తెస్తే, భోజనానికి పిలిచేసరికి నవల పూర్తి చేసెయ్యాల్సిందే. మళ్ళీ ఎడాకటి వేళ ఏ కారప్పూసో, బత్తాయి తొనలో నోట్లో వేసుకుంటూ, వీధి గదిలో మడత మంచం మీద బోర్లా పడుకొని మరో సారి పుస్తకం ఆమూలాగ్రం తిరగేసి ఏభైకి ఏభై అయిదు పైసలు కిట్టించుకుని మరీ సాయంత్రం తిరిగి ఇచ్చేదాన్ని. రోజుకొక్క నవల అనే షరతు మాత్రం ఆ లైబ్రరీ ఉన్నన్నాళ్ళూ ఉంది. వేసవి సెలవులు ఇంకో నెలలో మొదలవుతాయంటే "గున్న మామిడి కొమ్మకి మొదటి పిందెప్పుడు వేస్తుందా!" అన్నంత ఆశగా ఆ లైబ్రరీ వైపు చూస్తూ ఉండేదాన్ని. సెలవుల్లో తప్ప చదువుకునే పిల్లలని రానిచ్చేవారు కాదు నిష్ఠల సుబ్బారావు గారు తన లైబ్రరీకి.

గురజాడ గ్రంధాలయం ప్రాంగణంలో పుస్తక ప్రదర్శన మొదలయిందంటే పొలోమని వెళ్లేవాళ్లం నేనూ, నా నేస్తం. ప్రదర్శన మొదటి రోజు పుస్తకాలన్నిటినీ అబ్బురంగా చూడడం, వెల ఎంతో చూసి "హమ్మో!" అనుకొని పక్కన పెట్టడం, అన్నింట్లో కాస్త అందుబాటులో ఉన్న పలుచని పుస్తకం కొనుక్కోవాలని తీర్మానించుకొని ఇంటికి రావడం. దాచిన డబ్బులు పోగు వేసి, ఇద్దరం కలిపి ఓ పుస్తకానికి ఉమ్మడి యజమానులమయ్యేవాళ్ళం. పద్దెనిమిది సంవత్సరాల మా స్నేహానికి పునాది పుస్తకాలే.

"కాలమనే సముద్రపు ఒడ్డున దీప స్థంభాలు పుస్తకాలట. బాగుంది కదూ!" చెప్పనోసారి నేస్తంతో. "హ్మ్.. మరే! నువ్వు భవసాగరాన్ని కూడా కాగితపు పడవలోనే ఈదేస్తానంటావు కదా! నీకు బాగానే ఉంటుంది." వేళాకోళం చేసింది నవ్వుతూ. "చాల్లెద్దూ, ఒక పుస్తకం ఎన్ని జీవితాల సారమో! భవసాగరమెంత పని? పుస్తకాలిచ్చిన వెలుగులో ఎంచక్కా ఈదెయ్యొచ్చు." నమ్మకంగా చెప్పాను.

ఎప్పుడైనా తెలియక పుస్తకం చింపినా, తెలిసి నిర్లక్ష్యం చేసినా "కంకుభట్టు గారి మేక" కథ చెప్పేవారు తాతగారు. కంకుభట్టు అని ఒకాయన ఉండేవారట. అతనికి అపురూపమైన గ్రంధాలెన్నో పూర్వీకుల నుంచి సంక్రమించాయిట. అతనికి తను ఏకసంతాగ్రాహినని, మహా పండితుడినని మా చెడ్డ గర్వం ఉండేదిట.  ఈయన మిడిసిపాటు చూసి బుధ్ధి చెప్పాలని మారు రూపంలో పరమేశ్వరుడు, ఓ నాడు ఓ మేక ని తీసుకొచ్చి ఆతని పాండిత్యానికి నజరానా ఇచ్చాడట . వీధి అరుగు మీద కూర్చొని గ్రంధాలు తిరగేస్తూ చదివిన పుటల్లా చింపి విసిరేస్తూ ఉండేవాడట కంకుభట్టు. చదివిన పుటతో మళ్ళీ తనకి జన్మలో అవసరం పడదని మిడిసిపడేవాడట. అతను చింపి పడేసిన కాగితమల్లా ఆ మేక మేస్తూ ఉండేదిట . మేక "బ్రేవ్"మని త్రేన్చగానే కంకుభట్టు అప్పటిదాకా చదివినదంతా మర్చిపోయేవాడట. అలా కొన్నాళ్ళు గడిచేసరికి కంకుభట్టు పామరుడైపోయాడు. మేక పండితురాలై పోయిందిట. మళ్ళీ చదువుకుందామంటే పుస్తకాలు చింపిపోసాడాయె. "అంచేత పుస్తకం మహా గొప్ప వస్తువు. ఎప్పుడు ఏ పుస్తకం అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు." అని చెప్పేవారు తాతగారు. ఇది కట్టుకథే కావచ్చు.  కానీ నన్ను కట్టుబాటులో ఉంచిన కథ.

ఖండాంతర వాస శిక్ష విధించబడేనాటికి ఇంటి నిండా బోలెడు పుస్తకాలతో, కాగితపు పూవుల నందనవనాన్ని పెంచుకున్నాను. పెట్టె సర్దుకొనే క్షణంలో ఇవన్నీ పట్టుకెళ్ళే వెసులుబాటు లేక మనసు మెలిపడింది.  ఏం వదిలెయ్యను? ఎంచే వీలుందా? విశ్వనాథవారిని వదలనా? తిలక్ ని వెనక్కి పెట్టనా? కూనలమ్మ పదాలు తెస్తే, ఎంకిపాటలు ఘొల్లుమనవా? రామాయణం ఎంచుకోనా, రసాలూరు భాగవతం విడిచి? గీతాంజలిని వద్దనగలనా?  అయ్యో, చిలకమర్తి వారు? సాక్షి వ్యాసాలు? ఇక మిగిలిన పుస్తకాల వైపు చూద్దామనుకొనేసరికే మసకమసగ్గా కళ్ళు అలుక్కుపోతే అంతకంటే కష్టం ఇంకొకటి ఉంటుందా? 

"పుస్తకాలు లేని ఇల్లు, కిటికీల్లేని గదిలాంటిది. ఊపిరాడదు నాకు." జీరబోతున్న గొంతుతో చెప్పాను, పక్కనే ఉన్న నేస్తానికి. మౌనంగా భుజం మీద చెయ్యేసి ఓదార్చింది. చేతికి అందిన పుస్తకాలను పెట్టెలో నింపుకుని వచ్చేసాను. గుండె నిండిన బాధ కళ్ళలోంచి పొర్లుతుందెందుకో?

 

Tuesday, August 16, 2011

ప్రేమలో నేను - అరడజను సార్లు

"దీని అసాధ్యం కూలా.. రాసేసిందీ? " అని కుర్చీలో ముందుకు జరిగి శోభాడే 'సోషలైట్ ఈవెనింగ్స్'  చదివినంత ఉత్సాహంగా చదివెయ్యడానికి సిధ్ధపడితే మీరు పప్పులో కాలేసినట్టే!  నన్ను అమాంతం  ప్రేమలో పడేసిన ఆరడజను మరపురాని పదార్ధాల గురించి నోరూరించేలా  చెప్తానని మాత్రం షడ్రుచుల మీద ఆన. "తిండితో ప్రేమేంటి?" అనడానికి మీరేం మాయాబజార్ చూడని తెలుగువారు కాదుకదా!

పొరుగింటి పుల్లకూర : .. రుచి" అని వెక్కిరించిన వారి పొరుగింట్లో మా సుబ్బలక్ష్మాంటీ లాంటివారు ఉండి ఉండరు. పూర్ణకుంభానికి ఏడుగజాల పుల్లేటికుర్రు చీర కట్టి, వెన్నపూసంత చల్లని చిరునవ్వు తగిలిస్తే సుబ్బలక్ష్మాంటీ. పేరంటాలకి, నోముల వాయినాలు తీసుకోడానికి సాయం వెళ్ళడానికి ఆవిడ ముగ్గురు కూతుళ్ళూ మొండికేస్తే, అభిమాన పుత్రిక హోదాలో నేను ఆవిడ వెంట తిరిగే దాన్ని. అదే హోదాలో ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర అయ్యే సరికి నా చెవులు రిక్కించుకు ఎదురుచూసేదాన్ని, గోడ అవతల నుంచి వినపడే పిలుపుకోసం.

 ఓ కాలు చాపుకు ముక్కాలి పీటమీద కుర్చోని, పంపు స్టవ్ మీద పెట్టిన  పెనం మీద,  పక్కన న్యూస్ పేపర్ పై  తయారు గా ఒత్తి పెట్టుకున్న చపాతీలు కాలుస్తూ ఉండేవారు ఆంటీ. పక్కనే పెద్ద కుంపటిమీద ఇంకాస్త పెద్ద గిన్నెలో పొగలు కక్కుతూ చిక్కదనాన్ని సంతరించుకుంటున్న బంగాళదుంపల కూర. అది సాదాసీదాగా తయారు చేయబడే ఓ మహత్తరమైన పదార్ధం.  ఆవాలు, జీలకర్ర, బోలెడు పచ్చి మిరపకాయలు, అల్లం, కరివేపాకు తాలింపు చిటపట్లాడాక ముందు ఉడికించి చిదిమి ఉంచిన బంగాళ దుంపలు వేసి, కాస్త ఉప్పు, పసుపు, ఆ తరువాత నీళ్ళలో కలిపిన శెనగ పిండి కలిపి ఉడికాక ఓ నాలుగు చుక్కల అమృతం చిలకరించి కుంపటి సెగ తగ్గించి అలా ఓ అరగంట ఉడికిస్తే .. ఆ.. ఏమంటారూ, అమృతం తియ్యగా ఉంటుందా!  నాన్సెన్స్... ఎవరు చెప్పారు మీకు?

స్టీల్ ప్లేట్లో గరిటె జారుగా ఉన్న కూర వేసి ఇచ్చేవారు. చేతులు కాలకుండా జాగ్రత్తగా ప్లేట్ పట్టుకొని కూర్చుంటే, పెనం మీద నుంచి నూనె పూసుకొని పొంగి ఆవిరి వదులుతూ ఘుమఘుమలాడే చపాతీ సరాసరి ప్లేట్లోకి దూకేది. ఎడం చేత్తో ప్లేట్ జారిపోకుండా పట్టుకొని గొంతుక్కూర్చొని కుడి చేత్తో ఓ  చపాతీముక్క  తుంపి సెగలుకక్కుతున్న కూరని దొరకబుచ్చుకొని అలా నోట్లో పెట్టుకుంటే నాలుక మీద దీపావళి.  వేడి, కారం, మళ్ళీ వేడి, ఉప్పదనం, చపాతీ కమ్మదనం, అల్లం ఘాటు, మళ్ళీ కారం.. ఓహ్.. రుచి మొగ్గలు పిల్లి మొగ్గలేసేవంటే నమ్మండి! మనిషి  నోరు ఎన్ని డిగ్రీల వేడిని తట్టుకోగలదో దానికి ఖచ్చితంగా ఇరవై ముఫ్ఫై డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే ఆ చపాతీ కూర నోట్లోకి వెళ్తూంటే కళ్ళలో నీళ్ళు, ముక్కు పై చెమట , నాలుకపై ఇదీ అని చెప్పలేని అద్భుతమైన రుచి.. వెరసి సుబ్బలక్ష్మాంటీ  చేసిపెట్టే  శనివారం ఫలహారం.

ముత్యాల జల్లు కురిసే :  ఊళ్ళో పెళ్ళయితే ఎవరికో హడావిడి అన్నట్టు, నా చిన్నతనంలో మాకు తెలిసినవాళ్ళెవరి ఇంట్లో పెళ్ళి జరిగినా నాకే భలే సంబరంగా ఉండేది. బంధువర్గంలో పెళ్ళి ఏదైనా కుదిరితే బంగారం రామానుజయ్య అండ్ సన్స్లో, మధుపర్కాలు గోపాలరావు షాపులో, లడ్డూ తయారీ మా తాతగారి చేతిలో. తెల్లవారుఝామున మొదలయ్యే లడ్డూ మహా యజ్ఙం ఇంచుమించు మిట్ట మధ్యాహ్నానికి ఓ కొలిక్కి వచ్చేది. కట్టి, ఆరబెట్టిన లడ్డు బుట్టల్లోకి ఎత్తి పైన అడ్డాకులు వేసి జాగ్రత్తగా పెళ్ళివారింటికి పంపించేసేవారు. అంతా అయ్యాక నూనె మూకుడు ఉంది కదా! అని వంక పెట్టి  అటక మీద నుంచి ఇంకో జత బూందీ చట్రాలు తీసేవారు. మోతీచూర్ లడ్డూ చేయడం కోసం.. నాకోసం ప్రత్యేకంగా!

 అతి సామాన్యమైన శెనగపిండిలో కాసిని నీళ్ళు కలిపి ఓ చట్రం లో పోసి, టక్ టక్ మని శృతి బధ్ధం గా కొడుతూంటే, జల్లులా పిండి వేడి నూనెని తాకడం,  సెకనులో నాలుగోవంతులో చిన్నచిన్న ముత్యాల్లా బంగారు రంగు బూందీ గా పరిణామం చెందడం, బలిష్టమైన తాతగారి ఎడమచెయ్యి ఇంకో చట్రం తో అలవోకగా ఆ బూందీ తీసి పక్కనున్న పళ్ళెంలో జారవిడవడం.. నా మస్తిష్కంలో అదో చెరిగిపోని అద్భుతం. తయారుగా ఉన్న పాకంలో బూందీ ఒక్క మునక వేసిందా.. జిహ్వకి, మనసుకి ఒకే సారి తీయని స్వర్గ ద్వారాలు తెరిచి రారమ్మని పిలిచే మోతిచూర్ లడ్డూ తయార్. స్వర్గంలో రంభ లడ్డూలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, నా మట్టుకు నాకు ఇష్టమైన పదార్ధాల స్వర్గంలో రంభ లడ్డూయే!  

పాడెద నీ నామమే :  "మసాలా.." అని పాడి తీరుతారు మా ఊళ్ళో నాగభూషణ్ మసాలా ఒక సారి తిన్నవాళ్ళు. వీధికో నాలుగు ఛాట్ బండీలు పుట్టుకొస్తున్నా, విజయనగరం ఊళ్ళో ఎవర్ గ్రీన్ "నాగభూషణ్ మసాలా".  హై స్కూల్లో ఉండగా  సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి రెక్కలు విప్పుకొని పక్షుల్లా వాలిపోయేవాళ్ళం  కోట బయట శ్రీ డెంకేషా వలిబాబా గోరీకి అభిముఖంగా ఉండే ఓ సాదాసీదా బఠాణీ ఛాట్ అమ్మే బండి దగ్గర. "నాగభూషణ్ మసాలా" అని ఎర్ర వంకర టింకర అక్షరాలతో  రాసి ఉంటుంది బండి మీద. పెద్ద పెనం మీద రాశి పోసి మరిగిస్తున్న కాబూలీ శనగలు, చుట్టూ పెద్ద కోట గోడలా కేరట్, బీట్రూట్ తురుము. అందులో ఏముంటుందో చిదంబర రహస్యం కానీ, ఎలా ఉంటుందో మా ఊరి పిల్ల జనాలని ఎవరిని అడిగినా చెప్తారు.

ఇనుకోండి.. వేడిగా పొగలు కక్కుతూ, కొత్తిమీర ఘుమఘుమలతో  నోట్లోకి ప్రవేశించిన ఆ మసాలా ఏమేం చేస్తుందో తెలుసా.. నాలుక మీద రుచుల విస్ఫోటనం!!!  చిన్న ప్లేట్లో మీ చేతిలో ఉన్న ఆ చాట్ అలా అలా అలా మీ సర్వేంద్రియాలని లోబరుచుకొని, మీ ఏకాగ్రతని తన పై నిమగ్నం చేయించుకొని, ఆ క్షణంలో ప్రపంచం మునిగిపోయినా, మీరు మాత్రం ఆ ప్లేటు చేత్తో పట్టుకొని యే మర్రాకు మీదో కూర్చొని పూర్తి చేసి తీరేలా చేస్తుంది.. విక్రమార్కుడికి మా నాగభూషణ్ మసాలా సంగతి తెలిసి ఉంటే, ఒక్క ప్లేట్ మసాలా కొనిపెట్టి భేతాళుడి నోరు మూయించి మోసుకుపోయేవాడు.

మావా..మావా..మావా... : అయిదడుగుల ఎత్తు, సాంప్రదాయ వస్త్రధారణ, చమత్కారం చెమక్కుమని మెరిసే మాటతీరు, పనసపొట్టు కుర్మా అత్యద్భుతంగా చేసే నైపుణ్యం మా మూడో మేనమామ రాజగోపాల్ సొత్తు. ఇంటికి పెద్దల్లుడయిన మా నాన్నగారు వచ్చారంటే అమ్మమ్మగారింట్లో మహ సందడిగా ఉండేది. "బారూ (బావగారు).. పనసకాయ కొట్టెయ్మంటారా?" అని తెలతెలవారుతూనే అడిగేవాడు గోపాల్ మావయ్య.  సై అంటే సై అనుకొని మరీ లేతగా లేని మంచి పనసకాయ తెచ్చి పనసపొట్టు కొట్టడంతో పని మొదలయ్యేది మావయ్యకి. "అరవై నాలుగు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి" అని నేను నమ్ముతాను. మీరు నమ్మకపోతే ఒక సారి పనసపొట్టు కొట్టి చూడండి.

 పెరట్లో స్టవ్ తెచ్చి పెట్టుకొని ఇత్తడి మూకుడు (బాణలి/బాండీ) పెట్టి యాలకులు, లవంగం, దాల్చినచెక్క, అనాస పువ్వు, నేతిలో దోరగా వేయించి రోట్లో దంచి మసాలా తయారుచేసుకొనేవాడు. అదే పాత్రలో జీడిపప్పు వేయించుకొని పెట్టుకొనేవాడు. ఆ తరువాత అంతా విష్ణుమాయ. ఇవే పదార్ధాలతో ఓ నలభైసార్లు నేనూ పనసపొట్టు కూర వండి ఉంటాను. నలభైసార్లూ చక్కగా కుదిరింది. కానీ కూర వేడి అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు మైమరుపుగా మూతలు పడలేదు. తింటున్నంత సేపు ప్రపంచం ఇంద్రధనస్సు మీద ఊయలలూగలేదు. తిన్నాక నాలుక నాకు తృప్తిగా థాంక్యూ చెప్పలేదు. అదీ సంగతి. మావయ్యా.. మజాకా?

కొత్తగా.. రెక్కలొచ్చెనా.. :  బెంగుళూరు వెళ్ళండి. జేపీ నగర మూడో ఫేస్ బస్ స్టాండ్ ఎదురుగా ఓ పార్క్ ఉంటుంది. ఆ రోడ్ లో అలా నడుస్తూ వెళ్ళండి. ఓ రెండు వందల అడుగులు వేసాక ఇంక మీ కాళ్ళు నడవనంటాయ్. ముక్కు మూరెడు పొడవున ముందుకు పెట్టి మరీ గాలి పీల్చుకుంటూ, ఓ నాలుగైదు నిముషాలు పారవశ్యంలో మునిగిపోయాక అప్పుడు మెదడు పనిచెయ్యడం మొదలుపెడుతుంది. "ఓయ్.. ఇదేం సువాసన.. ఇదేం మత్తు.. కాఫీ... కాఫీ.. ఏదీ... ఎక్కడ..?? " అని కేకలు వినిపిస్తాయ్ మీ లోంచి మీకే. మీకు కుడివైపు "కొత్తాస్ ఫిల్టర్ కాఫీ" (Cothas Coffee)  తయారుచేసే బ్రూవరీ ఉంటుంది. అక్కడ వాసనే తప్ప కాఫీ దొరకదు. వాచ్ మన్ మిమ్మల్ని చూసి "లక్షా ఎనభైవేల మూడొందల నాలుగో పిచ్చాడు" అని నవ్వుకొని లెక్క రాసుకుంటాడు. అస్సలు సిగ్గు పడకుండా శక్తి కూడగట్టుకొని ఒక్క ఏభై అడుగులు వేసారా.. అక్కడ 'పార్క్ వ్యూ' అని ఓ చిన్న రెస్టారెంట్ ఉంటుంది. అందులో కొత్తాస్ వాడి స్టాల్ ఉంటుంది. చిక్కటి నిశిధిలాంటి ఫిల్టర్ డికాషన్ కళఫెళా మరుగుతున్న కమ్మటి పాలలో కలిపి మోక్షాన్ని గ్లాసులో పోసి అందించే శ్రీ మహా విష్ణువులా అందిస్తాడు. ఓ దండం పెట్టి దక్షిణ చెల్లించుకొని పక్కకి రండి. పంచదార కలుపుకున్నారా? ఆ.. ఇంక కానివ్వండి.

మొదటి సారి ఆ కాఫీ తాగి పార్కంతా భానుప్రియలా ఎగురుకుంటూ పాట పాడాక తెలిసింది. "కొత్తగా రెక్కలొచ్చెనా.." పాట తమిళంలో, మళయాళంలో, కన్నడలో కూడా చాలా మంది భానుప్రియలు, వెంకటేష్లు పాడుతూ బెంగుళూరంతా తిరుగుతూ ఉంటారని. నమ్మ బెంగళూరంతా కొత్తాస్ వాడి స్టాల్స్ ఉంటాయి.  కోత్తాస్ ఫిల్టర్ కాఫీకీ జై!

ఓ రాజస్థానీ ప్రేమ వంటకం : తిరుపతి లడ్డూ ఆత్రంగా ఓ పెద్ద ముక్క నోట్లో పెట్టేసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? గుటుక్కున మింగలేరు. అలా అని ఉమ్మనూలేరు. ఉక్కిరిబిక్కిరిగా ఉన్నా భరించేస్తాం. తప్పక కాదు. ఇష్టమైన కష్టం కనుక.  అచ్చం అలాగే ఉంటుంది తొమ్మిదో నెల గర్భం అంటే. (తెలియని వాళ్ళకి చెప్తున్నాసుమండీ! ) నిండు చూలాళ్ళు ఓ ముగ్గురిని (నేను, నా ఇద్దరు స్నేహితురాళ్ళు) భోజనానికి పిలిచింది మా రాజస్థానీ దోస్తు పూనం. ఆపసోపాలు పడుతూ వెళ్ళి కూలబడ్డాం. ఇల్లంతా ఆనంద నిలయుని పోటులా నేతి వాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. కాస్త స్థిమితపడ్డాక "వీటిని దాల్ బాటి అంటారు.  భలే బావుంటాయ్. మీరు తిని ఉండరని చేసాను." అని తలో ప్లేటు చేతికి అందించింది. మేం ముగ్గురం తెలుగు వాళ్ళమేలెండి.

గోధుమ పిండి తో చేసిన లడ్డూలు అవెన్లో ఉడికించి నేతిలొ ముంచి తీస్తారు. వాటిని బాటీ అంటారు. లవంగం, దాల్చిన చెక్క వేసి ఉడికించిన కంది పప్పు లో నేతి తాలింపు దట్టించి వేసి ఆ పప్పు ఈ బాటీల మీద పొసి, పైన తలో గరిటెడు నెయ్యి పోస్తారు. ఎన్ని కేలరీలో లెక్కపెట్టుకోవడం అనవసరం. రుచి ఎలా ఉంటుందని అడగండి చెప్తాను. గోధుమ పిండి దేవతలు, పప్పు దేవతలు కలిసి నేతి దేవత ని తోడు తీసుకు వచ్చి "ఓహోహో భక్తులారా.. మీ జన్మ ధన్యం చేసుకోండి" అని ప్రసాదించిన పరమాద్భుతమైన పదార్ధమే దాల్ బాటి. కడుపులో కూనలని కాస్త పక్కకి జరిపి మరీ దట్టించేసాం. ఆ రుచి అమోఘం. మహత్తరం!! ఆ కమ్మదనాన్ని పూనం ప్రేమతో మాత్రమే పోల్చగలను.

లా రోసాస్ . . Amore mio : మరువం, తులసి మనం తలలోకి, పూజకీ వాడితే Pizza లో వేసి ప్రపంచాన్ని జయించేసారు ఇటాలియన్స్. నాకు మొదట్లో Pizza అంటే అంత గొప్ప అభిప్రాయమేం ఉండేది కాదు. ఓ వర్షం కురిసిన రాత్రి వంటచేసే ఓపికలేక, ఇంటిపక్క ఉన్న Pizzeria కి వెళ్లేవరకూ. అదే 1945 లో పుట్టిన "LaRosa's Pizzeria." వెజ్జీ మీడియం అని చెప్పి కూర్చున్నాం. పది నిముషాల లో ఓ వేడి వేడి వృత్తాకారపు slices of love మా ఎదుట నిలిచింది. గొలుసు  Pizzeria ల్లో తిని ఉన్న వాళ్ళ ఊహలకి కూడా అందదు ఈ Pizza. హోటల్ లో తిన్న ఇడ్లీ కి, అమ్మ చేసి పెట్టిన ఆవిరి కుడుము కి ఉన్నంత తేడా. అక్షరాలా హస్తిమశకాంతరం. 

 చక్కగా ఆలివ్ నూనెతో కలపబడిన రొట్టె మీద దేశవాళీ provolone, mozzarella cheese  వేసి, చక్కటి రోమా టొమాటోలతో  marjoram వేసి చేసిన సాస్ పూసి, దాని మీద ఆర్టిచోక్ హృదయాలు, బెల్ పెపర్ (కాప్సికం), వంకాయ, ఆలివ్స్ మరియూ బేసిల్ ఆకులు పరిచి సరైన ఉష్ణోగ్రతకి bake చేసి oven లోంచి తీసాక మళ్ళీ pizza అంచులపై ఆలివ్ ఆయిల్ పూసి అప్పుడే తురిమిన బేసిల్ ఆకులు జల్లి తెచ్చి పెట్టాడు. తింటూన్నది నోట్లో కరిగిపోవడం అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది.అసలు నేను ఆ Pizzeria కి వెళ్ళి ఉండకపోతే, అసలు నేను ఆ Pizza  తిని ఉండకపోతే.. అని ఊహించుకుంటేనే "హమ్మయ్యో!!" అనిపిస్తుంది.

అవండీ నాకు ప్రియమైన పదార్ధాలు. మరి మీకు?

(హితభుక్ మితభుక్.
మీకు ఎక్కువైన మెతుకు - ఆకలితో ఉన్నవారికి బతుకు .)